పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబ్దావృత్తి

క.

అరు లని విశ్వేశ్వరునకుఁ, దిరుగక క్రీడింతు రమరదీర్ఘికలోఁ ద
[1]త్పురవరపరిఖాతాయత, సరసులఁ గ్రీడించుఁ గ్రోడసంతతు లెపుడున్.

28

అర్థావృత్తి

క.

శ్రీవిశ్వవిభుని వేఁడిన యావిప్రులు విత్తవంతు లగుదురు, వారిన
వావిరి నడిగినవారును, నావల ధనవంతు లగుదు రతిచిత్రముగాన్.

29

ఉభయావృత్తి

క.

ధరణివరాహం బగుపతి, ధరణి వరాహంబవోలెఁ దాల్చిన నేకా
తురచరణ మైనధర్మము, కరిగతి [2]నలుగాల నిలిచెఁ గలియుగవేళన్.

30

ఆక్షేపము

క.

తొడఁగినకృతకృత్యంబుల, [3]నడఁచునిషేధోక్తి దలఁప నాక్షేప మగున్
బెడఁ గగు సుకవులతలఁపుల, బడిఁ గాలత్రితయవిధుల బహుగతు లగుచున్.

31


ఉ.

'వారక విశ్వభూవిభునివాలున కగ్గము గాకుఁ, డైతిరే
నీరస మబ్బు మిమ్ము వరియించిన వేలుపుఁబువ్వుఁబోండ్లకున్
ధీరత మంట వెంట నరుదెంచినతెంపున మాకు' నంచు వా
గ్వీరము వీరభార్య లెఱిఁగింతురు భర్తల కాహవంబునన్.

32

అర్థాంతరన్యాసము

తే.

చెప్పఁదొడఁగినయర్థసంసిద్ధికొఱకు
[4]వేఱ యర్థము యోజించి వెలయఁ దెలుప
నదియ యర్దాంతరన్యాస మనఁగఁ బరఁగుఁ
దలఁప నేర్చినఁ బెక్కు భేదముల నెగడు.

33


మ.

[5]క్షమలో వేఁడనివారికేనియును విశ్వక్ష్మావిభుం డిచ్చు న
చ్చములై పొచ్చెము లేనిసంపదల శశ్వత్సర్వలోకాశ్రయ
త్వము, నై జంబుగ నట్ల కాదె తలఁపన్ వాంఛార్థహీనస్ఫుర
త్కమలోజ్జృంభణకల్పనంబు రవికిన్ గర్జంబు మి న్నందియున్.

34

వ్యతిరేకము

క.

అమరఁగ శబ్దార్థంబులు, క్రమతుల్యము లయ్యె భేదకథనముచే వ
ర్ణ్యము నతిరిక్తముఁ జేయుట, నమితవ్యతిరేక మసఁగ నగుఁ బలుకుబడిన్.

35


మ.

సుమనోరక్షణవైభవంబులను జిష్ణుత్వంబునం గ్రూరవి
క్రమవిద్విడ్బలమర్దనంబున సుధుర్యత్వంబు తుల్యంబపో,
యమరాధీశుఁడు గోత్రభంజనుఁడు గోత్రానందసంపాది వి
శ్వమహీపాలుఁడు, వీరికిన్ గుణకథాసాదృశ్య మేచందమో.

36
  1. క.చ. తత్పరపురపరిఖా
  2. క.గ.చ. నలుగాల నడచె
  3. క.గ.చ. నడపునిషేధోక్తి
  4. క.గ.చ. వేఱయర్థము నోజించి
  5. క.గ.చ. క్షమతో వేఁడని