పుట:2015.329863.Vallabaipatel.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

వల్లభాయిపటేల్

అయినప్పుడు గాంధీజీతర్వాత దాదా వంతటి దేశ నాయకుఁడుగా నాయన యేవిధముగాఁ గాఁగలిగినాఁడను ప్రశ్న రాకపోదు.

ఇందుకుఁ బ్రత్యుత్తరము నొకే యొక పదములోఁ జెప్ప వచ్చును.

ఆపద మిది - స్థితప్రజ్ఞత

భగవద్గీతలో స్థితప్రజ్ఞునిగుఱించి - పూర్ణ మానవునిగుఱించి చెప్పఁబడిన నిర్వచనము సర్దార్ పటేల్‌కు దాదాపు పూర్తిగా వర్తించును.

ద్వంద్వముల కాయన చాలవఱ కతీతుఁడు. సుఖము వచ్చినప్పు డాయన యుప్పొంగిపోఁడు. కష్టము నెదుర్కొన్నప్పు డాయనక్రుంగిపోఁడు. విజయలబ్ధిలో నాయన గర్వీభూతుఁడు కాఁడు. పరాజయము తప్పక పోయినప్పుడాయన విహ్వలచిత్తుఁడు కాఁడు. సహచరుల, ననుయాయుల నాయన మనఃస్ఫూర్తిగాఁ బ్రేమించును. అయినను వారిపట్లఁ గఠినముగాఁ బ్రవర్తించుట తన విధ్యుక్తధర్మమైనప్పుడు కాఠిన్యమును వహించుట కాయన సంకోచించఁడు. ఆయనలోఁగల యాస్థితప్రజ్ఞుని లక్షణముల కాయన జీవితచరిత్రలోఁగల తార్కాణము లశేషము, అగణితము.