పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

[1]కృతికౢపులును తృపిదృపులును, పితృభృతులును [2]నిలుచు పదముపిఱుఁదన లఘువుల్
[3]కృతిలో నగణములును దీ, ర్ఘత నొందినయేని [4]రెట్టి గాఁ దగు నెఱుఁగన్.

24


మ.

కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు; గద్యంబు నా
నమరుం బాదనియంత్రణానియమవిన్యస్తప్రశస్తార్థ మై,
రమణీయాంఘ్రిచతుష్టయస్ఫుటవళిప్రాసాభిరామంబు ప
ద్యము; తత్పద్యము వృత్త జాతు లన రెండై పర్వుఁ [5]గావ్యంబునన్.

25


క.

వృత్తం బనఁ జతురంఘ్రి సు, వృత్తం బై వళుల వ్రాల [6]వెలయును; మాత్రా
యత్తగణంబులచేతఁ బ్ర, వృత్తాకృతిఁ బరఁగు జాతివితతులు కృతులన్.

26


తే.

విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ
ణాభిధాన విరాదుమము లనెడిపేళ్లు
యతికిఁ బర్యాయపదము లై యమరుఁ గృతిని;
[7]యుక్తి పదములఁ గృతియందు నునుపవలయు.

27


క.

కరి గిరి [8]పుర నిధి శశి ది, క్పరిసంఖ్యానంబు గణితపరిభాషలచే
నరసి యతి నిలుపుచోటులు, పరికింపఁగవలయుఁ [9]గావ్యబంధన వెలయన్.

28

వళిప్రాసములు

క.

పాదప్రథమాక్షర ము, త్పాదిత మగు వళి యనంగఁ; బ్రాసం బనఁగాఁ
బాదద్వితీయవర్ణము; పాదచతుష్కమున కివియ ప్రాణము లెపుడున్.

29

వళిభేదములు

క.

స్వరజలు వర్గజ లితరే, తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ
బరపారు వళ్లు నాలుగు; వరుసఁ దెనుంగునకు వాని వలయుం దెలియన్.

30


క.

కోరి యకారము మొద లౌ, కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్
వారక యొండొంటికీ నిం, పారఁగ వళ్లయ్యె నాల్గు నైదురును మూఁడున్.

31

అజ్విరమము

క.

ఆ ఐ ఔ లత్వమునకు, నీ ఏలును ఋద్వయంబు నిత్వమునకుఁ దా
మూ ఓ లుత్వమునకు వళు, లా[10]యచ్చుల దొరసి యుండ హల్లుల కెల్లన్.

32

అకారవళి నిరూపణము

తే.

అవని ధర్మజుఁబోలు [11]నిత్యార్యచర్య,
నాదిరాజుల దొరయు నిత్యైంద్రభూతి,
[12]నరులఁ బ్రహరించు బాహుదండౌగ్ర్యమునను,
విధుకులాగ్రణి చాళుక్యవిశ్వవిభుఁడు.

33
  1. క. కృతికృతుల వితృపువిదృపుల, గ.చ. కృతకృప్తుల విదృపులం
  2. క.గ.చ. నిలిచి పదముపిఱుఁద
  3. క.గ.చ. కృతిలో గగణములను
  4. క. రెట్టిగా నెన్నఁదగున్
  5. క.గ.చ. కావ్యంబులన్
  6. గ.చ. వెలయుసుమాత్రాయత్త
  7. క.గ.చ. యుక్తపదముల
  8. క.గ.చ. పురశరశశిది
  9. గ.చ. కావ్యబంధన వెలయున్
  10. క.గ.చ. అచ్చులఁ దొఱఁగియుండు
  11. గ. సత్యార్యచర్య
  12. చ. నరులఁ బ్రహసించు