పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మృదులవనానిలం బనుగమించు మధువ్రతపంక్తితోన నిం
పొదవఁగ వీచె డిగ్గియలనుండి సరోజరజోవిలాసి యై.

54

క్రమము

క.

ఉపమానము నుపమేయము, [1]నుపమలఁ బరిపాటి తప్పకుండఁగ [2]నొడువన్
నిపుణత్వము క్రమ మనఁ జను, ప్రపటుప్రఖ్యాతశబ్దపంక్తులచేతన్.

55


ఉ.

శ్రీరుచి వైభవోదయశరీరవిలాసములందుఁ జూడఁగా
శౌరి శశాంక జంధరిపు శంబరశత్రులతోడ నెప్పుడున్
దోరపుటీడు జోడు సరి దోయి చళుక్యనరేంద్రుఁ డంచు నిం
పారఁగఁ జాటుసత్కృతు లుదారత మ్రోయు సభాంతరంబులన్.

56

ప్రేయము

క.

ప్రేయోలంకారంబు వి, ధేయం బగుఁ బ్రియతరాభిధేయోక్తులచే
నే యెగ్గు లేక కర్ణర, సాయన మై యుండెనేని సత్కవికృతులన్.

57


మ.

భవదుద్యత్కరుణాకటాక్షకిరణోత్పన్నంబు లస్మన్మహో
త్సవసంపత్ప్రకరంబు లెల్ల నని శస్తస్తోత్రులై విశ్వభూ
ధవుభూపాలగుణప్రకీర్తనలఁ బ్రీతస్వాంతు లై కాంచి శా
త్రవు లర్చింతురు పాదపద్మముల నిర్యన్మౌళిరత్నద్యుతిన్.

58

రసవదలంకారములు

క.

[3]అసితం బగురత్నాది, ప్రసరణములఁ దేజరిల్లి ప్రథమరసాదుల్
పొసఁగఁబడు నెచట నది వో, రసవదలంకార మనఁగ రసికుల కెక్కున్.

59

శృంగారరసము

చ.

ఇల వలరాజురూపునకు నెక్కువ యయ్యెడు విశ్వమేదినీ
లలనునిరూపయౌవనవిలాసములం [4]జెలిమాటు చేరి య
గ్గలికపుసిగ్గు వేడుకలక్రందున కడ్డ[5]పడంగ నిమ్ములన్
మెలఁతుక వాలుఁజూపులకు మేపులు వెట్టెడుఁ జూచితే సఖీ!

60

హాస్యరసము

క.

లీనాచారుల బహుకౌ, లీనాత్ముల సతతసవ్యలీకులఁ జూడం
బూనెడువిశ్వేశ్వరుని న, వీనదర[6]స్మితము లచ్చివెన్నెలఁ బోలున్.

61

కరుణరసము

క.

అనిఁ దృణము [7]గఱచి జేయని, నినదించుచుఁ బొరలు వినుతనికరముఁ గరుణన్
[8]గనుఁగొని కాచుట నైజము, [9]గొనకొని యరిరాయగండగోపాలునకున్.

62
  1. క.గ.చ. ఉపచితపరిపాటి
  2. గ.చ. నొడువున న్నిపుణత్వము
  3. క.గ.చ. లసితంబగు రత్యాది
  4. గ.చ. చెలిమాట చేరి
  5. క.గ.చ. పడంగఁ గ్రిమ్ములన్
  6. క.గ.చ. స్మితము లేఁతవెన్నెలఁ
  7. క. గఱచి బేయని
  8. గ.చ. పనివడి గాచుట
  9. క. గొనకొని యది