అధిక్షేపశతకములు/వేణుగోపాలశతకము

వేణుగోపాలశతకము

సీ.

కౌస్తుభవక్ష శ్రీకరపాదరాజీవ
            దీనశరణ్య మహానుభావ
కరిరాజవరద భాస్కరకోటిసంకాశ
            పవనభుగ్వరశాయి పరమపురుష
వేదవేద్యానంతవిభవ చతుర్దశ-
            భువనశోభనకీర్తి పుణ్యమూర్తి
వైకుంఠపట్టణవాస యోగానంద
            విహగరాడ్వాహన విశ్వరూప
నీలనిభగాత్ర శ్రీరమణీకళత్ర
సద్గుణస్తోమ యదుకులసార్వభౌమ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

1


సీ.

నిను సదా హృత్కంజమునఁ బాయకుండ నా
            ప్రహ్లాదువలెను నేర్పరిని గాను
ఏవేళ నిను ధ్యానించుచుండుటకు నా
            దృఢచిత్తుఁ డైనట్టి ధ్రువుఁడ గాను
సతతంబు నిన్ను సంస్తుతి చేయుచుండ నా
            వేశిరంబుల సర్పవిభుఁడ గాను
నీ విశ్వరూపంబు సేవించుటకు సహ-
            స్రాక్షముల్ గల్గు వాసవుఁడఁ గాను
ఇట్టివారలఁ గృపజూచు టెచ్చుగాదు
దేవ నా వంటి దీనుని బ్రోవవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

2

సీ.

శ్రీరుక్మిణీ ముఖసారసమార్తాండ
            సత్యభామా మనశ్శశిచకోర
జాంబవతీ కుచశైలకంధర మిత్ర
            విందా సుధాధరబింబకీర
భద్రా వయోవనభద్రేభరాజ క
            శిందాత్మజా చిదానందనిలయ
లక్షణా శృంగారవీక్షణకాసార
            హంస సుధేష్ణా గుణాపహార
సుందరకపోల విబుధసంస్తుత కృపాల
వాల ధృతశైల కాంచనవర్ణచేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

3


సీ.

భానుకోటి ప్రభాభాసురంబగు వెల్గు
            పరులు చూచినఁ గానఁబడని వెల్గు
గురుకృపచేఁ గాక నరయనేరని వెల్గు
            నమృతంపు వృష్టిచే నమరు వెల్గు
విద్యుల్లతాపరివేష్టితంబగు వెల్గు
            ఘననీలకాంతులఁ గ్రక్కు వెల్గు
దశవిధప్రణవనాదములు గల్గిన వెల్గు
            మౌనులెన్నఁగ రమ్యమైన వెల్గు
ఆదిమధ్యాంతరరహితమైనట్టి వెల్గు
నిట్టి వెల్గును సేవింపనట్టి చెట్ట
వారికే లభించు కైవల్యపదము
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

4

సీ.

వేదంబులును నీవె వేదాంగములు నీవె
            జలధులు నీవె భూజములు నీవె
క్రతువులు నీవె సద్వ్రతములు నీవె కో
            విదుఁ డటంచన నీవె నదులు నీవె
కనకాద్రి నీవె యాకాశంబు నీవె ప
            ద్మాప్తసోములు నీవె యగ్ని నీవె
యణురూపములు నీవె యవనీతలము నీవె
            బ్రహ్మము నీవె గోపతియు నీవె
ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాఁడ
గించనుఁడ నన్ను బ్రోవుని కింకరునిగ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

5


సీ.

వేదాంతమనుచు బ్రహ్మాదులెంచిన వెల్గు
            నాదాంతసీమల నడరు వెల్గు
సాధుజనానందసంపూర్ణమౌ వెల్గు
            బోధకు నిలయమై పొసగు వెల్గు
ద్విదశాబ్జమధ్యమందుదయమౌ వెల్గు
            సుషుమ్ననాళంబునఁ జొచ్చు వెల్గు
చూడఁజూడఁగ మహాశోభితంబగు వెల్గు
            నిఖిలజగంబుల నిండు వెల్గు
శతకోటిసారస హితుల మించిన వెల్గు
మేరువు శిఖరంబుమీఁది వెల్గు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

6


సీ.

