పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

[1]అమరాహీనరవంబు వీరసుభటాహంపూర్వికానాదమున్
విమలాస్త్ర[2]ప్రతిఘాతనధ్వనులు నున్నిద్రంబు లై పర్వ [3]
గ్రిమవిశ్రాంతికి మెచ్చి నారదుఁడు నర్తింపన్ మహాయోధనం
బమరుం జూడఁ జళుక్యవల్లభునిశూరాటోపముం జూపుచున్.

136

దోర్వీర్యవర్ణనము

క.

అరులఁ జనఁ దోలి యార్తుల, [4]నరుదారం గాచి హతులయడియాలములన్
బిరుదంబులఁ గైకొను న, న్నరపతివిజయంబు కీర్తనము సేయఁదగున్.

137


ఉ.

ఆచతురాశ్వసంఘము రణాంగణసంభవ, మాసువర్ణపే
టీచయ మాజి శత్రువులు డించి తొలంగిన వస్తుసంభృతం,
బీచతురంతయానముల యింతులు రాజతనూజ లంచు మెం
డై చని విశ్వనాథువిజయంబు నుతింతురు పౌరకామినుల్.

138

—————

మ.

ఇటు లష్టాదశవర్ణనాకలిత మై యేపారు [5]కావ్యంబు నం
తటఁ బాటించి తదర్థసంఘటనముం దర్కించి భావోదయ
[6]స్ఫుటభేదంబు లెఱింగి తద్రసగతుల్ శోధించి యచ్చంపు మె
చ్చుటకుం దావల మై చళుక్యపతి సంశోభిల్లు నెల్లప్పుడున్.

139


ఉ.

[7]రాజనరేంద్రవంశజుఁడు రాజపటీరసుధాసుధాకర
భ్రాజిత[8]కీర్తి రామరఘురామపరాక్రమంప్రవర్తి యం
భోజహితప్రతాపుఁడు రిపుక్షితిభృత్కులిశంబు సత్కళా
భోజుఁడు దానధూతసురభూజుఁడు భూజనపోషణుం డిలన్.

140


క.

సుందరుఁ డభినవవిభవపు, రందరుఁ డంధ్రేశ్వరాభిరాముఁడు రామా
కందర్పుఁ డమందయశ, శ్చందనపరిలిప్తదిగ్గజవ్రజుఁ డెపుడున్.

141


మాలిని.

అనఘసుకృతధర్ముం డార్యసంస్తుత్యశర్ముం
డనలసదృశతేజుం డగ్ర్యచాతుర్యభోజుం
డనిశరిపుశరణ్యుం డంధ్రభూపాగ్రగణ్యుం
డనుగతశివతంత్రుం డాప్తమంత్రుండు బుద్ధిన్.

142

గద్యము.
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన విబుధబుధవిధేయ
విన్నకోట పెద్దయనామధేయ విరచితంబైన కావ్యాలంకారచూడామణి
యనునలంకారశాస్త్రంబునందు నాయకనాయికావివిధవిశేషలక్షణ
ప్రబంధలక్షణోదాహరణసముద్దేశం బన్నది
తృతీయోల్లాసము.

—————

  1. క.గ.చ. అమరాలాపరవంబు
  2. క.గ.చ. ప్రతిఘాతినిధ్వనులు
  3. క.గ.చ. అగ్రిమవిక్రాంతికి
  4. క.గ.చ. అరుదారం గాంచి హతులు
  5. క.గ.చ. కావ్యంబు నాదటఁ బాటించి
  6. క.గ.చ. స్పుటభేదంబు నెఱింగి
  7. క.గ.చ. రాజమహేంద్రవంశజుఁడు
  8. క.గ.చ. కీర్తిధామ రఘురామ