పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

వెలుగోటి యాచమనాయఁడు

జేర్చికొని యున్నాఁడని జగ్గరాయనికిఁ దెలియవచ్చెను. అట్లు తన్ను మోసపుచ్చినందుకు నతఁడు క్రోధోద్దత్తుఁడై రంగరాయని కారాగృహమునకు మునుపటికంటె నిబ్బడిగాఁ గాపువెట్టి యాతని వెచ్చమునకుఁగా నిచ్చుభృతిని తగ్గించుటయెగాక సన్నని బియ్యమునకు బదులుగా ముతుక బియ్యమును, చచ్చుపుచ్చు కూరగాయలను మాత్ర మిప్పించుటకుఁ గట్టడిచేసెను.

వెలుగోటి యాచమనాయఁడు రంగరాయని రెండవ కుమారుడు రామదేవరాయని మాయోపాయముచేతఁ జెఱనుండి విడిపించుకొని చెంతకుఁ జేర్చికొని వానికిఁ బట్టము గట్ట నున్నాఁడనువార్త యగ్నిహోత్రమువలె సర్వత్ర వ్యాపించెను. అంత రంగరాయని పక్షమువారు, జగ్గరాయల భయముచే నణఁగిమణఁగి పడియున్న మండలాధిపతులు, దండనాయకులు, తదితరులు నిట్లు తలపోసిరి. "ఈరాజ్యమునకు వాస్తవమైన హక్కుదారుఁడు రంగరాజుగాని జగ్గరాజు మేనల్లుఁడు కాఁడు. వాఁడు కృతిమపు ప్రభువు. వీనికి సామ్రాజ్యము కట్టఁబెట్టుట మనకు ధర్మము కాదు. కనుక మనమెల్లరము మనసైన్యములతో జగ్గరాయల బంధము నుండి తప్పించుకొని యాచమనాయని సైన్యములలోఁ జేరి రామదేవరాయనికిఁ బట్టము గట్టుట పరమధర్మము."

ఇట్లు చింతించి వా రెల్లరును ధైర్యసాహసములఁ జూపి తమతమ పరివారములతోను సైన్యములతోను యాచ