పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కిలకించితము

క.

లలనునిదెసఁ బ్రియ కబ్బెడు, నలుకయు నెలనగవు గద్గదాలాపములున్
గలరుదితము ననియెడు నివి, కిలకించిత మనఁగ, బరఁగుఁ గేళీగతులన్.

48


చ.

అలుగు, విలోకనాంతముల నశ్రువులం బరఁగించు, చిన్నిన
వ్వులు చిలికించి చేరి చనవుం దగవుం దళు కొత్త గద్గదో
క్తులు నిగిడించు, నిక్కమునకుం బులకించుఁ జెమర్చుఁ, జూడుఁ డి
న్నెలఁతకు విశ్వనాథుపయి నెక్కొనుకూరిమిచంద మెట్టిదో!

49

మోట్టాయితము

క.

పతికిం దనపైఁ దలఁ ప, ద్భుత మని విని వనిత మేను పొంగుట మోట్టా
యిత మండ్రు భావసూచన, గతులం దెలియంగవలయుఁ గాముకు లెల్లన్.

50


మ.

ప్రమదం బారఁ జళుక్యవిశ్వవిభుశుంభద్గానధారాజలౌ
ఘముచేఁ బొంగుచు నంబరాభరణరంగత్కీర్తులం దాల్చుచున్
సుమనోవిస్ఫురదుత్తమాంగరుచులం జూపట్టు భూదేవి ని
త్యము నాథుం డభిగామి యైన వలదా తత్తద్విజృంభక్రియల్.

51

కుట్టమితము

క.

పరిరంభిణాధరక్షత, పరిపీడాదులసుఖంబు పటుదుఃఖముగా
దురపిల్లుట కుట్టమితం; బరయఁగ నుపచారవిధుల నగుఁ తెలియంగన్.

52


మ.

వనితా, నేఁడు చళుక్యనాథుని మరున్ వారించుటన్ బీవర
స్తనకుంభాధరబింబమధ్యమున నాసౌగంధికశ్రేణిచే
జన నర్చించెదు నీకు నీసుభగతాసంధాత విశ్వేశ్వరుం
డనియో కాక యుపేంద్రపుత్త్రుఁ డనియో యాచందముం జెప్పుమా.

53

బిబ్బోకము

క.

రాగమున నొండె, గర్వా, భోగంబున నొండె, మొఱఁగిపోవుట నొండెన్,
వేగాదరణము పతిపై, సాగమి బిబ్బోక మనఁగఁ జను నంగనకున్.

54


ఉ.

బుద్ధి మహీరమాసతులపొత్తున నుండక సత్ప్రతాపపం
బద్ధసఖిత్వ మొప్పఁ జని భాసురకీర్తి దిగంతరంబులన్
వృద్ధగుణానురక్తుఁ డని విశ్వనృపాలు నుతించు నెప్పుడున్
శుద్ధపతివ్రతాత్మికల సోఁకునె యెందు ననాదరక్రియల్.

55

లలితము

క.

వికసితవర్తనమున సే, వకవర్తనమునను రచితవచనములయెడన్
సుకుమారాంగన్యాసము, ప్రకటితముగ లలిత మండ్రు భావజ్ఞు లిలన్.

56