పుట:1857 ముస్లింలు.pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఎదిరించే యోధులు ఎక్కడా కన్పించక పోవటంతో సైనికులకు ఎక్కడలేని ఉత్సాహం తన్నుకు వచ్చింది. ఆంగ్ల సైన్యాలు, సైనికాధికారులు, ఆ అధికారుల తొత్తులు నగరప్రజల పట్ల విశృంఖలంగా ప్రవర్తిస్తూ, నగరాన్ని విద్వంసం చేయడానికి పూనుకుని యధేచ్ఛగా తమ విద్వంసకర కిరాతక చర్యలకు శ్రీకారం చుట్టారు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ప్రారంభించిన వారు, పాల్గొన్న వారు, ప్రోత్సహించిన వారు ప్రధానంగా ముస్లింలేనన్న స్థిర అభిప్రాయానికొచ్చిన బ్రిటిష్‌ పాలకులు ముస్లింల మీద దారుణంగా విరుచుకుపడ్డారు. ఎటువంటి విచారణ లేకుండా వివిధ ప్రాంతాలలో ముస్లింలను యధేచ్ఛగా ఉరితీశారు. తుపాకులతో కాల్చివేశారు. ఫిరంగులకు కట్టి పేల్చివేశారు. అందుబాటులో ఉన్న చెట్టునల్లా ఉరికంబాలుగా మార్చి వేలాది సమర యోధులను ఉరితీశారు. చెట్టుకొమ్మలు కూడా కన్పించనంతగా మృత కళేబరాలు వారాల తరబడి ఆ చెట్లకు వేలాడయని ఆంగ్లేయ చరిత్రకారులు తమ గ్రంథాలలో వివరించారు.

ప్రపంచాన్ని పాలించగల సత్తా తమకు మాత్రమే ఉందని విర్రవీగిన ఆంగ్లేయులను సవాల్‌ చేసి తిరగబడిన వీరుల మీద కసితీర్చుకునేందుకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ తన ఆంగ్లేయ అధికారులకు, సైనికులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి తిరుగుబాటు యోధుల, ప్రధానంగా ముస్లింల ఊచకోతకు పురికొల్పింది. ఈ ఊచకోత, విధ్వంసం, దోపిడి ఏ స్థాయిలో సాగిందంటే ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో స్వయంగా పాల్గొన్న ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని కొందరు సైనికాధికారులు కూడా ఈ దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారులకు లేఖలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆంగ్లేయాధికారి జాన్‌ లారెన్స్‌, మరొక సైనికాధికారి జనరల్‌ పెన్నీకి విచక్షణారహితంగా సాగిన మారణ కాండ మీద తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖలో ‘ I believe we shall lastingly, and indeed, Justly be abused for the way in which we have despoiled all classes without distinction...I have heard, though it seems incredible, that officers have gone about and murdered natives in cold blood ‘ - The Great Mutiny, Christopher Hibbert, Penguin Books, India, 1980, P. 317)అని పేర్కొన్నాడు.

194