పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంగల్లక్షణలక్ష్యవృత్తిఁ గని లో రాగిల్లు [1]టొప్పున్; మద
త్వంగన్నీరసవాదరోషములచేతం గల్గునే సౌఖ్యముల్.

25


క.

నాయికలు స్వకీయయుఁ బర, కీయయు సాధారణియును గీర్తిత లగుదుర్,
పాయక వారలవలన [2]గు, ణాయత్తార్థములు గలుగు; నవి యెఱుఁగఁ దగున్.

26

స్వీయ

క.

సతియును శీలార్జవసం, గతయుం గులవతియు నఖిలకల్యాణగుణా
న్వితయును లజ్జాళువు నగు, నతివను రసికులు స్వకీయ యందురు కృతులన్.[3]

27


క.

కులవతియును [4]శీలార్జవ, కలికయు సతియును నశేషకల్యాణగుణో
జ్జ్వలయును లజ్జాళువు నగు, నలినీలకచన్ స్వకీయ యందురు కృతులన్.

28


చ.

అలఘుచరిత్రలున్ శుభగుణాన్వితులున్ గురుబంధుమిత్రవ
త్సలలును దర్పహీనలును ధర్మవిధజ్ఞలు రూపసంపదా
కలితలు నైనదారికలఁ గానిక లిత్తురు [5]సంధివేళలన్
నలినహితేందువంశనరనాథులు విశ్వనరేంద్రభర్తకున్.

29

పరకీయ

క.

పరకీయ రెండుదెఱఁగులు, కరపరిణీతయును బేరుగలకన్యయు నాఁ
[6]బరిణీత రాగరసములఁ, బరికల్పిత గాదు సత్ప్రబంధములందున్.

30


ఆ.

కన్య పరిణయాభికాంక్షచే రాగాంగ, మగుట [7]రసమునందు నగు నుతింపఁ
భిన్న యయ్యుఁ [8]దనకుఁ బెండ్లి యౌమాట లా, లించు నౌలఁ గన్య లీలఁ బోలె.

31


ఉ.

సాలకఫాలభాగలును నంకురితస్తనబింబలున్ విక
ల్పాలసబాలలీలలును నల్పవివేకలు నైనవైరిభూ
పాలురముద్దుఁగన్నియల భాగ్యము నెన్నుదు రర్ధి విశ్వభూ
పాలుని రాజ్యలక్ష్మికి సపత్నిక లయ్యెద రంచుఁ బ్రాశ్నికుల్.

32

సాధారణనాయిక

క.

సాధారణి యన గణిక క, ళాధౌరేయాత్మ కపటలంపట లీలా
మాధుర్యవిధాయిని దుర, గాధమనోవృత్తి దానిగతిఁ దెలియంగన్.

33


చ.

అనిఁ బరగండభైరవభుజాసివడిం బడి పుణ్యమూర్తు లై
వినుతగతిం జరించు బలువీరులఁ [9]గైకొని యేపు మీఱ ము
న్ననఁగి పెనంగి కూర్చుసువిటావలులన్ దొలఁగించి రప్సరో
వనితలు; పైఁడివెట్టి విలువం గలవే వెలయాండ్రకూరుముల్.

34

స్వీయాభేదముు

క.

చతురస్వకీయగుణసం, గతి ముగ్ధయు మధ్యయుం బ్రగల్భయు ననఁగా
రతిపతితంత్రంబులచేఁ, బ్రతిపాదిత లైరి మూఁడుభంగుల వరుసన్.

35
  1. క.గ.చ. ఒప్పున్మతి త్వంగత్
  2. క.గ.చ. గుణాయతభేదములు
  3. ఈపద్యమునకుఁ దరువాత “అదియె” అనికలదు.
  4. క. శీలార్జనకలితయు
  5. క.గ.చ. సంధికాలమున్
  6. క.గ.చ. పరిణీత యంగరసముల
  7. క.గ.చ. స్వీయరసము నగు నుతింప
  8. గ.చ. తనదు పెండిలిమాటలు
  9. క.గ.చ. కైకొని యిప్డు దారుమున్న