పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయినట్లును గనఁబడుచున్నది. పలుకుబడి యీవిధముగా మాఱినను వ్రాఁతమాత్రము మఠంబు అనియే కొంతకాలమువఱకు నుండెను. మఠమ్ము అనురూపము గ్రంథములందుఁ గానవచ్చుచున్నది, గాని, శాసనములం దంతగాఁ గనుపడుట లేదు. ప్రాసార్థము కవు లారూపము నంగీకరించియుందురు.

(చ) మూఁడవశాసనములో “బురుడించ్చునట్లు” అనుచోట “బురుడించునట్టుల” అనియు నాలుగవశాసనములో “శ్రీశకునేణ్డ్లు" అనుచో “శ్రీశకునేణ్డులు" అనియుఁ దొమ్మిదవశాసనములో “ఇష్ట్లకు" అనుచోట “ఇష్టులకు" అనియు “గుడ్లకు" అన్నచోట "గుడులకు" అనియు, నిరువదియొకటవశాసనములో “చెఱ్వు" (2 వ పద్యము) అనుచోట "చెఱువు" అనియుఁ జదువవలయును. ఈజంటరూపములం దసంయుక్తరూపములే పూర్వరూపములు. సంయుక్తరూపములు తరువాత వచ్చినవి. అయినను వాని కొకానొకప్పు డసంయుక్తోచ్చారణమే చెప్పవలసియున్నది. సంశ్లిష్టములుగా నుండవలసిన యక్షరములు కొన్నితావుల విడిగా వ్రాయఁబడినవి. ఉదా:- నిలిపె (39వ శాసనము.)

(ట) ఋకారమునకు బదులుగా ఇకారసహితరేఫమే ప్రాచీనశాసనములలోఁ గనఁబడుచున్నది. ఉదా:-బ్రింద, వ్రిక్షము, మ్రిగాంక (10 వ శాసనము) సమ్రిద్ది (41-6). ఒకానొకప్పుడు “నృ" అనుదానికి బదులుగా “ంద్రి" అనురూపము కనఁబడుచున్నది. ఉదా:- సూంద్రిత (41-2) సకంద్రిపావనీపాల (41-13).

(త) పాదాంతములందుఁ గేవలము హల్లుగా నుండవలసిన నకారలకారములు సాధారణముగా అజంతములుగానే కనఁబడుచున్నవి. అచ్చునకుఁ బలుకుబడి లేదు. ఒకానొకచోట నకారము పొల్లురూపమును గలదు. ఉదా:- అర్థిన్ (2-1) హేతిచేన్ (52-2) పదమ