పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రస్వరూప రచన - కంచెలు

గుత్తపువన్నెల కీల్జడలతో, ముత్యాల కమ్మలతో, కెంపుల బొగడలతో, కాటుక కన్నులతో, పచ్చల కడియాలతో" మనకు గోచరించుచుందురు. గృహములు, సౌధములు శృంగారవనములు - వీరి వాసస్థానములు. వీరు తూగుటుయ్యెలలపై నూగుదురు. చలువ చప్పరముల శయనింతురు. శుకశారికాపంజరములు, నిలువుటద్దములు, మహార్హమైన శయ్యలు, కస్తూరి, జవ్వాజి, పన్నీరు. గంథములు వీరికి ప్రీతిపాత్రములు. క్షేత్రయ్య నాయికలలో వై విధ్యము కనిపించును. స్వీయలు, పరకీయలు, సామాన్యలు, కన్యలు, మధ్యలు, ప్రౌఢలు, ధీరలు, అధీరలు, ధీరాధీరలు, తృప్తలు, అతృప్తలు, తృప్తాతృప్తలు గోచరించుచున్నారు. ఈ నాయికల చెలిక త్తెలు సయితము సంస్కారవతులును, సంభాషణ చతురలును, హితోపదేశకరణ నిపుణలునై కన్పట్టుచున్నారు.

సాహిత్యదృష్ట్యా క్షేత్రయ్య తన పదములను లలితమును, మధురమునగు భాషతో పొదిగియున్నాడు. అర్థ గాంభీర్యము, అన్వయ సౌలభ్యము, భావసౌకుమార్యము మున్నగు గుణములకు ఇతని పదము లాటపట్టులు. ఇందు తెనుగు పలుకుబడుల తియ్యదనము నిండారియున్నది. ఉదా. “అసురసురన్నది; నాలిముచ్చు గయ్యాళి, దబ్బున, ఆదుకొనుట, వాలాయము, సరిప్రొద్దు, ఆగడము, మీసము దువ్వుట, ఆముకొన్న ప్రేమ, మోము చిన్న జేసుకొనుట ఇత్యాదులు, ఇవి నూటికినూరుపాళ్లు తెలుగుదనముకలవి.

క్షేత్రయ్య వాడిన కొన్ని శబ్దములు క్రొత్తపోకడలు కలిగియున్నవి. అటపచరించు, అన్నెకాడై, ముప్పొంగి, సడ్డ, మంతురాలు. నెంజలి అనునవి ప్రకృతోదాహరణములు.

కొన్ని శబ్దములు శబ్దరత్నాకర కారునిచే గృహీతములై, నిఘంటువున కెక్కి ప్రామాణ్యో పేతములైనవి. క్రియాదులందు ఒక్కొక్కచో వ్యావహారిక పదప్రయోగ పద్ధతియు కనిపించును. ఉదా : మనసుగట్టి చేసుకొంటివి; సిగ్గయ్యీని; గుండె దిగులుమనీని క్షేత్రయ్య వాడిన సామెతల చక్కదనము కొనియాడదగినది. ఉదా :


“బావిలో నీరు వెల్లువ బోవునట వే”
“కానివారి కివి వేడుకలాయె”
అరటాకు సామెత ”
"నొసటివ్రాత తప్పదాయె"
"కన్నీరు కావేరికాలువ"
“కలిబోసిన ఉట్టివంక జూచినట్లు"
“ఉట్టిపడ్డట్లు వచ్చె.

పద్యములందువలె యతిప్రాస నియమములతో పెక్కు పదములను క్షేత్రయ్య రచించినాడు. ఉదా :


మొగమాట మేలనే - మువ్వగోపాలుడుగాన
అగడైతి నిన్నుగూడి - అందరిలోన
....... ........ .......... ......... ........ ......... .........
మగువ! వాక్కుననొకటి - మదియొకటి యెంచుకొని
తెగనాడితివి మున్ను - తెలియలేనైతి నీతోడ

క్షేత్రయ్య తనపదములందు ధ్వనింపజేసిన వేదాంత మిది. విజయరాఘవుడే పరమాత్మ. జీవులు స్త్రీ ప్రాయులు. రాఘవుడు ప్రియతముడు. భక్తులు మొదట ఆతని గుణగణానుభవమును పొంది, ఆ గుణములను చక్కని వృత్తబంధములుగా, నవరసభరితములైన పాటలుగా, ప్రత్యక్షముగా ఆతనితో సంభాషించు నట్లుగా రచించి, అభినయ మూలమున, ఆతని కిష్టమగు సమయమున, ఏ యే భావవ్యంజకమగు పదము ఆతనికి అభిమతమో, దానినే పాడి, ఆతనిని రంజింపజేయుచు, తంబురాశ్రుతితో గానమొనర్చి, ఆతని పూర్ణానుగ్రహము పొంది, తన్నిరంతర ధ్యానమునందే, కీర్తనమునందే తమ జీవితమును ధన్యమొనర్చుకొన వలయును. ఇట్లు శ్రీ కృష్ణపరమాత్మతోడి మేళనమే సర్వజీవులకును ప్రాప్యమగు పరమపురుషార్థము.

ఇట్లు క్షేత్రయ్య పదములలో సంపూర్ణమైన సంగీత స్వరూపము గోచరించుచున్నది. ఇట్టి పదములు సంగీత సాహిత్యాభినయములందు కృతహస్తులైన సర్వకళా సరస్వతీ మూర్తులుతప్ప ఇతరులు రచింపజాలరు. ఆంధ్ర కవులలో అట్టివాడు క్షేత్రయ్య ఒక్కడే అనుట అతిశయోక్తి కాజాలదు. సంగీత సాహిత్యాభినయములు ఏకత్రప్రదర్శితము లైనపుడే క్షేత్రయ్య పదకళా సరస్వతి సాక్షాత్కరింపగలదు.

వే. తి.


క్షేత్రస్వరూప రచన - కంచెలు :

(Farm Layout and fences)

వ్యవసాయోత్పత్తిని శక్తిమంతముగ సాధించుటకు

163