పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

వెలుగోటి యాచమనాయఁడు

మేనల్లుని సార్వభౌమునిగఁ బ్రకటించి మండలాధిపతుల నెల్ల నంగీకరింప నిర్బంధించెను. ఎల్లరును జగ్గరాయలయెడఁ గల భీతిచే కానుక లర్పించి కృతప్రణాయి లయిరి. కాని యొక్క మాండలికుఁడు మాత్రము రాఁ డయ్యెను. అతఁడే పెనుమాడి మండలాధిపతి వెలుగోటి యాచమనాయఁడు. ఇందునకు యాచమనాయనిపై గినిసి జగ్గరాయలు తక్షణము వచ్చి యీనూతన ప్రభువునకుఁ గృతప్రణాముఁడ వయి నీవు పంపవలసిన కానుకలనుఁ చెల్లించిపోవలసిన దని సమాచారము పంపెను.

"అనామధేయుఁడైన యొకబాలునికి కానుక లర్పించు మనుష్యుఁడనా ? కానని చెప్పుము. నాప్రభువు శ్రీరంగరాయలు. వానికే నా కానుకలు; వానికే నా ప్రణామములు; వాని ప్రయోజనముకొఱకే యీకత్తినివరలోఁబెట్టక చేత బట్టియున్నాను. పో; పొమ్ము; పోయి నా యీపల్కులు నీ ప్రభువునకు నివేదింపుము" అని యా శూరుఁడు పలికెను.

ఇట్టిస్వాతంత్ర్యముతో గర్జించి పలికిన పలుకులు జగ్గరాయలచెవినిఁ బడినపుడు "ఓహో! ఇతఁడు వట్టిమూర్ఖుని వలె నున్నాఁడు. నాలుగువేల సైన్యము మాత్రమె గల తా నేమి చేయఁగలఁడు" అని పలికి 'నీవు మా సన్నిధానమునకు రానియెడల మేమె నీకడకు వచ్చి నిన్ను నాశనముఁ జేయుచున్నా' మని రెండవమాఱు మరల సమాచార మంపెను.

అందులకా మహాశూరుఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.