పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చేయుం జేయుదు రనఁగాఁ, జేయుదు చేయుదురు మీరు చిత్తం బలరం
జేయుదుఁ జేయుదు మనఁగా, నాయతముగ నివి భవిష్యదర్థముఁ జెప్పున్.

155


క.

మొదలం చెప్పిన యది తుద, యది యాదేశంబు విధికి నవ్వచనములం
బొదలి ప్రధమమధ్యమలకుఁ, దుద నుత్తమపురుషమునకుఁ దొంటట్ల యగున్.

156


క.

చేయునది బుధుఁడు ధర్మము, సేయునది బుధులు విశేషసిద్ధక్రియలం
జేయునది నీవు దర్పము, సేయునది తపంబు మీరు శివునకు ననినన్.

157


గీ.

ఉనుదురులకుమీఁద నొగిఁ గాఁత యున్న నా, శీర్వచనమునకును జెల్లు నదియు
శివము చేయుఁగాత శివుఁడు శోభనము చే, యుదురుగాత మీకుఁ ద్రిదశు లనఁగ.

158


క.

కారయిత సేయుకృతి నల, రారు ణిజంతంబు దాని కాదేశంబుల్
ధారిణి నింపును నించును, సారముగా నేకవదనసరణికి నయ్యెన్.

159


క.

తుద బహువచనమునకు నిం, పుదురును నింతురును నయ్యెఁ బుడమియెదల నిం
చుదురును గలుగుఁ బ్రయోగా, స్పదములు దేశీయసరణిఁ జనుఁ దెలియంగన్.

160


సీ.

శ్రీవిశ్వభూపతి చేయించుఁ గ్రతువులు సేవింపుదురు తదాశ్రితులు సురలఁ
బండంగ నింద్రుండు పరఁగించు వానలు హలికులు పరగింతు రర్థచయము
నెసఁగించు ధర శ్రీల నేపారు తద్వృత్తి నరభటు లెఱిఁగింపుదురు జయంబు
వెలయింపు కీర్తి యవ్విధి నెలయింపుదు రర్ఛు లెల్లెడఁ బ్రతాపాతిశయము
ననెడు పల్కులచేత ణిజర్థములకు, నేకవచనబహువచనపాక మెఱుఁగ
వలయు నవి పెక్కువిధముల వసుధఁ దెలియ, నిఖిలభాషావివేకులై నెగడు కవులు.

161


క.

మహితస్థావరతిర్య, ఙ్మహిళాదిక్రియలవర్తమానార్థమున
న్విహితమగు నెడుడుకారము, సహజంబుగ నేకవచనసంజ్ఞలచోటన్.

162


క.

పండును భూజము తరువులు, పండెడు రాచిలుక యొప్పఁ బలికెడుఁ జిలుకల్
గండాడెడు సతిపతిపైఁ, బండెడుఁ బెక్కింటిసతులు పండెడు ననఁగన్.

163


క.

నిగుడదు భూజము సింగము, బెగడదు నిటు నాగవనిత పిలువ చనెడుచోఁ
దగుభూతార్థంబున నదు, లగు నాదేశంబు క్రియల నయ్యైయెడలన్.

164


గీ.

ఒనర నింపు నించు ననియెడు వీనిపై, నుటతలొందెనేని నొక్కచోటఁ
బరఁగుఁ గారకాఖ్యపదములై తెనుఁగున, వానితెఱఁగు లెఱుఁగవలయు బుధులు.

165