ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

51

ఇంతేగాదు, ఆయన పలుకు ప్రతిపలుకు లిఖితరూపమున వ్రాసిపెట్టును. ఆయన కిచ్చు సన్మానపత్రములు దాచలేక యాయనకార్యసిద్ధి కార్థికముగా సహాయముచేయుట సముచితముకాదా యని సలహా లిచ్చుచుండును.

మాతృదేశమునకై పితృసేవకై, స్వసుఖము వీడిన త్యాగమూర్తి. ఇట్టి తనయును గన్న తల్లిదండ్రులు ధన్యులుగదా!

గురువుతో

గాంధీజీ రాజకీయా కాశములో షోడశకళలతో వెలిఁగి నప్పు డాయనచుట్టు ననేక నక్షత్రాలు గుమిగూడి ప్రకాశించినవి. గాంధీయుగములో గణనఁగాంచిన విశిష్టమహాపురుషుఁడు పటేలు.

మహాత్మునిశక్తి, కార్యదక్షత వల్లభాయిలోను, సేవా వినయము రాజేంద్రబాబులోను, మేధ, తత్త్వజ్ఞానము రాజగోపాలాచారిలోను, విరాజిల్లినవని యొక్కవిఖ్యాత పురుషుఁడు వచించినాఁడు. ఇందులో సత్య మధికముగానున్నది. [1] "బహుశః భారతదేశమంతటిలోను వల్లభాయికంటె నెక్కువభక్తుఁడైన సహచరుఁడు వేఱొకఁడులేఁడు. అత డతిశక్తిమంతుడు; తనపనిలో భీష్మప్రతిజ్ఞకలవాఁడు. అయిననుగాంధీజీయెడల స్వయముగను, నాయన యాదర్శము నెడలను, నీతియెడలను, భక్తిగలవాఁడు."

  1. నెహ్రూ ఆత్మకథ, 422 పుట.