పుట:1857 ముస్లింలు.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయ వాక్యం

మహబూబ్‌ బాషా
కోఆర్డినేటర్‌, చరిత్రశాఖ
బాబా సాహెబ్‌ భీంరావ్‌ అంబేడ్కర్‌ కేంద్రీయ విద్యాలయం
లక్నో, ఉత్తర ప్రదేశ్‌.

నిశ్శబ్ద కుట్రను బద్ధలు కొడుతున్న రచన(లు)

వర్తమానాన్ని గుప్పెట్లో పెట్టుకొనేవారు గతం మీదా, గతాన్ని గుప్పెట్లో పెట్టుకోనేవారు భవిష్యత్తు మీదా తిరుగులేని ఆధిపత్యం చలాయించగలరని సుప్రసిద్ధ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ అన్నారు. భవిష్యత్తు మీద ఆధిపత్యం సాధించడానికై గతాన్ని (చరిత్ర) గుప్పెట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగా ఉందో దీని ద్వారా స్పష్టమౌతోంది. ఈ విషయం అణగారిన వర్గాల కన్నా అణిచివేసే వర్గాలకు బాగా తెలుసు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాల్లోనూ ఆధిపత్యవర్గాలు చరిత్ర పరిజ్ఞానాన్ని తమ గుప్పెట్లో వుంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ భావజాలానికి తోడ్పడి, ఆధిపత్యానికి అండగా ఉండే విధంగా చరిత్ర జ్ఞానాన్ని వడగట్టి దాన్ని మాత్రమే ప్రజలలో ప్రచారం చేశాయి/చేస్తున్నాయి: తమ ఆధిపత్యానికి గండిపెట్టగల జ్ఞానాన్ని, మరుగునపరచడమో, ధ్వంసం చేయడమో చేశాయి. తమ వర్తమాన, భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా గతాన్ని మలచడమూ, వ్యాఖ్యానించడమూ చేస్తూ వచ్చాయి. అయితే పీడిత వర్గాలు ఎలాంటి స్పందనా, ప్రతి చర్య లేకుండా మౌనంగా కూర్చోలేదు; ఆధిపత్య చరిత్రను పూర్తిగా అంగీకరించలేదు. అవి కూడా చాలా బలహీనంగానే అయినా, తమ ధిక్కార స్వరాన్ని వినిపించే ప్రయత్నంలో భాగంగా తమ గతాన్ని (చరిత్రను) సొంత చేసుకోవడం, మలచుకోవడం, తద్వారా వర్తమానంలో ప్రేరణ పొందడం చేస్తూ వస్తున్నాయి.
భారతదేశ విషయానికొస్తే తమ వలసాధిపత్యానికీ, సామ్రాజ్యవాదానికీ నైతిక బలాన్నీ, చట్టబద్ధతనూ, భారత ప్రజల ఆమోదాన్నీ సాధించడానికి వలసవాదులు భారతదేశ చరిత్రను 'తయారు చేసి' ప్రజల్లో ప్రచారం చేశారు. వలసాధిపత్యాన్ని ప్రతిఘటించడానికి తగినంత