పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.ప్రధాన సంఖ్యలలో కవలలు

కేవలం ఆకర్షణీయంగా మాత్రమే ఉండి, భార్యకి ఉండవలసిన ఇతర లక్షణాలు (కార్యేషు మంత్రీ, క్షమయా ధరిత్రీ, వగైరా) మరేవీ లేని వ్యక్తిని ఇంగ్లీషులో “ట్రోఫీ వైఫ్” (trophy wife) అంటారు. ఇదే విధంగా “పనికొచ్చే లక్షణాలు” లేని ఒక గణితశాస్త్ర విభాగం ఉంది. దానిని శుద్ధ గణితం (pure mathematics) అంటారు. ఇందులో “బొత్తిగా పనికిమాలిన” శాఖ మరొకటి ఉంది. దానిని సంఖ్యా వాదం (number theory) అంటారు. సంఘంలో ట్రోఫి వైఫ్ ఎలాంటిదో గణితంలో సంఖ్యా గణితం అలాంటిదని కొందరు చమత్కరిస్తారు. గణితంలో సంఖ్యా గణితాన్ని అధ్యయనం చేసేవారు సౌందర్యోపాసకులు. ఆ గణితంలో వారి కంటికి కనిపించే అందమే వారికి ఆనందదాయికం. ఈ శాఖలో ఉన్న మరొక ఉపశాఖని ప్రధాన సంఖ్యలు (prime numbers) అంటారు. ఈ ప్రధాన సంఖ్యలు ఎందుకు, ఎవ్వరికి, ఎక్కడ, ఎలా ఉపయోగపడతాయో చెప్పడం అనేది చెప్పే వాడి దృక్పథం మీద, వినే వాడి దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ వలయాలలో సమాచారం నుండి మరొక చోటకి రహస్య సంకేత లిపిలో పంపే కార్యక్రమాలలో ప్రధాన సంఖ్యల వాడకం విరివిగా కనబడుతోంది. ప్రయోజనాల మాట పక్కన పెడితే ఈ ఉపశాఖలో కనబడే అందం మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. గణితంలో ప్రావీణ్యం లేని వారు కూడ, గణితపు లోతులని తరచి చూసే సామర్ధ్యం లేని వారు కూడ ఈ ప్రధాన సంఖ్యల అందచందాలని చవి చూడకపోతే జీవితంలో ఒక వెలితి మిగిలిపోయినట్లే. అదృష్టవశాత్తు ఈ ప్రధాన సంఖ్యలలోని అందచందాలని చవి చూసి ఆనందించడానికి గణితం లోతుల్లోకి అతిగా వెళ్ళనక్కరలేదు.

9.1 అసాధారణ సంఘటన

ఈ అంశాన్ని ఇప్పుడు, ఇక్కడ ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య, అనగా, సా. శ. 2013 లో, గణిత ప్రపంచంలో ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఇది ఎన్నో విధాలుగా అసాధారణం. క్రీడా రంగంలో ప్రతిభ యువ తరానికి ఎలా పరిమితమో అదే విధంగా గణిత రంగంలో ప్రతిభ బాల్యానికీ, యువతకీ పరిమితం. గణితంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న వాళ్లంతా