పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థోల్లాసము

—————

క.

[1]శ్రీవిశ్వేశ్వరకరుణా, శ్రీవిలసితనిష్కళంకచిత్తుఁడు [2]కీర్తి
శ్రీవిశదచక్రవాళుఁడు, శ్రీవిశ్వేశ్వరనరేంద్రశేఖరుఁ డొప్పున్.

1


క.

ఇత్తెఱఁగున నష్టాదశ, వృత్తం బగు కావ్య మొప్ప [3]విరచింపఁ దగున్
మొత్త మగు నఖిలబలసం, పత్తియుఁ గలవేళ సుకవి ప్రతిభ దలిర్పన్.

2


క.

కృతిముఖమున [4]దేవనమ, స్కృతి యొండె నభీష్టవస్తుకీర్తన మొండెన్
[5]వితతాశీఃపద మొండెను, బ్రతిపాదింపంగవలయు భద్రాపేక్షన్.

3


మ.

[6]కవిసంసిద్ధపదంబు భావరసవిఖ్యాతంబు లోకోచిత
వ్యవహారంబు నుదాత్తనాయకము శ్రవ్యంబుం జతుర్వర్గసం
భవపద్మంబును నైనకావ్య మిల నాపద్మోద్భవస్థాయి యై
కవిసంస్ఫూర్తియు దాతృకీర్తియుఁ దగం గల్పించు నెల్లప్పుడున్.

4

కావ్యభేదములు

తే.

అట్టికావ్యంబు త్రివిధ మై, యతిశయిల్లు
నవనిఁ బద్యమయంబు [7]గద్యాత్మకంబు;
పద్యమయ మొప్పు ఛందోనిబద్ద మగుచు
గద్యమయ మొప్పు వాక్యసంకలిత మగుచు.

5


క.

ఆపద్యగద్యకృతములు, రూపకములు నాటకములు రూఢము లగు [8]నా
రూపమ చంపూకావ్యత, ప్రాపించును, నాటకములు బహుళము లరయన్.

6


తే.

సంబంధంబు కావ్యంబు సంస్కృతమునఁ,
బ్రాకృతంబున నాశ్వాసభాసురంబు,
నాటకము లెల్ల నంకసనాథకములు,
గద్య ముచ్ఛ్వాసలంబకాంకంబ యండ్రు.

7


క.

[9]ఇటువలెనె ముక్తకాది, స్ఫుటతరచాటుప్రబంధములలక్షణముల్
పటుమతి నెఱుఁగుట సుయశో, ఘటనంబుల కెల్లఁ గుదురు కవినృపతులకున్.

8

ముక్తకాదులు

సీ.

పరఁగు ముక్తక మేకపద్యంబు, పద్యద్వయంబు [10]ద్వికము నాఁగ నలరు, మూఁడు
పద్యముల్ త్రికము నా భాసిల్లుఁ, బంచపద్యంబులు పంచరత్నంబు లరయ,

  1. క.గ.చ. శ్రీవిశ్వేశ్వరచరణ, శ్రీ
  2. క. కీర్తి శ్రీదళిత, గ.చ. కీర్తి శ్రీవలిత
  3. చ. వివరింపఁ దగున్
  4. క.గ.చ. దైవనమ, స్కృతి
  5. గ. వితతాశీర్వద మొండె
  6. క.గ.చ. కవిసంసిద్ధిపదంబు
  7. క.గ.చ. గద్యాత్మికంబు
  8. క.గ.చ. నారూపమ చంపూకావ్యము
  9. క.గ.చ. ఇటువలె ముక్తపదాది
  10. క.గ.చ. ద్వికంబు నా నమరు