వేదాంతయుక్తులు విని రెండు నేర్చుక
            వాగి నాతఁడు రాజయోగి గాఁడు
కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి తెలియక
            ప్రేలినంతనె శాస్త్రవేత్త గాఁడు

పట్టపురాజు చేపట్టి యుంచంగానె
            గుడిసెవాటికి బారి గుణము రాదు
ముండపై వలపున రెండెఱుంగక మోవి
            యానఁగానె జొల్లు తేనె గాదు
కోఁతిపై నున్న సింగపుఁగొదమ కాదు
ఎంత చదివిన గుణహీనుఁ డెచ్చుగాఁడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

7


సీ.

దండకమండలుధారులై కాషాయ
            ములు ధరించిన దాన ముక్తి లేదు
భూతి గంపెడు పూసి పులిచర్మమును బూని
            ముక్కుమూసిన దాన ముక్తి లేదు
తిరుమణి పట్టెఁడు తీసి పట్టెలు తీర్చి
            భుజము గాల్చిన దాన ముక్తి లేదు
వాయువుల్ బంధించి ప్రాణంబు నలయఁగ
            మూత వేసిన దాన ముక్తిలేదు
గురుపదాంబుజముల భక్తి కుదిరి తమ్ముఁ
దా మెఱుంగక ముక్తి లేదవనియందు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

8


సీ.

దారిద్ర్యమనెడు భూధరచయంబులు గూల్ప
            హరి నీదు భక్తి వజ్రాయుధంబు
అజ్ఞానమనెడు గాఢాంధకార మణంప
            నీదు సపర్య భానూదయంబు
ఘోరమౌ దుష్కృతాంభోరాశి నింకింపఁ
            గా నీదు సేవ దావానలంబు
చపలం బనెడు రోగసమితిని మాన్ప న
            బ్జాక్ష నీ స్మరణ దివ్యౌషధంబు!

వెన్న గలిగియు నేతికి వెదకినటుల
పరుల దలతురు మీ మహత్తెఱుఁగ లేక
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

9


సీ.

సూక్ష్మస్నానము చేసి సొక్కినవేళ సా-
            మితధారణము చేసి మెలఁగువేళ
బడలిక పైనంబు నడచి వచ్చినవేళ
            సురతాప్తి ‘హా’ యని సొక్కువేళ
నొంటరిగాఁ జీఁకటింట నుండినవేళ
            నలుకతోఁ బవళించునట్టివేళ
దెఱఁగొప్ప మనమున దిగులు చెందినవేళ
            భక్తి గన్నట్టి విరక్తివేళ
లక్ష్యభావంబుఁ జూడ సలక్షణముగ
బండువెన్నెల గతిఁ గానబడును ముక్తి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

10


సీ.

అగ్రజన్మము తీరమందు వాసంబును
            వితరణము ననుభవించు నేర్పు
సంగీతసాహిత్యసంపన్నతయు మఱి
            రసికత బంధుసంరక్షణంబు
ననుకూలమైన చక్కని భార్య రాజస-
            న్మానంబు ప్రఖ్యాతి మానుషంబు
సౌందర్య మతిదృఢశక్తి విలాసంబు
            జ్ఞానంబు నీ పదధ్యాననిష్ఠ
ఇన్నివిధములు గలిగి వర్తించు నరుఁడు
భూతలస్వర్గపదములు బొందుచుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

11

సీ.

అబ్బ మేలోర్వలేనట్టివాఁడైనను
            మోహంబుగల తల్లి మూఁగదైన
ఆలు రక్కసియైన నల్లుఁ డనదయైనఁ
            గూతురు పెనుఱంకుఁబోతుదైనఁ
గొడుకు తుందుడుకైనఁ గోడలు దొంగైనఁ
            దనకు సాధ్యుఁడుగాని తమ్ముఁడైన
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిఁ బోయి
            చెప్పి యేడ్చెడు చెడ్డచెల్లెలైన
నరుని ఖేదంబు వర్ణింపఁ దరము గాదు
అంతటను సన్యసించుట యైన మేలు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

12


సీ.

