ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[8]

వల్లభాయిపటేల్

57

ప్రకటించి యాపుచేసిరి. ఆ సాయంకాలము 4 గంటలనుండి మఱుదినము 8 గంటలవఱకు నా రోడ్డుపైననే వా రుండిరి. ఆ రెండవ నాటి యుదయము వల్లభాయి మొదలగు వారి నరెష్టుచేయించి యితర జనమును బోలీసులు దారుణముగా లాటీచార్జి చేసిరి. వల్లభాయి మొదలగు ప్రముఖులకు మూడేసి మాసములు శిక్ష విధింపఁబడెను.

ఇటు లా సంవత్సరములోఁ బదునొకండు నెలలలో మూడుమాఱు లరెష్టు చేయఁబడినాఁడు.

ఇండియాచట్టము మూడవ రెగ్యులేషను ప్రకారము 1932, 34 సంవత్సరాలలోఁ గారాగారశిక్షల ననుభవించినాఁడు.

1940 నవంబరులో వ్యక్తిసత్యాగ్రహములో నరెష్టు చేయఁబడెను. ఆయనయు కె. యం. మున్షీ ప్రభృతులు యఱ్ఱవాడ జైలులోనే యుండిరి. ఆ జైలులో నవ్వించుచుఁ దన బాల్య జీవితములోని మధురఘట్టములన్నిటిని దెలియఁ జేయుచు నాహార పానీయములలో నందఱ నాలనపాలనలు చేయుచుండు వాఁడని మున్షీ పేర్కొన్నాఁడు.

1941లో మున్షీ జబ్బుపడ్డప్పుడు తల్లి ప్రేమతో నాయనను సాకినాఁడు.

సాధారణలోక మాయనను గర్కశునిగాఁ దలఁచును. కాని సన్నిహితులైన వా రాయనలోఁ గన్నతల్లి ప్రేమ కలదని చెప్పుదురు. "నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణాఖండలశస్త్రతుల్య" మన్న భారతకర్తమాట సర్దారుకుఁ జెల్లుబడియగును. వేయేల? సర్దార్‌జీని గుఱించి, గాంధిజీ మాటలు గమనింపఁదగినవి.