పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తసంగము

క.

చిత్తాసంగం బన నా, యత్తం బగుఁ బ్రతికృతి ప్రయత్నాదిసుఖో
త్పత్తికి నెల వగుచింతన, మత్తెఱుఁగు మనోవికీర్ణ మై విలసిల్లున్.

64


ఉ.

మానినిచూపులం దొరలి మానుగ విశ్వనృపాలుఁ డేపుతో
నానఁగఁ గారుకొన్న మనమా మన మాదట నాదరింప మిం
పూన నుపేంద్రపుత్త్రుఁ డత డున్నపదం బని కాదె యక్కునన్
నూనపటీరపంకములు సొం పలరారెడు సారెసారెకున్.

65

సంకల్పము

క.

చిత్తములో ననిశంబును, మొత్తము లగుతలఁపుఁగూటములఁ బొందెడిచో
నొత్తిల్లు చెమరుపులకల, యొత్తుడు సంకల్పదశకు నొనరిన చిన్నెల్.

66


చ.

అకట తలంచి చొక్కఁదగ ద క్కలయిక్కల నున్న నున్నగా
లికి నెల వైనపువ్వుఁబొదలే పొదలే పులకింప నేల మి
న్నక యెలనాఁగ నాగరజనప్రియుఁ డయ్యెడు విశ్వనాథు శ
య్యకుఁ జనవచ్చు వచ్చుమరునమ్ములు వమ్ములు చేసె దంతటన్.

67

ప్రలాపము

క.

ఇంతికిఁ బ్రలాప మనఁగాఁ, గాంతగుణాలాపకథనకల్పన; యదియున్
సంతసము చేయు నుచితా, ర్థాంతరరచనావిశేషణాదులచేతన్.

68


ఉ.

ఈగతిఁ జూతురే! తగులరే తగులే తగులేమ లీధరన్?
రాగదుఁ డైనవిశ్వనృపురాకయ పో తగురాక నాకు, లో
లో గమిగొన్న చూపుఁదొగలున్ దొగ లై విలసిల్లు; దానిచే
సాగెడు నన్నరేంద్రునకు సద్ద్విజరాజకళాధరత్వమున్.

69

జాగరము

క.

వల్లభుఁ డెట్లును నబ్బమి, మొల్లం బగుచింతఁ గన్ను మోడ్పక మదిలో
నల్లల నుడుకుచునుండెడు, తల్లడ మది జాగరాభిధానం బయ్యెన్.

70


చ.

నెలగలమేలురేలు చెలినిద్దరకుం బగ లయ్యెఁ, బెల్లువె
ల్లులఁ గొనువేడ్క లీనుపగలుం బగ లయ్యెను, గాన దీనికిం
గలువలు కన్ను లంటయును కైవడి విశ్వనృపాలచంద్రు నిం
పలరఁగఁ జూచుటం గువలయప్రియుఁ డంటయు నిక్క మిక్కడన్.

71

తనుకార్శ్యము

క.

అంగనకు నెట్లు ప్రియుదెస, సంగతి యరుదైనఁ గామసంతాపముచే
నంగములు డస్సిపోయిన, భంగి తనుత్వంబు నాఁగఁ బరగుం జూడన్.

72