పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

65

ఈప్రయత్న మిట్లు తుదముట్టినవెనుక జగ్గరాయలు రంగరాయలు బ్రతికియున్నంతదనుక యాచమనాయఁ డిట్టి ప్రయత్నములనుఁ జేయుచుండక మానఁ డని తలంచి రంగరాయని, వానికుటుంబమును దెగటార్చవలయునని నిశ్చయించికొని ఘోరమైన హత్యకుఁ బూనికొనియెను. యాచమనాయఁడు శక్తివంచనలేక యెన్నివిధములచేతఁ బ్రయత్నించినను రంగరాయని రక్షింపఁజాలకపోయెను. విధిచైదమున కడ్డమేమి యుండును?

ఒకనాఁడు జగ్గరాయలు నీచుఁడును, దుర్మార్గుఁడును, హంతకుఁడును, మానవస్వాభావికవర్తనమునకు విరుద్ధవర్తనము గలవాఁడు నగు తనసోదరుని రప్పించి వాని నిట్లు ప్రేరేపించెను. సోదరా! ఈయాచమనాయఁడు నాకు మనశ్శాంతి లేకుండఁ జేయుచున్నాఁడు. ఎప్పటికైన నీతఁడు మనప్రాణముల దీసికొనక మానఁడు. ఎన్నియో భూములు, ద్రవ్యము, పదవులు నొసంగెద నని యెంతయాస వెట్టినను, తనపట్టినపట్టు విడువక రంగరాయని పైగలప్రేమ వీడకయున్నాఁడు. ఎంత కాలము రంగరాయలు బ్రతికియుండునో యంతకాల మాతనిం దక్క యన్యులఁ గొలువఁజాలఁడు. రంగరాయల మరణము మనకు క్షేమకరము గావునఁ దక్కినవిషయము నీకు విడిచి పెట్టుచున్నాను."

ఇట్టి పల్కులు తనయన్ననోటనుండి వెల్వడినతోడనే యాదురాత్ముఁడు కత్తిదూసి "ఇదెంతటి కార్యము నేను