విధవ చెవులకేల యరిది వజ్రపుఁ గమ్మ
            లురుకు తొత్తుకు విటుఁ డుండనేల
గ్రుడ్డిముండకు మంచి గొప్పయద్దంబేల
            సరవి గుడిసెకు బల్ చాందినేల
యూరఁబందులకుఁ బన్నీరుగంధంబేల
            బధిరున కల వీణపాటలేల
కుక్కపోతుకు జరీకుచ్చుల జీనేల
            పూఁటకూళ్ళమ్మకుఁ బుణ్యమేల
తనకు గతిలేక యొకఁడిచ్చు తఱిని వారి
మతులు చెరపెడి రండకుఁ గ్రతువులేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

13


సీ.

అలకాధిపతి నేస్తమైనప్పటికిని బా
            లేందుమౌళికి బిచ్చమెత్తవలసెఁ
గమలాసనుని కెంత కరుణ రా నడచినఁ
            గలహంసలకుఁ దూటి కాడలేదు

క్షీరాబ్ధి లంకలోఁ జేరినప్పటికైనఁ
            గొంగతిండికి నత్తగుల్లలేను
పరగ సాహేబు సుబా యెల్ల నేలిన
            బేగంబులకుఁ గుట్టుప్రోగులేను
ఒకరికుండెనటంచు మేలోర్వలేక
నేడ్వఁగరాదు తన ప్రాప్తి నెన్నవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

14


సీ.

అల్పునిఁ జేర్చిన నధికప్రసంగియౌ
            ముద్దు చేసినఁ గుక్క మూతి నాకు
గోళ్ళ సాఁకినఁ బొంతకుండలో విష్ఠించుఁ
            గొద్దితొత్తుల పొందు రద్ది కీడ్చు
గూబలు వ్రాలినఁ గొంప నాశముఁ జేయుఁ
            జనవీయఁగ నాలు చంక కెక్కుఁ
బలువతో సరసంబు ప్రాణహాని యొనర్చు
            దుష్టుడు మంత్రైన దొరను జెఱచుఁ
కనుక విని దెల్సి జాగ్రత్తగాను ప్రజలఁ
బాలనముఁ జేయు టది రాజపద్ధతి యగు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

15


సీ.

అవనీశ్వరుఁడు మందుఁడైన నర్థుల కియ్య
            వద్దని వద్ది దివాను చెప్పు
మునిషీ యొకడు చెప్పు మొనసి బక్షీ చెప్పుఁ
            దరువాత నా మజుందారు చెప్పుఁ
దల ద్రిప్పుచును శిరస్తా చెప్పు వెంటనే
            కేలు మొగిడ్చి వకీలు చెప్పు
దేశపాండ్యా తాను దినవలెనని చెప్పు
            మొసరద్ది చెవిలోన మొఱిగి చెప్పు

యశము గోరిన దొరకొడుకైనవాఁడు
ఇన్ని చెప్పులు కడఁ ద్రోసి యియ్యవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

16


సీ.

ఆత్మ తెలియని యోగి కద్వైతములు మెండు
            నెఱఱంకులాఁడికి నిష్ఠ మెండు
పాలు పిండని గొడ్డుబఱ్ఱె కదుపు మెండు
            కల్లపసిండికిఁ గాంతి మెండు
గెలువని రాజుకు బలుగచ్చులును మెండు
            వంధ్యకు విభునిపై వాంఛ మెండు
దబ్బరవాటకుఁ దలద్రిప్పుటలు మెండు
            పసిమిరోగపు లొత్తు మిసిమి మెండు
వండలేనక్కకు వగపులు బలుమెండు
            లేలేని యన్నకు తిండి మెండు
కూటికియ్యని విటకాని పోటు మెండు
మాచకమ్మకు మోహంబు మదిని మెండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

17


సీ.

