పుట:Kavijeevithamulu.pdf/667

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

661

వివరింపుచు నాతఁడు 'వేమయయన్న వోతభూపాలునకు' సత్ప్రబంధము లొసంగెనని వివరించె. ఆపద్యము మొదటనే వివరింపఁబడినది. పై వేమయయన్న వోతభూపాలుఁ డెవ్వఁ డనుశంకఁ బొడమును. రెడ్డిరాజులలో వేమయనాములు పెక్కండ్రు గలరు. వారిలో శ్రీశైలములో నున్నపాతాళగంగకు సోపానములు కట్టించినవేమభూపాలుఁడు ప్రసిద్ధుడు. ఇతఁ డే కొండవీటిసీమలోఁ బ్రభుత్వము చేసినరెడ్డిరాజులలో మొదటివాఁడు. ఇదియ రెడ్లసంస్థానములలోఁ బ్రధానమగునది. పైరెడ్డివేమభూపాలున కిర్వురు పుత్త్రులు గలరు. వారిలో మొదటి యతనిపేరు అనవోతరెడ్డి. రెండవ యతనిపే రనవేమారెడ్డి. పైపద్యములలో వివరింపబడిన రెడ్డి రా జగు "వేమయయన్న వోతభూపాలుఁడు" వేమభూపాలుని పెద్దకుమారుఁడు. వెన్నెలకంటిసూర్యకవి యీవేమయయన్న వోతభూపాలునిపైఁ గృతులిచ్చినట్లుగా నతని మనమఁ డగుసూరనకవి పద్మపురాణమున వివరించె. విక్రమార్కచరిత్రములోని యీక్రిందిపద్యముంబట్టి పైవెన్నెలకంటి సూర్యకవి పై వేమభూపాలునిపేరఁగూడఁ గృతినిచ్చినట్లు కాన్పించు ఆపద్య మెట్లున్న దనఁగా :-

"ఉ. వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
      పన్నుఁడు రెడ్డివేమనరపాలునిచేత మహాగ్రహారముల్
      గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
      సన్నుతి గన్న సిద్ధనకు సంతత దానకళావినోదికిన్."

దీనింబట్టి చూడఁగా సూర్యకవి వేమారెడ్డికాలములోఁ గూడఁ గృతినీయఁదగినవయస్సులో నున్నట్లు తేలినది. ఇచ్చట పైవేమారెడ్డి వంశావళిని ముందు వివరించెదను అదెట్లన్నను :-