పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విను మన్యోన్యపదంబున, కొనరింతురు కవులు గొంద ఱో నో లాయుం
దనుబోనియచ్చు కలుగుటఁ, జొనుపుదు రాయచ్చు వళియు సుకవులు కృతులన్.

67


ఉ.

ధన్యుఁడు విశ్వభూవిభుఁడు ధారుణి యేలఁగ భూజనంబు [1]
న్యోన్యహితత్వసంపదల నొందిరి, దంపుడు లింపు నింప న
న్యోన్య[2]సుఖానుకూలతల నోమిరి విప్రులు వేల్పుఁబిండు న
న్యోన్యసుపుష్టితుష్టికుశలాదులఁ జెందిరి నాఁడునాఁటికిన్.

68

దేశీయవళి నిరూపణము

చ.

[3]కఱకరి కల్లడంబు కడుఁ గట్టిఁడి దెమ్మెర [4]లోలమాస గ్ర
చ్చఱ యెసలారు లుల్లుఱుకు [5]లాడెడి వీఱిఁడి రజ్జలాఁడు గ్రి
క్కిఱియఁట నాఁ దెనుంగునకు నీయుభయంబు వళిప్రకార మై
మెఱయఁ గవిప్రయోగమున మేల మెఱింగి రచింప నేర్చినన్.

69


క.

చెన్నక్కకుఁ జెన్నక [6]మా, చన్నన మాచన యనంగ నచ్చట వళి యై
చెన్నగు నకార మార్యుల, మన్నన హల్లేని గలుగు మఱియొక్కొకచోన్.

70


క.

కడలాలుం జవరాలును, జడుఁ డొక్కం డొకఁ డనంగఁ జను[7]నుడువుల న
చ్చిడుటయె తగు వడి హల్లును, వడి సేయుదు రండ్రు కవులు వలసినచోటన్.

71


క.

ఏకైకము సోదర నా, కౌకులు ననుశబ్దములకు నొగి నేత్వోత్వా
నీకము వళు లగుఁ గొందఱు, గైకొందురు వృద్ధివళులు [8]కవు లొడఁబడికన్.

72

షడ్విధప్రాసములు

క.

భాసురము లగుచు సుకర, ప్రా సానుప్రాస దుష్కరప్రా సాంత్య
ప్రాస ద్వంద్వ త్రితయ, ప్రాసము లన షడ్విధములు పరఁగుం గృతులన్.

73

సుకరప్రాసము

క.

సుకుమారము శ్రుతిసుఖదము, నకలంకము నైనవర్గ మాద్యక్షరసృ
ష్టికి రెండవవ్రాయి సుమీ, సుకరప్రాసం బనంగ సులభము కృతులన్.

74


క.

అరవిందహితుఁడు దీధితి, నరవిందోచరుఁడు విద్విడపహరణముచో
[9]నరవిందభవుఁడు చతురత, ధర ధరణివరాహ విశ్వధరణిపుఁ డెపుడున్.

75

అనుప్రాసము

క.

[10]ఇడునెడఁ బ్రాసాక్షరములు, బడి తప్పక పాద[11]పదవిభాగములఁ గడున్
బెడఁగైన ననుప్రాసం, బడరుం [12]గబ్బముల నెల్ల నమరినతొడవై.

76


క.

రుంద్రములు సాంద్రములు [13]ని, స్తంద్రములును గుణము లెపుడు ధర సత్యహరి
శ్చంద్రునకుఁ జంద్రవంశ్యున, కింద్రోర్జితమహిమునకు నుపేంద్రసుతునకున్.

77
  1. క.గ.చ. అన్యోన్యహితానుకూలతల నందిరి
  2. గ. హితానుకూలతల
  3. క.గ. కఱుకరికల్లడంబు
  4. గ.చ. లోలమాన
  5. చ. ఆడిరి వీఱిడి
  6. క.గ.చ. మాచన్నకు మాచన
  7. క.గ.చ. నుడువులకచ్చిడుట
  8. క.గ.చ. కవు లొడఁబడినన్
  9. క.గ.చ. అరవిందవిభుఁడు
  10. క.గ.చ. ఎడనెడఁ బ్రాసాక్షరములు
  11. క.గ.చ. పదవిభావముల
  12. క.గ.చ. కబ్బముల కెల్ల
  13. క.గ.చ. నతంద్రములును