పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

గురువులు గురులను గొల్తురు, గురువులచే గురులకొఱకు గురువులవలనన్
గురులకు భక్తి దనర్చును, గురువులయం దుండు సకలగుణములు నెపుడున్.

107


వ.

ఇత్తెఱంగున ననుక్తపదంబులయం దొడఁగూర్చునది.

108


క.

స్థావరతిర్యక్పదములు, లోవిడిచి తృతీయమొదలు పురుషాఖ్యలపైఁ
బైవర్ణములో నుత్వము, నావల నిత్వము విభక్తు లైదును జెందున్.

109


క.

సుతుచేత సుతునిచేతను, సుతుకొఱకును సుతునికొఱకు సుతువలనం ద
త్సుతునివలన సుతు కొదవును, సుతుని కొదవు సుతునియందు సుతునం దనఁగన్.

110


గీ.

పరఁగఁ గూఁతురుశబ్దంబుపై రుకార, మొక్కపలుకున పైనైన నుండుఁ బాయుఁ
బెక్కుపలుకులపైనైనఁ దక్కి పోవుఁ, గూఁతురుగఁ బొందిఁ గూఁతుగాఁ గోరె ననఁగ.

111


క.

కూఁతులచేఁ గూఁతురిచేఁ, గూఁతులకై కూఁతుకొఱకుఁ గూతులవలనం
గూఁతులకుఁ దగవు లొసఁగును, గూఁతులయం దుండుఁ బ్రీతి గుణవంతులకున్.

112


క.

ఓయాదిపదంబులతుదఁ, బాయని నిడు పుడిపి తగవిభక్తు లునుప ము
న్నేయనువునఁ బుంలింగని, కాయమునకుఁ జెప్పి రట్ల కవివరు లోలిన్.

113


గీ.

కడ డుకార మున్న నొడు లెల్ల సంబుద్ధి, హ్రస్వమైన దీర్ఘమైన నగును
వీరవరుఁడ, సమరశూరుఁడా యనఁగ మా, నిని యనంగ మానినీ యనంగ.

114


క.

డులు బహువచనంబులయెడఁ, దొలఁగు న్సంబోధనమున దుర్జనులారా
బలిభోజనవిధులారా, ఖలులారా మిమ్ము జముఁడు గావఁ డనంగన్.

115


గీ.

ఒనర యుష్మదస్మదుక్తుల కేకవ, చనబహువచనములు సంభవించు
మెఱయు నీవు నేను మీరు మే మనెడునా, దేశములు ధరిత్రిఁ దెలియవలయు.

116


క.

నియతుఁడవు నీవు నిన్నును, నియమింతురు శుభము లొలయు నీచే నీకై
జయమును నీవలన దయో, దయమున సిరి నీకు శుభము దగు నీయందున్.

117


క.

మీ రనఘులు మిముఁ గొలుతురు, సేమము మీచేత నుతులు చెలు వగు మీకై
హేమ మొదవు మీవలనను, శ్రీ మీ కలరారి యుల్లసిలు మీయందున్.

118


క.

నే రమ్యుఁడ ననుఁ దలఁతురు, నారులు నాచేత నెగడె నాకై ప్రియమౌ
ధారణి నావలనం బెం, పారెను నా కొసఁగుఁ బ్రియము లవి నాయందున్.

119


క.

మే మెఱుఁగము మము మఱచిరె, భామలు మాచేత బ్రదుకఁబడి మాకై ము
న్నే మీరు మావలన వల, దా మక్కువ సేయ మాకుఁ దగ మాయందున్.

120