పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వెలుగోటి యాచమనాయఁడు

రాయనికిఁ దెలిసి తన యరువదివేలమంది సైనికులతో వచ్చి మనపైఁబడి మనల నఱకి వేయును. నీకు తోడుగా నీవంటి వీరభటులనే యైదునూర్ల మందిని నీకు స్వాధీనపఱచు చున్నాను. నీవు నాయకత్వమును వహించి చంద్రగిరిదుర్గమును భేదించి రంగరాయనిఁ జెఱనుండి విడిపించికొని రాఁ గలవా' యని ప్రశ్నించెను. ఇది యెంతకార్య మట్లే కార్యము నిర్వహించుకొని వత్తును. ప్రాణములనైన గోల్పోవుదును కాని రాయలను తీసికొని రాకుండ రిక్తహస్తములతో రా నని ప్రతిజ్ఞావాక్యములను ధైర్యముతోఁ బలికెను.

అ ట్లయిదువందలసైనికులతను సనద్ధము చేసి యాతనికి నాయకత్వము నొసంగి పంపెను. అంతట నావీరయువక నాయకుఁడు ధైర్యముతోఁ బోయి యాకస్మికముగా దుర్గముపైఁ బడి కావలివానిని సంహరించి ద్వారములను వెల్వరించి కొనిపోయి రక్షకసైన్యముపైఁ బడి నురుమాడఁగా వారి యెదుట నిల్వజాలక హతశేషు లయినవారు పఱువిడి పోయిరి. ఈ విజయవార్తను యాచమనాయకునికిఁ బంపుచు జగ్గరాయలును, వానిసైన్యములును వచ్చి మమ్ము ముట్టడించకమునుపే మాకు సహాయార్థము గొంత సైన్యమునుఁ బంప వలసిన దని యావీరయువకుఁడు ప్రార్థింపుచు వ్రాసెను గాని యీ సైన్యము వచ్చి వారిని గలిసికొనుటకుబూర్వమే జగ్గరాయలసైన్యములు వచ్చి దుర్గములోఁ జొఱఁబడి యాభటుల నొక్కని విడిచిపెట్టక సంహరించివైచిరి.