పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రౌద్రము

క.

క్రోధమ రౌద్రరసం బగు, సాధువిభావాదికముల సంపుష్టం బై;
ద్వైధం బగు మాత్సర్యవి, రోధంబులఁ దెలియఁ దగు నిరూపణవిధులన్.

101

మాత్సర్యరౌద్రము

మ.

అని రోషించిన వీరభద్రుకరణి న్బ్రాపించుఁ, బ్రాపించి చ
య్యన రుద్రోద్ధతిఁ జెందుఁ, జెంది వికటోగ్రాటోపమున్ జూపుఁ, జూ
పి నట త్య్రంబకులీలఁ బేర్చు, బిదప భీమాకృతిన్ జేకొనున్;
జనునే మార్కొన మత్సరాహితులకుం జాళుక్యవిశ్వేశ్వరున్.

102

విద్వేషరౌద్రము

శా.

దృక్కేలిం గరవాలభైరవుఁడు విద్వేషించి విద్వేషులన్
జెక్కున్, జక్కడుచున్, బలంబు నెఱపుం, జెండాకు, ఖండించు, ను
బ్బెక్కించుం, బడవైచు, నెంచుఁ, బొడ మాయించున్, బిశాచావలిం
జొక్కించున్ భటఘోటకామిషకృతస్థూలోపహారంబులన్.

103


క.

క్రమమున మాత్సర్యద్వే, షము లాలంబన మనంగఁ జనుఁ, దద్భాషా
సముచితచేష్టాదికములు, రమణీయోద్దీపనములు రౌద్రంబునకున్.

104


క.

అనుభావంబులు వికృతన, యనరాగాధరవికంపనాదులు; ఘర్మ
స్వనగద్గదవైవర్ణ్యచ, లనములు సాత్వికము లండ్రు లక్షణవేదుల్.

105


క.

ఆయతమదచాపల్యా, సూయాగర్వములు హర్షసులభోత్సాహ
స్థేయోభావోగ్రతలును, బాయక సంచారు లనెడు భావము లరయన్.

106

వీరము

క.

విహితవిభావాదులచేఁ, బ్రహితోత్సాహంబ వీరరస మనఁ బరఁగున్,
బహువితరణకరుణారణ, మహిమంబులఁ ద్రివిధ మగుచు మలయుం గృతులన్.

107

దానవీరము

క.

అతివితరణశూరతచే, నతులబహిఃప్రాణమైన యర్థము నర్థి
ప్రతతికి నొసఁగెడుసద్గుణ, చతురత యిల దానవీరసంజ్ఞం బడయున్.

108


శా.

అల్పార్థిం బొడచూచినంతటనె విశ్వాధీశ్వరుం డిచ్చు సం
కల్పార్థంబులకంటె నర్థము నసంఖ్యాకంబుగా నున్నమ
త్కల్పానోకహకామధేనువులకుం గల్పించు జల్పాకవా
క్స్వల్పఖ్యాతి నడంచి యల్పమని యౌదార్యం బవార్యంబుగన్.

109