పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/17

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పన్నులు వేస్తున్నారు. 1930లో పట్టణ వాసుల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు 1,31,000 పౌనులైతే, పల్లెలలో నుంచి రాబట్టింది 3,95,000 పౌనులు. ఈ సంవత్సరానికి ఆదాయానికి సంబంధించిన అంకెలు తెలియవుగాని, 1936లో బస్తీల వాళ్ళ ఆదాయం దాదాపు రెండు కోట్ల పౌనులు. ఇక, పల్లెటూరివారి ఆదాయం అరవై లక్షల పౌనులు మాత్రమే! ఆదాయం పన్ను వుంటే యూదీయులే దాన్ని అధికంగా చెల్లించవలసి ఉంటుంది గనుక, అది లేనేలేదు.

"పల్లెలలో పన్నులు ఎక్కువ వేస్తే ఆరబ్బు రైతులు దాన్ని చెల్లించుకోలేక, తమ భూముల్ని యూదీయులకు అమ్మివేస్తారు గదా అనే ఉద్దేశంతో పాలస్తీనాలోని బ్రిటీష్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆ విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందులకు నిదర్శనం బ్రిటీష్ వాడైన యన్. బార్బర్ 1936 జూలై నెలలో 'పాలస్టైన్ పోస్టు' పత్రికలో వ్రాసిన వ్యాసంలోని ఈ క్రింది వాక్యాలే: జెరుసలం సమీపంలో వున్న ఒక గ్రామంలోని భూమిశిస్తు ఎకరానికి మూడు షిల్లింగుల నాలుగు పెన్నీల దగ్గరి నుంచి (షుమారు రెండున్నర రూపాయలు), అయిదు పౌనుల నాలుగు షిల్లింగుల వరకు (షూమారు 78 రూపాయలు) పెరిగింది! కొన్ని కొన్ని భూములకు ఇది ఎకరానికి ఎనిమిది పౌనుల వరకు కూడా (షుమారు 120 రూపాయలు) పెరిగింది!! ఈ పెరుగుదలలోని విపరీతాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, మరి రెండు విషయాల్ని గమనించాలి. అవి ఏవంటే-గ్రామంలో ఎకరానికి రెండు పౌనులకు (30 రూపాయలకు) మించి ఆదాయం రాదు. ఆరబ్బు రైతు కుటుంబానికి సగటున వచ్చే మొత్తం ఆదాయం- సింప్సన్ రిపోర్టు ప్రకారం- 29 పౌనుల 9 షిల్లింగులు.

"ఈ పరిస్థితులలో ఆరబ్బులు తమ భూముల్ని యూదులకు అమ్మి వెయ్యడంలో ఆశ్చర్యం ఉన్నదా! ఆరబ్బు రైతుల దగ్గరి నుంచి యూదీయులు దాదాపు 8,00,000 డన్యూముల సేద్య యోగ్యమైన భూమిని కట్టుకున్నారు. ఈ భూమి ఖరీదు క్రింద 1918-1935 సంవత్సరాల మధ్య వారు చెల్లించిన 73,51,000 పౌనుల వల్ల ఆరబ్బు రైతులు పొందిన ప్రయోజనం దాదాపు శూన్యం ఎంచేతనంటే-ఈ మొత్తంలో అధిక భాగాన్ని మధ్య వాళ్ళు (బ్రోకర్లు, యూదుజాతి ఏజెంట్లు) కాజేశారు.

"యూదీయుల పరిశ్రమల్ని ప్రోత్సహించడం, వాటి ద్వారా ఆరబ్బుల పరిశ్రమల్ని అణగద్రొక్కడమూ బ్రిటీష్ నీతి. ఈ నీతి కారణంగా ఆరబ్బుల పరిశ్రమకు మొత్తం మీద దెబ్బ తగిలింది. ఇందుకు ఇక ఉదాహరణ (ఆరబ్బులకు చెందిన) సబ్బు పరిశ్రమ. 1925లో 2,54,087 పౌనుల విలువ గల సబ్బు ఎగుమతి అయింది. 1935 నాటికి ఈ ఎగుమతులు 77,897 పౌనులకు దిగజారినాయి.

"ఇంతటితోనైనా ఆగక ప్రభుత్వం వారు తాము చేయించే అన్ని పనులలోనూ యూదు కార్మికులు పట్ల అభిమానాన్ని చూపుతున్నారు. 1935లో వారు తమ కాంట్రాక్టులలో 2,97,099 పౌనుల విలువ గల కంట్రాక్టుల్ని యూదు జాతివారి కిచ్చారు. పోగా, మిగిలిన 2,55,367 పౌనులు విలువ గల వాటిని యూదేతరులకు అందరికీ కలిపి ఇచ్చారు. యూదేతరుల కిచ్చిన 2,55,367