పుట:1857 ముస్లింలు.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

1857 లో 'ముస్లిం' పాత్రను 'ప్రత్యేకంగా' చెప్పాల్సిన అవసరముందా అంటే తప్ప కుండా ఉంది; ముఖ్యంగా మతోన్మాదశక్తులు విజృంభిస్తున్న ఈ సందర్భంలో దీని అవసరం యింకా ఎక్కువగా ఉంది.'పుట్టకముందే దేశద్రోహుల జాబితాల్లో' ముస్లింల నమోదు జరుగుతున్న విషమ సందర్భంలో దేశం కోసం ముస్లింలు చేసిన త్యాగాలను మళ్ళీ-మళ్ళీ గానం చేయాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఈ పుస్తకమే పరమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. వలసవాదుల దాస్యశృంఖాలాల నుండి 'మాతృభూమి' ని విముక్తం చేయడానికి గర్జిస్తున్న ఫిరంగి కుహరాలను అద్వితీయ ధైర్యంతో ఆలింగనం చేసుకొనీ, చెట్ల కొమ్మలకు ఉరితీయబడి ఊయలలూగి ఇంకా ఇలా ఎన్నో రకాలుగా రక్తతర్పణ చేసినందుకూ, సర్వం త్యాగం చేసినందుకూ స్వతంత్య్ర భారత ప్రభుత్వం ముస్లింల కేమిచ్చింది? త్యాగాల బాటలో సాగినందుకు స్వతంత్ర భారతంలో వాళ్ళకు ఒరిగిందేంటి? లాంటి బలమైన ప్రశ్నలతో ముస్లిం సమాజం భారత ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరముందని పరోక్షంగా చెప్తుంది. సమాన భాగస్వాములై పోరాడినందుకు సహజవనరుల్లో సమాన వాటాను డిమాండ్‌ చేయగలిగే నైతిక బలాన్నీ, హక్కునీ ముస్లిం సమాజానికి అందజేస్తుందీ పుస్తకాస్త్రం. వివక్షారహిత, అసమానతారహిత భారతదేశాన్ని కోరేవారందరికీ యిలాంటి అక్షరాస్త్రాలను అందచేస్తున్న నశీర్‌కు హృదయపూర్వకంగా సలాం.
1857 గూర్చి ఉధృతమైన చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ పుస్తకం రావడం, అందునా తెలుగులో రావడం ముదావహం. మన భాషలో మన కథను మనకు ఒపిగ్గా చెప్పిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌కు అస్సలాం.