ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

71

నాకు లభించినది. ఆధ్యాత్మికముగా నాయన గాంధిజీకి వశంవదుఁడు. నిర్మాణప్రతిభ యాయనలో మూర్తీభవించినది. భారతజాతీయోద్యమకృషిలో నత్యంతప్రధానపాత్రను నిర్వహించినాఁడు. భారత స్వాతంత్ర్యసమరములో నతిరథుఁ" డన్నా రాహారమంత్రి కె. యం. మున్షీ.

"మనసు బాగుగా లేకపోయిన దివ్యౌషధము పటేల్"

"సర్దార్ పటేల్ పరిచయ మొక మేటి భాగ్యము. చూపులకు వజ్రకఠోరుఁడు. మనస్సు నవనీతము. నిష్కపటి! మంచి చతురుఁడు! సంభాషణలో దిట్ట. బాపూజీకి (గాంధీజీకి) కొంచెము మనస్సు బాగుగా లేకపోయినప్పు డౌషధము - సర్దార్‌తో భేటీ!

జన్మతః ప్రజానాయకుఁడు. దరిద్ర ప్రజలలో నొకఁడ నని భావించు నుదాత్తచిత్తుఁడు!

"ఆయన సాహసము, నాయన పట్టుదల, యాయన చిత్తశుద్ధి, యాయన త్యాగనిరతి, యాయనవలె జీవించుటయే యాయనను, గౌరవించుట కుత్తమమార్గ" మని ప్రస్తుతించినది రాజకుమారి అమృతకౌర్.

డాక్టర్ పట్టాభిః-

"సర్దార్‌జీ! మీకు నా యభివందనములు. నేడు డెబ్బదవ సంవత్సరము పూర్తిచేసికొని హస్తసాముద్రిక ప్రోక్తజీవితమును బూర్తిచేసినారు. ఉపనిషత్తులు చెప్పు పూర్ణాయుస్సుకు (116 సంవత్సరములు) నింకను 46 యేండ్లు మీరు గడుపవలయును.