పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రయ్య II (సాహిత్యము)

సంగ్రహ ఆంధ్ర

విదియ చందురులతో వెలయు చున్నది. 'అరచాటగు నాంధ్ర వధూటి చొక్కవుం జనుగవ' అగుటవలననే విదియ చందురులవంటి గోరువంకలు అటనుండుట గన్పడినది. ఇది రతిస్థాయి యగుట సరియే కాని నిర్వేదము, గ్లాని, విషాదము, పశ్చాత్తాపము, చింత, పరులు చూడకుండ తన కూటమిని సవరించుకొని తన ఇంటికి వచ్చుట అను సంచారు లిట లేవు. కావున ఈమె స్వీయయే. రతితృప్తయై తన కేళికామందిరమునుండి తెలవారగా వెడలు చున్నది. అనుభోగావస్థలోనిది ఈ శృంగారము. నాయకుడు అనుకూలుడు.

నాయిక - స్వీయ - అతృప్త:


                 రేగుప్తి రాగము - ఆది తాళము
ఒక్కసారికే యీలాగైతే - ఓహోహో! యిదేటి రతిరా !
దైన్యము, శ్రమ, హేళన, వితర్కము.
మక్కువ దీర్చర - మా మువ్వగోపాల !
        ఔత్సుక్యము, ప్రార్థన.
సొక్కియున్న నీ - సొగసది యేమిర ! ॥ఒక్క॥
   గ్లాని, హేళన, దైన్యము, శంక
నెమ్మొగమున నీ బడలిక లేమిర.
     శ్రమ, శంక,
       నీటుకాడ ! రొమ్మదిరే దేమిర.
       సొగసు, శ్రమ, వితర్కము.
కమ్మని వాతెర కందిన దేమిర!
హర్షము, వితర్కము, శ్రమ,
       కాళ్లును చేతులు తడబడుటేమిర ! ॥ఒక్క॥
       దైన్యము, శంక, వితర్కము.
కన్నుల నిద్దుర గమ్మే దేమిర!-
  అలసట, శంక -
    గళమున చెమ్మట కారే దేమిర!
    గ్లాని, అసూయ, వితర్కము.
తిన్నని పలుకులు - పలుకవ దేమిర !
    శ్రమ, గద్గదిక
   తెలిసి తెలియకున్నా వదేమిర! ॥ఒక్క॥
   జడత, గ్లాని, వితర్కము.
ఇనపురి ముద్దుల- మువ్వగోపాలా !
   ధృతి, హర్షము, ఔత్సుక్యము,

ఏపు మీర నను కలిసితివౌరా !
సంగ్రహ ఆంధ్ర
దైన్యము, ధృతి, హర్షము, రతిరీతులు, మోహము.
మనమున నిను నెర-నమ్మిన దానర !
   హర్షము, మోహము, ధృతి.
      మారు బలుకకున్నా వదేమిర ! ॥ఒక్క॥
   విషాదము, గ్లాని, అసూయ, వితర్కము.

ఈ నాయిక తన అతృప్తిని వెల్లడించుటలో నాయకు నందు కన్పడుచున్న అన్యాసంభోగ చిహ్నములను నిదర్శించు చున్నది. ఈమె పరకీయకాదు. "ఒక్కసారికే యీలాగై తే" అనుట ఈమెకు సహజముకాదు. అన్యాసంబంధపు బడలికతో పరకీయ యొద్దకు నాయకుడు పోవుటయు అస్వాభావికము; అసంభవముకూడా. కాగా నాయిక స్వీయయే. నాయకుడు పతి, దక్షిణుడు. నాయిక సురతాసక్తితో నెనసినది. తమిదీరలేదు – భావ ప్రాప్తి సిద్ధించలేదు. మొగమున బడలిక, రొమ్ము అదరుట, కమ్మని వాతెర కందుట మున్నగు ఈతని శరీర లక్షణములను జూచి ఈర్ష్యకలదైనది - ఖండిత యైనది. కాని ఈమె ధీర కాదు; అధీర, మధ్య. కావుననే నిష్ఠురము లాడుచు, అతని పొరపాటు అతనికి కనబరచుచున్నది. పై లక్షణము లన్నింటికి కారణమేమని గ్రుచ్చిగ్రుచ్చి అడుగుచున్నది.

నాయిక - స్వకీయ - స్వాధీన పతిక :

ఈమె సంభోగశృంగారమును అనుభవించిన ఆనందమును నిలుపలేక, ఇప్పటి తనప్రియుని ఇతరులు అపహరించు కొని పోకుండ దాచుకొనుటకై సకరుణముగా తహతహ పడుచున్నది. ఇందలి శృంగారము గమనింప దగినది.


             కళ్యాణిరాగము - రూపకతాళము
పల్లవి : ఎందుదాచుకొందు నిన్ను - ఏమి సేతునేను.
            భీతి, ఆవేగము, చపలత, భీతి.
అను ప : అందమైన నీ మోము - అయ్యారె !
            హర్షము, తృప్తి, విస్మయము,
              ముద్దులు గులుకుచున్నది.
            ఔత్సుక్యము, అభిలాష.
1. అందిందు తిరుగకురా ! - అతివలు నీతోడి.
  అమర్షము, దైన్యము - అమర్షము, హర్షము.

160