పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వల్పవదాన్యవిశ్వజనవల్లభుచే సిరి నొందు యక్షరా
ట్కల్పవిదూషకప్రతతి గర్వితరాజసభాంతరంబులన్.

91


తే.

రూపభాషితవికృతు లుద్దీపనములు
ముఖవికాసాదు లనుభావములు దలంప
నశ్రువైవర్ణ్యవిస్వరతాదికములు
సాత్త్వికంబులు నాఁగ హాస్యమున కమరు.

92


తే.

అశ్రుసంపాతచపలతాహర్షణాదు
లడరు సంచారిభావంబు లనుసరించి;

హాస్యభేదములు

హాస్య మాఱుప్రకారంబు లై తనర్చు;
తత్స్వరూపంబు లెఱిఁగింతుఁ దగు నెఱుంగ.

93


క.

స్మితమును హసితము నను నీ, ద్వితయము నుత్తమము నాగఁ దీపించుఁ దగన్;
స్మితము వికాసికపోలము, మితదర్శితరదన మైన మెఱయు హసిత మై.

94


క.

విహసితమును బ్రహసితము, న్మహి రెండును మధ్యమములు మదిఁ బరికింపన్;
విహసితము మృదులనినదము, ప్రహరితము శిరఃప్రకంపపరిమిత మరయన్.

95


క.

అపహసితము నతిహసితము, నెపుడును నధమంబు లనఁగ నేపారు; శిర
శ్చపలము నశ్రుయుతంబును, నపహసితము, మేను గదల నతిహసిత మగున్.

96

కరుణము

క.

శోకము విభావముఖభా, వాకలనముచేతఁ గరుణ మను రస మయ్యెన్;
జేకూఱిన యతులితవిప, దాకులితాలంబభావ మనఁగాఁ బరఁగున్.

97


మ.

తనరం బుత్త్రకళత్రమిత్రమిళితార్థస్వాంతుఁ డై శాత్రవుం
డని భక్తిన్ బ్రణమిల్లినన్ బ్రకటరాజ్యశ్రీలు ప్రాపించుఁ జ
క్కని విశ్వేశ్వరచక్రవర్తికరుణం; గాకున్న నవ్వైరి మా
త్స్యునిచందంబునఁ బాండ్యుభంగి ద్రవిడక్షోణీశుభావంబునన్
జను దీనుం డయి హీనుఁడై కృపణుఁ డై సంతప్తుఁ డై లుప్తుఁ డై.

98


తే.

అనిశకృతఖేదపర్యటనాదికములు
వరుస నుద్దీపనవిభావపరికరములు;
రూఢపరిదేవనశ్వాసరోదనములు
పరఁగు ననుభావములు గాఁగఁ గరుణమునకు.

99


తే.

స్తంభవైస్వర్యబాష్పము ల్సాత్త్వికములు;
మరణసంభ్రమదీనతోన్మాదములును
జాడ్యచింతాదులును నపస్మారగతియుఁ
బటువిషాదంబు సంచారిభావదశలు.

100