పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అతికుప్యత్పరగండ[1]భైరవమహోద్యత్ఖడ్గ ముగ్రాకృతిన్
బ్రతిపక్షప్రకరంబు నొంచు నలఁచున్ [2]భంగించు దండించు ను
ద్ధతి నుగ్గించు వధించు వ్రచ్చు యమదోర్దండప్రచండక్రియా
గతి రూపించు నటత్కబంధమయసంగ్రామంబు భీమంబు గాన్.

72

భారతి

తే.

భారతీవృత్తి కైనకల్పనము చూడ
నర్థ మించుక సుకుమార మై తనర్చు;
నల్పమృదువులు హాస్యశాంతాద్భుతములు
భారతీవృత్తిచేఁ [3]జెప్పఁబడు నవియును.

73


మ.

అతికందర్పము రూప, ముజ్ఝితసుపర్వానోకహరం బీగి, నిం
దితచంద్రద్యుతి కీర్తి, గర్హితసురాద్రిస్ఫూర్తి ధైర్యంబు, కుం
ఠితకంఠీరవ ముగ్రవిక్రమము, వర్ణింపం జళుక్యావనీ
పతి; కీయద్భుతువృత్త మేనృపులకున్ బాటిల్లునే యెచ్చటన్?

74

సాత్త్వతి

తే.

సాత్త్వతీవృత్తి నాఁగ నీషత్ప్రగల్భ
సార్థరూపిణి; వీరభయానకములు
[4]నీషదుక్తి ప్రగల్భసమీహితములు;
సాత్త్వతీవృత్తిచే వీని జరుపవలయు.

75


మ.

అతిదృప్యత్కరవాలభైరవపతాకాభీలకోలధ్వజా
కృతులం జూచినవీరు [5]లుబ్బుదు రొగిన్ గీర్వాణలోకార్థు లై,
సతతత్రస్తులు దూలిపోదురు మహాశైలాగ్రకూటార్థు లై,
గతవిద్వేషులు విశ్వనాథ వినుతు ల్గావింతు రాత్మార్థు లై.

76

—————

కావ్యరీతులు

తే.

అఖిలకావ్యంబులకు రీతు లాత్మ యంత్రు;
ప్రాణదశకంబు వానికిఁ బ్రాణ మరియ;
ధర సలంకారమతవిభేదముల నవియుఁ
బెక్కు, లొక కొన్ని తగ గానిపింతుఁ దెలియ.

77


క.

[6]ఈడిత లగు వైదర్భీ, గౌడీ[7]పాంచాలలాటికారీతులు [8]కా
వ్యాడంబరకరుణార్థ, క్రీడలఁ జతురాహ్వయములఁ గృతకృత్యులచేన్.

78

గుణములు

క.

క్రమమున నౌదార్యశ్లే, షములును సుకుమారతాప్రసాదమధురతా
క్రమతార్థవ్యక్త్యోజ, స్సమాధికాంతులును దగు దశప్రాణము లై.

79
  1. క.గ.చ. భైరవభుజోద్యత్ఖడ్గ
  2. క.గ.చ. భంగించు తుండించు
  3. క.గ.చ. చెప్పఁబడినయవియు
  4. క.గ.చ. ఈషదుక్తప్రగల్భ
  5. క.గ.చ. ఉబ్బుదు రనిన్
  6. చ. ఈడితమగు
  7. క. పాంచాలిలాటికా
  8. క. కావ్యాడంబరకరణార్థ