పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

[1]లీలామన్మథమంధరంబులుఁ గచాలీలాలితభ్రూలతా
కూలశ్రీలుఁ గపోలఖేల[2]దుచితాకూతానురాగంబులున్
సాలస్యంబులు నైనకౌతుకపరీతాలోకజాలంబులన్
బాలారత్నము కీలుకొల్పె ముద మొప్పన్ విశ్వభూపాలుపై.

57

నారికేళపాకము

క.

[3]అంతర్గూఢార్థసర, స్వంతం బగువాక్యగౌరవంబు మనీషా
వంతులకు నెక్కుఁ గవితా, భ్యంతరముల నారికేళపాక మనంగన్.

58


శా.

హృష్ణాతుండు నటుండు వోలె నదె విశ్వేశక్షమాభర్తకున్
లజ్జాకాండపటంబుచాటున వధూలావణ్యలాస్యంబులన్
సజ్జాతంబులఁ జేసి చూపెడు లసత్సారాంగహారాళిచే
బెజ్జం గొందఱు [4]కామినీమణులు కుప్యర్దర్పలై చూడఁగన్.

59

—————

అర్థవృత్తులు

ఆ.

ముఖ్యలక్ష్యగౌణములును వ్యంగ్యంబు నా
నర్థవర్ధనంబు లయ్యె నాల్గు
వానివలనఁ గలుగు వాచ్య భేదంబుల
నరసి తెలియవలయు నండ్రు బుధులు.

60

ముఖ్యార్థము

క.

సువ్యక్తము సరళంబును, నవ్యాజము నైన యర్థ మగు ముఖ్య మనన్,
[5]శ్రవ్యముగ నదియు జాతి, ద్రవ్యగుణక్రియలచేతఁ దగు నాల్గనఁగన్.

61

లక్ష్యార్థము

ఆ.

ఊహనీయలక్షణోపేత మగునర్థ
మరయ లక్ష్య మనఁగ నతిశయిల్లు,
[6]గంగయం దనంగ గంగాతటంబునఁ
గలిమిఁ జెప్పఁజాలు కారణమున.

62

గౌణార్థము

క.

గుణసాదృశ్యంబున ను, ల్బణ మగునర్థంబు గౌణఫణితము, గడుభీ
షణహరి యానృపుఁ డనఁ ద, ద్గుణ మగువిక్రమము దెలియఁదోఁచుటచేతన్.

63

వ్యంగ్యార్థము

ఆ.

ముఖ్యలక్ష్యగౌణముల యర్థములఁ ద్రోచి
యితర మర్థ మెచట నింపు నొసఁగు
వ్యంగ్య మండ్రు, కైరవంబులు విరిసె నాఁ
గమల[7]వైరిపొలుపు గానఁబడుట.

64
  1. క.గ.చ. లీలామంథరమన్మథంబులు
  2. క.గ.చ. ఉచితాకూలానురాగంబులున్
  3. క.గ.చ. అంతర్గూఢార్థరసస్వంతంబగు
  4. క.గ.చ. కామినీజనులు కుప్యద్దర్పు లై
  5. క.గ.చ. శ్రవ్యముగ నదియ
  6. క.గ.చ. గంగయందు మంద
  7. క. వైరిపొడుపు, గ.చ. వైరిపొడవు