ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

63

"ఈ వయస్సులో నాత్మీయులమధ్య నుండవలయునని యెవరు కోరరు? కాని నే నీ యైహిక వాత్సల్యబంధములను నేనాఁడో వదలుకొని, జాతీయస్వాతంత్ర్య సాధనాంబుధిలో మునిఁగితిని. దేశము దాస్యశృంఖలాబద్ధమై యున్నంతకాలము నేను జన్మించిన చిన్నగ్రామమునుగుఱించి నే నెట్లు గర్వింపఁ గలను? ఈ నగ్న సత్యము తెలిసివచ్చిననాటినుండి నా విశాల గృహ (భారతదేశ) స్వేచ్ఛకై పోరాడుచునే యున్నాను. జాతీయ స్వాతంత్ర్యమునకై నేను సాగించుచున్న సమరములో నాకు మార్గదర్శకుఁడుగా నుండి నాజీవితధర్మము (స్వరాజ్యము) త్వరలో ఫలప్రదమగునట్లు చేయవలసిన దని పరమాత్ముని బ్రార్థించుచున్నాను.

"దగ్గర బంధువులతోఁ గలసియుండవలయునని యెవరు కోరరు? తన జన్మస్థానమును జూచిరావలెనని యెవరి కుండదు? కాని స్వగృహముపట్ల నాప్రేమ, దేశముపట్ల ప్రేమాతిశయముగాఁ బరిణమించినదని మీకుఁ దెలియును. ఎప్పుడు కీలెఱిగి వాతపెట్టవలయుననియే నా కార్యాచరణమార్గము. నా జీవితకాలములో లక్ష్యసిద్ధిని జూడవలయునని కోరుచున్నాను. నా మాతృ దేశము సంపూర్ణ స్వాతంత్ర్యమును బొందిననాఁడే నేను నా గ్రామములోఁ బుట్టిన ఋణమును దీర్చుకోగలను.

"నేను 73 సంవత్సరములను బూర్తి చేసికొనుచున్నాను. ఇంక మఱికొంతకాలము జీవించవలెనని యాశించు చున్నాను. గాంధీజీ తనకుఁ దాను నియమించుకొన్న 125