పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

దీనికి నిమిత్తంబును దైవనియమంబు గల దది విను మెఱిం
గించెద.

110


తే.

బ్రహ్మకును సరస్వతికిని బ్రణయకలహ
మయ్యె మును పొక్కనాఁ డపు డబ్జభవుఁడు
తద్విరహపీడ సైరింపఁ దరము గాక
వాణిఁ దేర్పఁ దదాప్తు లెవ్వారొ యనుచు.

111


క.

ఆరసి ననుఁ బిలిపించెను
శారదకడ నప్పు డేను సరసక్రీడా
చారసచివత్వమున సం
చారముఁ గావించు చునికిఁ జంద్రనిభాస్యా.

112


వ.

అట్లు పిలిపించి నన్నుం దనపొలఁతిపొలయలుకం దీర్చుటకుఁ
బనుపుచుండి యద్దేవి నుద్దేశించి.

113


సీ.

నీసుప్రసాదసన్నిధిమహత్త్వమ సుమీ
            నిగమరాశి ముఖస్థ మగుట నాకు
నీవిలాసమచర్చికావిశేషము సుమీ
            సంగీతసాహిత్యసౌరభంబు
నీకటాక్షశ్రీవిపాకభేదమ సుమీ
            వేణువీణాదులరాణ లెల్ల
నీ వనుగ్రహలీలఁ గావించుటన సుమీ
            యఖిలలోకవ్యవహారసిద్ధి


తే.

కావున నొకింత యోవాణి నీ వలిగిన
నొకవినోదంబు నొదవ దే నోర్చు టెట్లు
విరహ మేకాంతదాస్యకింకరునియందుఁ
గరుణ లే కింతతడ వలుగంగఁ దగునె.

114