(చ) కమలనేత్రి (3-1) వనజనేత్రి (4-1) విశాలనేత్రి (5.5) అంభోరుహనేత్రి (15-3) ఇత్యాదిస్థలములందు నేత్ర యనుటకు నేత్రి యని ప్రయోగించుట.
(ట) వల్లభ యనుటకు బదులుగా వల్లభి యనుట (4-1, 5-3)
(త) బాలిక యనుటకు బదులుగా బాలకి యనుట (5-5)
(ప) ఉదయించె ననుటకు బదులుగా ఉదియించెనని తఱచుగాఁ గన్పట్టుచున్నది.
(గ) అకారాంతశబ్దములకు డుప్రత్యయము పరమైనప్పుడు ప్రకృతిరూపమందలి చివరియకారమున కుకారము రాకుండుట - బ్రహ్మదేవండు (40-3,5) శరణండు (46-14) భీమనిన్ (48-2) మల్లిదేవండు (58-12,13).
2. డుప్రత్యయాంతశబ్దములు కొన్ని డుప్రత్యయము లేకయే కనఁబడుచున్నవి. చోడుఁడు అనుటకు బదులు చోడు (58-7) తమ్ముఁడు అనుటకు బదులు తమ్ము (58-15,16)
3. నన్నయభట్టారకుని కవిత్వమందుఁ గలప్రయోగవిశేషములు కొన్ని యీశాసనములందుఁ గనుపట్టుచున్నవి.
(క) “అందు” నకుఁ బ్రయోగవిశేషము. (16-6)
(చ) ప్రథమకు బదులుగా షష్ఠీవిభక్తి ప్రయోగము. నీపడసిన (9) వెలనాంటిచోడినృపునిచ్చిన (42-1)
(ట) అస్వమేధంబున ఫలంబు (1)
4. కళలపై వచ్చు కచటతపలకు గసడదవాదేశము సాంస్కృతికములందు సైతము తఱచుగాఁ గనఁబడుచున్నది. ఈయాదేశము నిత్య మనియే పూర్వులు భావించినట్లు కనుపట్టుచున్నది.