పుట:2015.329863.Vallabaipatel.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

101

'సర్దార్ పటేల్‌'

[1]సందేహములులేవు; సంశయములులేవు. సంకోచములులేవు. డోలాందోళనలేదు. తనలక్ష్యములేవో తనకుఁ దెలియును. తనశక్తియుక్తులేవో తనకుఁదెలియును. తన బలప్రజ్ఞ లేవో తనకుఁదెలియును. సమయాసమయములు తెలియును. పట్టువిడుపులు తెలియును. అందుచేతనే సర్దారు వల్లభాయి పటేల్ లాలించవలసిన వారిని లాలించఁగలఁడు. బెదరించ వలసినవారిని బెదిరించఁగలఁడు. కీలెఱిగి వాతపెట్టఁగలఁడు. అదనుజూచి దెబ్బతీయఁగలఁడు.

ఆయన ప్రవృత్తిలో నావేశము తక్కువ. ఆలోచన యెక్కువ. కారుణ్యము తక్కువ, కాఠిన్యమెక్కువ. వైవిధ్యము తక్కువ, విస్పష్టత యెక్కువ.

ఆయన దృక్పథము సంకుచితమైనదే, కాని, దాని సరిహద్దులు నిర్దిష్టమైనవి. ఆయన లక్ష్యములు పరిమితమైనవే, కాని వానిసాధనలో నాయనప్రజ్ఞావిశేషము లపరిమితము.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకున్న సంస్కృతి యాయనకు లేదు. అయితే "నేనటు పాశ్చాత్యసంస్కృతికిఁ జెందిన వాఁడనుగాను. ఇటు ప్రాచ్యసంస్కృతికిఁ జెందినవాఁడనుగాను. ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచములు రెండింటిలో దేనిలోను బూర్తిగా నిముడలేకపోవుచున్నా"నని నెహ్రూకుఁ బట్టిన బాధ యాయనకు లేదు.

  1. ఆంధ్రప్రభ ప్రధాన వ్యాసమునుండి