పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమోల్లాసము

—————

అలంకారములు

క.

[1]శ్రీకాళీపతిపదనా, ళీకస్మృతిలోలచిత్తలీలావిజయ
శ్రీకర కులజలరాశిసు, ధాకర చాళుక్యవిశ్వధరణీనాథా!

1


కా.

కావ్యశ్రీల నలంకరించుట నలంకారంబు లై చాల శ్రో
తవ్యార్థంబుల నొప్పి పూర్వకృతసందర్భంబులం బెక్కు లు
ద్భావ్యప్రోక్తుల నాఱు ముప్పదియు నై భాసిల్లు వానిం గవి
స్తవ్యాద్యుక్తపదస్వరూపములుగా సాగింతు శాస్త్రక్రియన్.

2


వ.

[2]అది యెయ్యది యనఁగా— స్వభావాఖ్యానంబును, నుపమయు, రూపకంబును,
దీపకంబును, నావృత్తియు, నాక్షేపంబును, నర్థాంతరన్యాసంబును, వ్యతిరే
కంబును, విభావనయు, సమాసోక్తియు, నతిశయోక్తియు, నుత్ప్రేక్షయు, హే
తువును, నుదారంబును, సూక్ష్మంబును, లవంబును, గ్రమంబును, ప్రేయస్కం
బును, రసవంతంబును, నూర్జస్వియు, పర్యాయోక్తియు, సమాహితంబును,
నుదాత్తంబును, నపహ్నుతియు, శ్లిష్టంబును, విశేషోక్తియు, దుల్యయోగితయు,
విరోధంబును, నప్రస్తుతస్తుతియు, వ్యాజస్తుతియు, నిదర్శనంబును, సహో
క్తియు, పరివృత్తియు, నాశీర్వచనంబును, వక్రోక్తియు, భావికంబును, నన
నర్థాలంకారంబులు షట్త్రిశ[3]త్ప్రకారంబు లై వర్తిల్లుఁ దత్స్వరూపోదాహర
ణంబుల పరిపాటిం జెప్పుదు. నందు స్వభావాఖ్యానం బెట్టి దనిన.

3

స్వభావాఖ్యానము

క.

జాతిగుణద్రవ్యక్రియ, లేతెఱఁగున నుండు నట్ల యింపుగఁ జెప్పన్
బ్రీతి స్వభావాఖ్యానము, [4]జాతి యనం బరఁగు నదయు శాస్త్రజ్ఞులచేన్.

4


శా.

నీలశ్రీలఁ దనర్చి [5]నిర్మలము నై నిస్తంద్రసౌరభ్య మై
చాలం బేశలరూప మై చులుక నై శాతోగ్రధారాగ్రరే
ఖాలంకారిక మై దృఢత్సరుసముద్యన్మేఖలాబద్ధ మై
[6]వా లొప్పుం గరవాలభైరవజయావాలక్రియాశీల మై.

5


క.

జాతిగుణద్రవ్యక్రియ, లాతతజీవితము లందు రార్యులు శాస్త్ర
వ్రాతములకు సత్కివితా, జాతములకు; వీనిఁ బొసఁగఁ జనుఁబో నొడువన్.

6

ఉపమ

క.

గుణధర్మకర్మముల ను, ల్బణ మయ్యెడువస్తువునకుఁ బరువడిఁ దుల్య
ప్రణయనముఁ జేయా నెయ్యది, గణుతింతురు దాని నుపమగా బహువిధులన్.

7
  1. క.గ.చ. శ్రీకాశీపతిపద
  2. క.గ.చ. అవి యెయ్యవి యంటేని
  3. క.గ.చ. ప్రకారంబులఁ బ్రవర్తిల్లె
  4. క.గ.చ. జాతియుఁ ననఁ బరఁగు
  5. క.గ.చ. నిర్మలినమై
  6. క.గ.చ. వా లేఁచున్