పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

గంభీరపరిఖ నాగస్త్రీల కశ్రాంత[1]కేళీవిహారదీర్ఘిక యనంగ
నుత్తాలసాల మన్యుల కుబ్బి దివిఁ బ్రాఁకఁ జేసినదీర్ఘనిశ్రేణి యనఁగఁ
జతురచాతుర్వర్ణ్యసంఘ మర్ధులపాలిరాజితకల్పకారామ మనఁగ
[2]భ్రాంతసుస్థిత యైన భవజూటవాహిని భుక్తిముక్తిప్రదస్ఫూర్తి యనఁగ


తే.

[3]నెప్పుడును నొప్పురాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించె నేరాజు తనదుపేర
నట్టి రాజమహేంద్రునియనుఁగుమనుమఁ
డెసఁగుఁ జాళుక్యవిశ్వనరేశ్వరుండు.

94

సముద్రవర్ణనము

క.

సిరినెలవు, [4]గురుసుధాప్తియు, [5]నరుదారఁగ నజునితండ్రియల్లుఁడు, రత్నా
కరము దనపేరు, జలధికి, సరి గలరే యరయ ననుచుఁ జను వర్ణింపన్.

95


మ.

అతిగాంభీర్యము గోత్రగోపనము సత్త్వాటోపమాహాత్మ్యమున్
హితలక్ష్మీసదనత్వమున్ సతతవృద్ధీతప్రభావంబు [6]ను
న్నతసర్వోత్తరజీవనోదయము నానావాహినీసౌఖ్యకా
లితయుం బేర్చుఁ జళుక్యనాథునకుఁ[7]బోలెన్ జూడ నంభోధికిన్.

96

పర్వతవర్ణనము

క.

అచలతయును నున్నతియును, ఖచరవినోదౌచితియును గనకాదిఖనీ
[8]రుచితయును మొదలుగాఁగల, ప్రచురతలు నుతింపవలయుఁ బర్వతమునకున్.

97


మ.

[9]చెలువారున్ నవరత్నపాదకటకశ్రీచేత, గంధర్వ[10]మం
గళనాదంబులతోడ నొప్పగు, నభంగస్థైర్యవృత్తిన్ మహా
బలు నైనం బ్రహసించు, భూభరణశోభం దాల్చి మి న్నందుచున్
గులశైలంబులపెంపు విశ్వవిభుతోఁ గూర్పం దగున్ ధీరతన్.

98

వసంతవర్ణనము

క.

అంకురపల్లవపత్ర[11]స, మాంకితముకుళప్రసూనహారిఫలములన్
బొంకము లగువనములు ని, శ్శంకముగ [12]నుతింపఁబడు వసంతమునందున్.

99


మ.

స్మరబాణంబులు వాఁడు లయ్యె, గణవిస్ఫారంబు ఘోరంబుగా
నెరసెం, [13]గీరము లంగజాతబిరుదానీకంబు గీర్తించె, మిం
చె రసాలాగ్నులు, [14]పల్లవార్చులు దలిచెన్, [15]విశ్వనాథావనీ
వరుతో నల్గుట చెల్లునే యనత యై వామాక్షి కీపట్టునన్.

100

గ్రీష్మవర్ణనము

క.

ధారాగృహముల నవఘన, సారాదులు గంధసార[16]సరసపటీరో
శీరవ్యజనాదుల నిం, పారఁగ వర్ణింపఁ దగు నిదాఘాగమమున్.

101
  1. క.గ.చ. కేళీవినోదదీర్ఘిక
  2. క.గ.చ. భ్రాంతసంస్థితయైన
  3. క.గ.చ. ఇప్పుడు నొప్పు
  4. క.గ.చ. గరుసుఁదావియు
  5. క. నరుఁ డెఱఁగక నజుని, గ.చ. నరుదేరఁగ నజుని
  6. క. ఉద్గతసర్వోత్తర
  7. క. పోలన్ జూడ నంభోధికిన్
  8. క.గ.చ. రుచిరతయు మొదలుగా
  9. క.గ.చ. చెలువారన్ ఘనరత్న
  10. క.గ.చ. మంగళనాదంబులు జెప్ప
  11. సమంకితముకుళ
  12. క.గ.చ. నుతింపఁదగు వసంతమునందున్
  13. గ.చ. కీరము లంతజాత
  14. క.గ.చ. పల్లవార్చులఁ దనర్చెన్
  15. క.గ.చ. చంద్రవంశావనీవరుతో
  16. క.గ.చ. సరళపటీరోదార