ఆలిని వంచుకోఁజాలక తగవర్ల
            బ్రతిమాలుకొనువాని బ్రతుకు రోఁత
నర్తనాంగనల వెన్కను జేరి తాళముల్
            వాయించువాని జీవనము రోఁత
వ్యభిచరించెడి వారవనిత గర్భంబునఁ
            బురుషత్వము వహించి పుట్ట రోఁత
బంధుకోటికి సరిపడని దుర్వృత్తిని
            బడియున్న మనుజుని నడత రోఁత
యరసికుండైన నరపతి నాశ్రయించి
కృతులొనర్చెడి కవి నెత్తిగీఁత రోఁత
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

18

సీ.

ఆస్థానమందు విద్వాంసుల గని లేచి
            మ్రొక్కులేయని వారమోహినులను
దల గొరిగించి మెత్తని సున్నమును బూసి
            బొగ్గుగంధమున బొట్టమర్చి
చెప్పులు మెడఁ గట్టి చింపిచేటలఁ గొట్టి
            గాడిదపైఁబెట్టి కాల మెట్టి
తటుకునఁ గ్రామప్రదక్షిణం బొనరించి
            నిల్చినచోటఁ బేణ్ణీళ్ళు చల్లి
విప్రదూషకులగువారి వెంట నిచ్చి
సాగ నంపించవలయును శమనపురికి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

19


సీ.

పెట్టనేరని రండ పెక్కునీతులఁ బెద్ద
            గొడ్రాలిముండకు గొంతు పెద్ద
మంకుబుద్ధికిఁ దన మాట సాగుటె పెద్ద
            రిక్తుని మదిని కోరికలు పెద్ద
అల్పవిద్వాంసుండు నాక్షేపణకుఁ బెద్ద
            మూర్ఖచిత్తుఁడుఁ కోపమునకుఁ బెద్ద
గుడ్డిగుఱ్ఱము తట్టగుగ్గిళ్ళు తినఁ బెద్ద
            వెలయ నాఁబోతుకండలను బెద్ద
మధ్యవైష్ణవునకు నామములు పెద్ద
పెట్టనేరని విభుఁడు కోపించ పెద్ద
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

20


సీ.

ఈడిగె ముత్తికి జోడుశాలువలిస్తి
            కురుబ గంగికి జరీకోకలిస్తి
కడియాలు కుమ్మర కనకంకు దీసిస్తి
            పోఁగులు గోసంగి పోలికిస్తి

పోచీలు చాకలి పుల్లి చేతుల వేస్తి
            దాని తల్లికి నూఱు దారబోస్తి
దాసరచ్చికి దేవతార్చన లమ్మిస్తి
            గుఱ్ఱాల యుప్పర కొండికిస్తి
ననుచుఁ బాత్ర మపాత్రము ననక యిచ్చి
చెప్పుకొందురు మూఢులు సిగ్గులేక
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

21


సీ.

ఈనెగాండ్లంటరో యీండ్లను బగిసార
            సెన్నంగిసుద్దులు సెప్పలేరు
యేదగాండ్లంటరో యీండ్లింట పొగవెల్ల
            గొర్లాల బిగ్గెన గొసుగుతారు
కయితగాండ్లంటరో కాల్పంగటించుక
            చిన్నచ్చరము సేరు చెప్పలేరు
వాసివేలంట తమాసగా ఱొమ్మున
            దప్పెట వేసుక తట్టలేరు
అనుచు విప్రోత్తములఁ గన్నయట్టివేళ
మోటుమనుజు లనియెడి మాటలిట్లు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

22


సీ.

ఉండి యియ్యని లోభి రండకొంపను శ్రాద్ధ
            మైననేమి శుభంబులైననేమి
చండాలు వాకిట వండుకొన్నది యంబ
            లైననే మతిరసాలైననేమి
మాచకమ్మ సమర్త మఖపుబ్బహస్తచి
            త్తయిననేమి పునర్వసైననేమి
కులనాశకుండయిన కొడుకు దీర్ఘాయువై
            యుండిననేమి లేకున్ననేమి

బవరమునఁ జొచ్చి పొడువని బంటుచేతి
దాయుధంబైననేమి తెడ్డయిననేమి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

23


సీ.

