పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వరుస ణ న మ లు వళు లగు వాని కెల్ల
నవనిఁ గొందఱు సుకవులయనుమతమున.

57


చ.

కినుకఁ జళుక్యవిశ్వనృపకేసరి ఱేసినచోఁ గృపాణదం
డనమునఁ గల్గుఁ బో సురగణత్వము తత్పదవారిజాతవం
దనమునఁ గల్గుఁ బో మనుజనాథతతద్భటదర్శనావలం
బనమునఁ గల్గుఁ బో గహనమధ్యనివాసము వైరకోటికిన్.

58

ద్వ్యక్షర త్ర్యక్షర ప్లుతాక్షర వళి నిరూపణము

ఆ.

మొదలివ్రాఁత రెండు మూడు నక్కరములఁ
గూడెనేని యదియ కూర్చు వళుల,
నంత్యవర్ణము నిడుపయి తర్కభేదద?
యార్థ మయిన వచ్చు హల్లు వళులు?

59


క.

ప్రియకరుఁడు సర్వలోకా, శ్రయబిరుదోదగ్రుఁ డుగ్రజనవరసేనా
జయలక్ష్మీసుఖకరసం, శ్రయఁ డీచాళుక్యవిశ్వరాజేంద్రుఁ డిలన్.

60


తే.

ధర్మములు నిత్యసత్యకృద్వ్యాప్తు లెపుడు,
వర్జ్యములు చిత్తమున కసద్వ్యసనచయము,
లర్హములు వర్ణవిభ్రమద్వ్యక్తివిధులు
పతికి ననుటయు విశ్వభూపతికి నమరు.

61


క.

త్రాసమతి విమతు లడుగులు, డాసిన నీసోమవంశ్యుఁ డారక్షింపం
డీ సుడిగి యుచితగతి వి, న్యాసంబునఁ గొలువవలువదా విశ్వేశున్.

62


మ.

కమలోత్పత్తినిమిత్తముం గువలయాకాంక్ష్యాతపజ్జీవనీ
యము నై నంతన నభ్రవిభ్రమము నేలా సర్వలోకాశ్రయ
క్షమతం బేర్చు చళుక్యవిశ్వవిభు శశ్వద్దానధారాజ లౌ
ఘములో సాటికిఁ బాటి సేసెదవు క్రిక్కా చక్కఁ దర్కింపుమా.

63

ఆదేశవళి నిరూపణము

క.

ద్వీపమునకు నాకమునకు, నాపై శాస్త్రోక్తి నచ్చు లాదేశ సమా
సాపత్తి గలుగుటయు వళు, లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్.

64


ఉ.

ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటయున్ బ్రసన్నయై
గోపతిధేను వవ్విభునకుం దనవైభవ మిచ్చెఁ గాక యే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్రసిద్ధి వహించి రుర్వరన్.

65


క.

నీకరవాలము పాలై, నాకంబున కరిగి రాజనారాయణ యా
భూకాంతు లెట్టిచన వో, నాక విటోత్తములఁ దూల నడుతురు లీలన్.

66