పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[4]

విశ్వనాథనాయకుఁడు

25

మూలముగాఁ దెలియఁజేసెను. పాండ్యులను జయించుట యరియనాథ మొదలారికి సాధ్యపడనందున విశ్వనాథనాయఁడు తానే బహుళసైన్యసమేతుఁడై తెంగాశిపై దండెత్తిపోయి జయింపవలయునని నిశ్చయించుకొనియెను. అచ్యుతదేవరాయల వారు విశ్వనాథనాయనివారు పంపినదూతచే దక్షిణదేశము నందలి రాజకీయపరిస్థితులనన్నిటినిఁ దెలిసికొని యింకను నుపేక్ష వహించి యూరకుండుట ప్రమాదకరమని భావించి యశేషసైన్యములతో తిరువడి రాజ్యముపై దండెత్తివచ్చెను. ఈ సమయమున నీతనికి విశ్వనాథనాయనివారును, నీయనకుమారుఁడు కృష్ణప్పనాయనివారును స్వాగతమిచ్చి బహువిధములుగాఁ దోడుసూపి రాయలవారి మన్ననకుఁ బాత్రులయిరి. అచ్యుత దేవరాయలవారు తిరువడి రాజ్యాధిపతియైన భూతల వీరరామవర్మను యుద్ధములో జయించిరి. అతఁడు విజయనగరసామ్రాజ్యాధీశ్వరునితోఁ బోరాడి నిగ్రహించుట వ్యర్థమని తలంచి సుచీంద్రముకడ సంధి చేసికొని సామ్రాజ్యమునకుఁ జెల్లింప వలసిన కట్నమును జెల్లించి మైత్రికలిగి యుండుట కొప్పుకొనియెను. తెంగాశి పాండ్యులుగూడ విశ్వనాథనాయనివారితోఁ బోరాడలేక యాతనితో సంధిచేసికొని మైత్రి నెఱపవలసిన వారయిరి. అచ్యుతదేవరాయలవారు తమకార్యమును సాధించి దేశము స్వస్థతఁగాంచిన వెనుక విశ్వానాథనాయనివారినే పాండ్యమండలాధీశ్వరునిగాఁ నంగీకరించి యారాజ్యభారము నంతయు వానికి విడిచిపెట్టి విజయనగరమునకు మరలిపోయిరి.