పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమోల్లాసము

—————

ఛందస్సు

క.

శ్రీవిశ్వేశ్వరునకు నై, భావితవిశ్వేశ్వరాంధ్రపద్మునకై సం
భావితపదవాక్యకళా, [1]కోవిదుకై నయవిశేషగుణవిదునకు నై.

1


క.

ధీయుత పింగళనాగ హలాయుధ జయదేవ ముఖ్యు లగునార్యులచే
నాయత మై యామ్నాయప, దాయిత మగుఛంద మొప్పిదముగ నొనర్తున్.

2


క.

ఛందోవిభ్రమవిధితోఁ, బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యర, విందభవునివచనములకు విభవం బొసఁగెన్.

3


శా.

పొం దై గౌరవలాఘవప్రకృత మై పూర్ణాక్షరస్నిగ్ధ మై
యందం బై శ్రుతిసమ్మతప్రకట మై ప్రాపించు నానావిధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్యరత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లు నే యేరికిన్?

4


క.

ఛందము వాఙ్మయ[2]విద్యా, కందము యతిగమకసమకగణవృత్తకృతా
నంద మమందార్థకళా, విందము వాణీకరారవిందము ప్రతిభన్.

5


క.

పటుమతి నట మున్ను మహా, నటుఁ డీశుఁడు [3]వాచకాభినయమునకై యు
త్కటయతిలయమయతాళ, స్ఫుటవికటచ్చంద మందముగ నొనరించెన్.

6


క.

సృజియించి యిచ్చె నజునకు, నజుఁడును భరతునకు నిచ్చె నమ్మునివరుఁడున్
ఋజుమతి యగు పింగళుఁ డను, భుజగమునకు నిచ్చె భుజగభోజనుఁ డచటన్.

7


క.

[4]ప్రియ యది యేటిది నావుడుఁ, బుయిలోడినపలుకుతుదల పొల్లులచేతన్
మ య ర స త భ జ నగణము లు, దయ మొందె ఛంద మొందెఁ దద్గణయుక్తిన్.

8


క.

గురువును లఘువును శంకర, [5]గిరిజాతాకృతులు తత్ప్రకృతములు గణముల్
[6]గరుడునిపై పింగళిఫణి, విరచించినతెఱఁగు వరుస వివరింతుఁ దగన్.

9


వ.

[7]అవి యెయ్యవి యనిన ధీశ్రీస్త్రీమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్,
సాతేక్వత్, [8]కదాసజ్, కింవదభ్, [9]సహసన్; ఇ ట్లని గరుడభయంబుననుం [10]దిర్య
గుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణం
బునకునై పింగళనాగంబుచేత నుచ్చరితంబు లగుత[11]ద్వాక్యాంతరంబులం బొల్లు లై
తోఁచు మకార-యకార-రేఫ-సకార-తకార-జకార-భకార-నకారంబులు
గణాభిధానంబులకు వాద్యక్షరంబు లగుటచేత మగణ-యగణ-రగణ-సగణ-త
గణ-భగణ–[12]నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ.
దత్స్వరూపంబులనుం దదధిదైవతంబులను పరిపాటిం బ్రకటింతు నె ట్లనిన.

10
  1. క.గ.చ. కోవిదునకునై యశేష
  2. క. విద్యానందము
  3. క.గ.చ. వాచికాభినయము
  4. క.చ. ప్రియయిది యేటిది, గ. ప్రియయిడియంటిది
  5. క.గ.చ.గిరిజాత్మాకృతులు
  6. క.గ.చ. గరుడునికై
  7. క.గ.చ. అవి యెయ్యవి యంటేని
  8. చ. సవాసజ్
  9. గ.చ. నహసన్
  10. క.గ.చ. తిర్యగుచిత
  11. క.గ.చ. వాక్యాంతంబునఁ బొల్లవ్రాలై
  12. క.గ.చ. నగణంబులనఁ గ్రమంబున