పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రగడ

క.

[1]సరియౌ పదిఱేకులచేఁ, బరువడి నుత్సాహవృత్తపదయుగళముచే
నిరపుగ వడిప్రాసంబుల, నరుదుగ రచియింప రగడ యగుఁ దగువృత్తిన్.

40

మంజరి

క.

శృంగారప్రాయముగా, [2]రంగద్ద్విదళిన పొసంగ రచియింపంగా
శృంగారమంజరీ[3]కృతి, సంగత యగు సకలరాగసంభృతరీతిన్.

41

దండకము

క.

ఛందోభవలక్షణగణ, సందోహనిబద్ధ యగుచు శ్రవణానందా
మందానుప్రాసంబుల, నందం బగు దండకము మహాకవికృతులన్.

42


క.

ఇవి యెల్లను నానావిధ, కవికృతశాస్త్రములచేతఁ గల్పితములు, పె
క్కువిధంబులఁ జాటుకృతి, ప్రవరంబులు పరఁగు నెఱుఁగఁబడు నొండెడలన్.

43


సీ.

ఆపూర్ణలక్షణోదాహరణావలి యుల్లంబునకు నింపు నొసఁగదేని
బిరుదావళీముఖ్యపృథులప్రబంధౌఘములు దిగంతంబులు మ్రోయవేని
పటుచతుర్భద్రాదిభవ్యచాటూక్తులు నృపతులవీనులు నిండవేని
మధురార్థదండకమంజరీమంజుతబంధుల నింపుల మూరిఁ బుచ్చదేనిఁ


తే.

గెరలి చని ముక్తకాదులు కీర్తిలతలఁ
జక్రవాళాద్రిమీఁదికిఁ జాఁపవేనిఁ
గడఁగి మెచ్చునె యొకపాటిగంతచాటు
చాటు[4]కృతులకు విశ్వేశచక్రవర్తి.

44

ప్రాధాన్యములు

క.

అరయ వస్తురసాలం, కారప్రాధాన్యవృత్తిఁ గబ్బంబులు పెం
పారుఁ త్రివిధార్థఘటనల, ధీరులు పరికించి వానిఁ దెలియఁగవలయున్.

45

వస్తుప్రాధాన్యములు

క.

వేడుక [5]విశ్వేశుఁడు శివ, చూడామణికులమునందు సుస్థిరుఁ డచటన్
జూడఁ గనకాద్రికవకుం, గూడక య[6]వ్వెండికొండ కొండిక యయ్యెన్.

46

రసప్రాధాన్యము

క.

వలిచన్నులు నగుమొగములు, దెలిగన్నులు మేనిజిగులు [7]తియ్యనిపలుకుల్
[8]సలికపునడుములు మరుతూ, పులఁ బ్రోచుఁ జళుక్య[9]విభునిపొలఁతుల కెపుడున్.

47

అలంకారప్రాధాన్యము

క.

[10]తగ విశ్వేశ్వరు చేసిరి, నెగడిన సత్కవులు దాననిపుణతఁ గర్ణున్
నగుదురు, కల్పమహీజముఁ, దెగడుదు, రదలింతు రమరధేనువు నైనన్.

48

—————

  1. క.గ.చ. సరిఁజౌపదరేకులచే
  2. క.గ.చ. రంగద్ద్విపదలను బొసఁగ
  3. క. కృతిసంగతి యగు
  4. క.గ.చ. కృతులకుఁ జాళుక్యచక్రవర్తి
  5. క.గ.చ. విశ్వేశుఁడు నిజచూడామణి
  6. క.గ.చ. వెండికొండ కొండయ యయ్యెన్
  7. క.గ.చ. తియ్యఁబలుకులున్
  8. క.గ.చ. నళికపునడుములు
  9. క.గ.చ. విభునిపురవనితలకున్
  10. క.గ.చ. తగవిశ్వవిభుని జేసిరి