పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఈతఁ డుపేంద్రపుత్త్రుఁ డటె [1]యింతుల నేఁపక యేల మానుఁ? బ్ర
ఖ్యాతవినూత్నభద్రుఁ డటె [2]కాంతల నేఁపక యేల తక్కు? వి
ద్యోతకళాధరుం డటె [3]వధూటుల నేఁపక యేల యుండు [4]నే
రీతి? నటంచు విశ్వవిభుఁ బ్రీతి నుతింపుదు రంగనాజనుల్.

90

నిదర్శనము

క.

తిర మగునొకయర్థముతో, సరి యననర్థాంతరంబు సమకొల్పి తగన్
[5]బర మైన నపర మైనను, ధరణి నిరూపింపఁగా నిదర్శన మయ్యెన్.

91


ఉ.

ఇవ్వసుధం గవిప్రవరు లెచ్చట [6]నుండియుఁ జెందకుండినన్
మవ్వ మెలర్ప విశ్వనృపమన్మథుఁ డిచ్చు నభీష్టసంపదల్
నివ్వటిలంగ, [7]నత్తెఱఁగు నిశ్చితకృత్యము, యీక తక్కు నే
దవ్వులనుండి యైన రవి తమ్ముల కిమ్ముల సద్వికాసముల్.

92

సహోక్తి

క.

సమగుణధర్మము లగుభా, వములఁ [8]గ్రియాసదృశ యగుచు వచనార్ధముతో
నమరిన సహోక్తి యనఁ జను, సముచితచతురార్ధశబ్ద[9]సంఘటనమునన్.

93


చ.

వసుధ జిగీషుఁ డైనశశివంశ్యునికీర్తులతోన చంద్రికా
విసరము [10]సాగె దిక్కులను, విభ్రమదశ్వఖురోన్నమద్రజః
ప్రసరముతోన తోయజ[11]పరాగము వ్రాఁకె నభంబు, మిత్రమా
నసపరిశుద్ధితోన మలినత్వము వీడ్కొనె వారిపూరముల్.

94

పరివృత్తి

క.

సరినన్యోన్యార్థములం, బరువడితో మార్చుకొనుట పరివృత్తి యనం
బరఁగుం బలికెడు వెరవుల; నారయ నలంకారకరణ మగు సత్కృతులన్.

95


శా.

సవ్యాసవ్యవిఘాతశాలి యగు నీ చాళుక్యవిశ్వేశు హ
స్తవ్యావల్గదసిప్రభావము ప్రశస్తప్రౌఢి దీపింపఁగా
భవ్యాంగంబుల నాహరించి యనిలో భద్రక్రియాపాది యై
దివ్యాంగంబుల నిచ్చుఁ బేర్చి మదవద్వీరాహితశ్రేణికిన్.

96

ఆశీర్వచనము

క.

ఆశీర్వచన మనంగా, నాశాస్యపదార్ధసమ్యగాశంసన మి
ద్ధాశయము భద్రములకుఁ బ్ర, కాశింపఁగఁ దగు నశేషకావ్యముఖములన్.

97


ఉ.

వేలుపుటిల్లువిల్లు [12]వెడ వీఁకలపోకలనారి, రెండుచే
దోల వెలుంగు[13]తూ పెచటఁ దోలినఁ బాఱనితేరు మాటలై
గ్రాలెడుతేజు లెవ్వనికిఁ గల్గు నతండు చళుక్యవిశ్వభూ
పాలుమనంబునం బరవిభంజనుఁ డై విహరించుచుండెడున్.

98
  1. క. ఇంతుల నంపఁగ
  2. క. కాంతల నేఁపఁగ
  3. క. వదూటులఁ బేల్పఁగ, గ.చ. వధూటులఁ బ్రేల్పక
  4. క.గ.చ. ఏరీతులనంచు
  5. గ.చ. వరమైన నవరమైనను
  6. క.గ.చ. నుండియు వేఁడకుండినన్
  7. క.గ.చ. నిత్తెఱఁగు నిశ్చితకృత్యమ
  8. క.గ.చ. క్రియాసదృశి యగుచు
  9. క.గ.చ. సంఘటనములున్
  10. క.గ.చ. సాగె దిక్కులకు
  11. గ.చ. పరాగము ద్రాకె నభంబు
  12. క.గ.చ. వెడవీఁకల ప్రోఁకలనారి
  13. క.గ.చ. తూపెచటు దోలిన