పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదారత

క.

వినుతసుశబ్దార్థంబులఁ- దనరు గుణోత్కర్షణం బుదారత్వ మనన్
[1]జను; నది పూరణబహుళత, ననఘశ్లాఘోదయమున నగుఁ గల్పింపన్.

80

శ్లేషము

క.

అశిథిలపదబంధం బై, [2]విశదాల్పప్రాణవర్ణవిస్పష్టం బై
కుశలగతి నొప్పు శ్లేషము, విశేషకావ్యముల కెల్ల విభవప్రద మై.

81

సుకుమారత

క.

శ్రుతిసుఖకరవర్ణంబుల నతి[3]కోమల మైనరచన మలవడు సుకుమా
రత [4]నాఁగఁ, గ్లిష్టశాస్త్ర, [5]స్మృతివాదపటిష్ఠనుతులఁ జేకొను నదియున్.

82


క.

లలిఁ [6]బదములతో నర్థము, [7]సలలిత మగు నెచట నది ప్రసాదము కృతులన్
[8]వలిపపుఁబయ్యెదలోనన్ [9]దొలఁకాడెడువలుదచన్నుదోయిని బోలెన్.

83

మాధుర్యము

క.

పటుబంధంబులు మృదుల, స్ఫుటవిన్యస్తాక్షరములుఁ బూరితరససం
ఘటితపదార్థంబులు నె, చ్చట నగు మాధుర్య మనఁగఁ జను నది గృతులన్.

84

సమత

క.

దొరఁకొన్నకొలఁది విడువక, చరణపదార్థములనడక సరి సాగెడు బి
స్ఫురణ యది సమత యనఁ జను; నరాయం గుకవులకు నంద దది పరికింపన్.

85

అర్థవ్యక్తి

క.

[10]తనరఁ గ్రియాకారకయో, జన మస్తవ్యస్తసరణిఁ జనకుండ యథా
జనితాన్వయముగఁ జెప్పినఁ, గన దర్థవ్యక్తి నాఁగఁ గవితల నొప్పున్.

86

ఓజస్సు

క.

[11]ఓజోగుణ మనఁగా వి, భ్రాజిత మగుఁ బటుసమాన[12]బాహుళ్యము రా
రాజదనుప్రాసాక్షర, [13]భాజన మై యొప్పు శబ్దభాసురఫణితిన్.

87

సమాధి

క.

స్థావరజంగమధర్మవి, భావితచరితములు వీడుపడక రసార్థ
ప్రావిర్భావము లగుటయ, భావింప సమాధి యనఁ బరఁగుం గృతులన్.

88

కాంతి

క.

లోకవ్యతిరిక్తార్థ, శ్రీకలితయు నూతనప్రసిద్ధవిరచనా
పాకకమనీయయును నగు, నాకబ్బముసొబగు కాంతి యనఁ జనుఁ గృతులన్.

89

—————

  1. క.గ.చ. జను నది వితరణ
  2. చ.విశదాల్పప్రాసవర్ణ
  3. క.గ.చ. కోమలమైనవచన
  4. క.గ.చ. నాఁగశ్లిష్టశాస్త్ర
  5. చ. స్మృతిపాఠపటిష్ఠ
  6. క.గ.చ. పదములలో నర్థము
  7. గ. సలలితముగ నెచట
  8. క. వలిపెపుఁబయ్యెద
  9. చ. తొలుకాడెడు
  10. క.గ.చ. తనరు క్రియాకారక
  11. క.గ.చ. ఓజోరీతి యనంగను
  12. క.గ.చ. బాహుళ్యము దా
  13. చ. భాజన మై నెగడు