పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ప్రధాన సంఖ్యలు

బుద్ధుడి రోజుల నుండి సా. శ. 300 వరకు ఉన్న కాలం నాటికే పైథోగరోస్ సంబంధీకులైన గ్రీసు దేశస్తులకి అంకెలలో ఏదో మహత్తరమైన శక్తి ఉందనే గట్టి నమ్మకం ఒకటి ఉండేది. ఈ నమ్మకమే నేటికీ మనకి ‘నూమరాలజీ’ రూపంలో కనిపిస్తోంది. అంకెలలో ఏదో నిక్షిప్తమైన శక్తి ఉందనే నమ్మకానికి కారణం కొన్ని అంకెలలో వారికి కనిపించిన వైపరీత్యమైన లక్షణాలు కావచ్చు.

ఉదాహరణకి యవనులకి (గ్రీకు దేశస్థులకి) ప్రధాన సంఖ్యలు (prime numbers) గురించి కొంత తెలుసు. ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? ఏదైనా n అనే ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవాలంటే దానికి రెండే రెండు కారణాంకాలు (factors) ఉండాలి: అవి 1, n అయి ఉండాలి. అప్పుడు ఆ సంఖ్యని ప్రధాన సంఖ్య అంటారు. ఉదాహరణకి 2, 3, 5, 7, 11, 13, 17 మొదలైనవి ప్రధాన సంఖ్యలు. (ఈ నిర్వచనం ప్రకారం 1 ప్రధాన సంఖ్యల జాబితాలో ఇమడదు. ఇప్పటికీ 1 ని ప్రధాన సంఖ్యగా పరిగణించిన సందర్భాలు కొన్ని పాత పుస్తకాలలో కనిపిస్తూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!)

8.1 ఇరటోస్తనీస్ జల్లెడ

ప్రాచీన కాలంలో, ఈజిప్టు లోని అలెగ్జాండ్రియా నగరంలో, జగద్విఖ్యాతి చెందిన బృహత్ గ్రంథాలయం ఒకటి ఉండేది. ఇరటోస్తనీస్ (Eratosthenes, క్రీ. పూ. 276-194) అనే ఆసామీ ఈ గ్రంథాలయానికి అధిపతిగా ఉండేవాడు. సాధారణ శకం ఆరంభం కాని ముందు రోజుల్లో, ప్రపంచంలో, వేళ్లమీద లెక్కించదగ్గ మహా మేధావులలో ఈయనని ఒకరుగా లెక్కించడం పరిపాటిగా ఉండేది. ఆ రోజులలోనే భూమి గుండ్రంగా ఉందని లెక్క వేసి చెప్పటమే కాకుండా, భూమి యొక్క వ్యాసార్ధం ఎంతుంటుందో అంచనా వేసి చెప్పేడీయన. ఈ మేధావి ప్రధాన సంఖ్యల మీద కూడ పరిశోధనలు చేసి “ఇరటోస్తనీస్ జల్లెడ” అనే ఊహాత్మకమైన పరికరాన్ని ఒకదానిని మనకి ఒదిలిపెట్టి మరీ వెళ్లిపోయాడు. ఈ జల్లెడలో సంఖ్యలన్నిటిని వేసి “జల్లిస్తే” ప్రధాన సంఖ్యలన్నీ జల్లెడలో ఉండిపోతాయి, మిగిలినవి అన్నీ కిందకి దిగిపోతాయి.