పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

ఇలా పరిమళించిన వారంతా పాతిక, ముప్పయి సంవత్సరాల లోపునే వారు చేరుకోవలసిన శిఖరాగ్రాలు చేరుకున్నారు. ఏభయ్యవ పడి దాటిన తరువాత గణిత శాస్త్రపు పురోగతికి దోహదం చేసిన వ్యక్తులు దరిదాపుగా లేరనే చెప్పాలి. అటువంటిది, 2013 లో, ఏభయ్ ఏళ్లు దాటిన "వయోవృద్ధుడు," అంతవరకు గణిత ప్రపంచానికి బొత్తిగా పరిచయం లేని ఒక "అనామకుడు," చదువు అయిన తరువాత ఉద్యోగం దొరకక చిల్లర పనులు చేసి పొట్ట నింపుకున్న ఒక "అప్రయోజకుడు" అకస్మాత్తుగా తారాపథంలో నవ్యతారలా ఒక్క వెలుగు వెలిగిపోయి అందరినీ ఆశ్చర్యచకితులని చేసిన వయినం ఇక్కడ చెప్పబోతున్నాను.

మన కథానాయకుడి పేరు ఈటాంగ్ జాంగ్ (జ. 1955). చైనాలో ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు ఆల్జీబ్రా ని చూసి గాభరా చెందిన ఈ వ్యక్తి పర్డు (Purdue) యూనివర్సిటీ నుండి 1991 లో పి. ఎచ్. డి. పట్టా పుచ్చుకున్నాడు. ఆయనకి మార్గదర్శిగా ఉన్న ఆచార్యుడితో స్పర్ధలు వచ్చిన కారణంగా, సిఫార్సు (“రికమెండేషన్” ఉత్తరం) లేనందువల్ల జాంగ్ కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదుట. ఈ పంచనీ ఆ పంచనీ చేరి పొట్టపోసుకుంటూ, తాడు తెగిన గాలిపటంలా, ఉన్న జాంగ్ ని చూసి జాలిపడి ఒక స్నేహితుడు యూనివర్శిటీ అఫ్ నూ హేంప్‌షైర్ లో, 1999 లో, ఉపన్యాసకుడు (“లెక్చరర్”) ఉద్యోగం ఇప్పించేడు. అక్కడ “కేలుక్యులస్” పాఠాలు చెప్పుకుంటూ, 2001 లో ఒక పరిశోధనా పత్రం ప్రచురించేడు కాని అది ఆయన, ఆ పత్రికా సంపాదకుడు తప్ప మరెవ్వరూ చదివిన దాఖలాలు లేవు. తరువాత 2013 లో ప్రచురించిన రెండవ పత్రంతో దిక్కులు పిక్కటిల్లేలా జాంగ్ పేరు గణిత ప్రపంచంలో మారుమోగిపోయింది. జాంగ్ పరిష్కరించిన సమస్యని నియమిత విరామ సమస్య (the bounded gap problem) అని పిలుస్తారు. ఇది ప్రధాన సంఖ్యల అధ్యయనంలో తారసపడే అతి క్లిష్టమైన సమస్య. పరిష్కారం లేకుండా రెండు శతాబ్దాల నుండి వేధిస్తూన్న సమస్య!

9.2 ప్రధాన (అభాజ్య) సంఖ్యలు

ప్రధాన సంఖ్యలు (prime numbers) అనేవి 1 చేత గాని, తమ చేతే కాని మాత్రమే నిశ్శేషంగా భాగించడానికి లొంగేవి అని నిర్వచనం. ఉదాహరణకి 2, 3, 5, 7, 11, 13, 17, ......, వగైరాలన్నీ