ఎనుబోతు వానకు జంకునా యెంతైన
            వెలహెచ్చుగల తేజి వెఱచుఁగాక
గుణహీనుఁడెంతైన గులముకు వెఱచునా
            గుణవంతుఁ డెప్పుడు వెఱచుఁగాక
గడుసైన పెనుమొద్దు గాలికి వెఱచునా
            విరుగఁగాచిన మ్రాను వెఱచుఁగాక
ఱంకుముండ బజారురచ్చకు వెఱచునా
            వీరపతివ్రత వెఱచుఁగాక
ఘనతగల్గిన దొరబిడ్డ గాక సుకవి
నోటితిట్లకు వెఱచునా మోటువాడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

24


సీ.

ఏదంబులకు మంగలెంకఁడే దగునేటు
            ప్రశ్న సెప్పను మాల పాపిగాఁడు
కయితముల్ సెప్ప బోగము చినెంకఁడె సరి
            సంగీత యిద్దెకు సాకలెల్లి
చాత్రపురండాల సాతాననంతమ్మ
            సిందులు ద్రొక్క దాసరి పెదక్క
యీణె గొట్టను కోమటీరేశమే సరి
            మతి రతాలకు మాఱుమనుము లచ్చి
అనుచు మూర్ఖాళి యీ రీతి ననుదినంబు
భూతలమునందు వచియింత్రు నీతిలేక
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

25

సీ.

ఒంటిజందెము ద్వాదశోర్ధ్వపుండ్రంబులు
            నమరిన పసపు కృష్ణాజినంబు
దండంబు గోచి కమండలు వక్షమా
            లిక పుస్తకంబు పాదుకలు గొడుగు
దర్భ మౌంజీ పవిత్రములు కటి కరాన
            చెవిలోనఁ దగు తులసీదళంబు
వేదమంత్రములు వినోదమౌ నపరంజి
            పడగకుండలములు పంచశిఖల
తో నరుగుదెంచి బలిని భూదాన మడిగి
తెచ్చి సురపతి కిచ్చితి విచ్చతోడ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

26


సీ.

కనుముక్కుతీరు చక్కనికాంతి పొందిన
            శుభలక్షణంబులు సూక్ష్మబుద్ధి
ఘనత వివేకవిక్రమము బాంధవ్యంబు
            మర్మవిలాసంబు మానుషంబు
సరసవాచాలత సాహసం బొకవేళ
            విద్యావిచక్షణ విప్రపూజ
వితరణగుణము భూపతియందు భయభక్తి
            నీతియు సర్వంబు నేర్చునోర్పు
స్నానసంధ్యాద్యనుష్ఠానసంపన్నత
            గాంభీర్యము పరోపకారచింత
గలుగు మంత్రిని జేర్చుకొన్నట్టి దొరకుఁ
గీర్తి సౌఖ్యము సకల దిగ్విజయము సిరి
గలుగుచుండును దోషము ల్దొలగిపోవు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

27

సీ.

కన్నెనిచ్చినవానిఁ గబ్బమిచ్చినవాని
            సొంపుగా నింపుగాఁ జూడవలయు
అన్నమిచ్చినవాని నాదరించినవాని
            దాతఁగాఁ దండ్రిఁగా దలపవలయు
విద్యనేర్పినవాని వెఱపుదీర్చినవాని
            గురునిగా హరునిగా నెఱుఁగవలయు
కొల్వు గాచినవానిఁ గూర్మి చూపినవాని
            సుతునిగా హితునిగాఁ జూడవలయు
నిట్టివారలపైఁ బ్రేమ పెట్టుకొనక
కసరుబెట్టిన మనుజుండు గనఁడు కీర్తి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

28


సీ.

కలకొద్దిలోపలఁ కడదెచ్చి మన్నించి
            యిచ్చినవారి దీవించవలయు
సిరిచేత మత్తుఁడై పరు నెఱుంగని లోభి
            దేబెను పెళ్ళునఁ దిట్టవలయుఁ
దిట్టిన యప్పుడేఁ దెలిసి ఖేదము నొంది
            యింద్రుడైనను బిచ్చమెత్తవలయు
దీవించినను యల దీర్ఘాయును బొంది
            బీదైన నందలం బెక్కవలయు
నట్టియాతఁడు సుకవి కానట్టి యతనిఁ
గవియనఁగనేల కవిమాలకాకి గాఁడె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

29


సీ.

కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు
            చలువవస్త్రములు బొజ్జలు కఠార్లు
కాసెకోకలు గంపెడేసి జందెములును
            దలవార్లు జలతారు డాలువార్లు

సన్నపు తిరుచూర్ణచిన్నెలు కుట్టాలు
            జొల్లువీడెమ్ములు వల్లెవాట్లు
దాడీలు వెదురాకు తరహా సొగసుకోర్లు
            నంతకు దొరగార్లటంచుఁ బేర్లు
సమరమున జొచ్చి ఱొమ్ముగాయములకోర్చి
శాత్రవుల ద్రుంచనేరని క్షత్రియులకు
నేల కాల్పనె యీ వట్టి యెమ్మెలెల్ల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

30


సీ.

కోమటి యత్యంతక్షామము గోరును
            ధారుణి క్షితిపతి ధనము గోరు
ధరఁ గరణము గ్రామదండుగ గోరును
            జంబుకంబేవేళ శవము గోరు
కుజనుఁడౌ వైద్యుండు ప్రజల రోగము గోరు
            సామాన్యవిప్రుండు చావు గోరు
అతిశూరులగువారు ధృతిని గోరుచునుందు
            రాఁబోతు వేదల యశము గోరుఁ
గాఁపువానికి గ్రామాధికారమైన
దేవభూసురవృత్తులు దియ్యఁగోరు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

31


సీ.

కండచక్కెర పానకముఁ బోసి పెంచిన
            ముషిచెట్టుకుఁ దీపి పుట్టబోదు
పాలమున్నీటి లోపల ముంచి కశిగినఁ
            గాకిఱెక్కకుఁ దెల్పు గలుగఁబోదు
పన్నీరుగంధంబు పట్టించి విసరినఁ
            దేలుకొండి విసంబు తియ్యఁబోదు
వెదురుబద్దలు చుట్టు వేసి బిగించినఁ
            గుక్కతోఁకకు వంక కుదురబోదు

మంచిమాటల నెంత బోధించి చెప్ప
మడియ రండకుని గుణంబు విడువబోదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

32


సీ.

ఖేదమోదంబుల భేదంబు తెలియక
            గోలనై కడిపితిఁ గొన్నినాళ్ళు
పరకామినుల కాసపడి పాపమెఱుఁగక
            కొమరుప్రాయంబునఁ గొన్నినాళ్ళు
ఉదరపోషణమున కుర్వీశులను వేడి
            కొదవచేఁ గుందుచుఁ గొన్నినాళ్ళు
ఘోరమైనట్టి సంసారసాగర మీఁదు
            కొనుచుఁ బామరముచేఁ గొన్నినాళ్ళు
జన్మమెత్తుట మొదలు నీ సరణిఁ గడచె
నెటుల గృపఁ జూచెదో గతం బెంచఁబోకు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

33


సీ.

గజముపై చౌడోలు గాడిదకెత్తితే
            మోయునా పడవేసి కూయుఁ గాక
చిలుక పంజరములోపల గూబ నుంచితే
            పలుకునా భయపడి యులుకుఁ గాక
కుక్క నందలములోఁ గూర్చుండఁబెట్టితే
            కూర్చుండునా తోళ్ళు కొఱుకుఁ గాక
ధర్మకార్యములలో దరిబేసి నుంచితే
            యిచ్చునా తన్నుక చచ్చుఁ గాక
చెడి బ్రతికినట్టి శుంఠను జేర్చుకొనిన
వాఁడు చెడు నుంచుకొన్న భూపతియుఁ జెడును
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

34

సీ.

గోవుల నఱకంగఁ గోసి వండుక తిను
            మాలమాదిగలు భూపాలురయిరి
మానాభిమానముల్ మాని ప్రవర్తించు
            మంకుగులాములు మంత్రులైరి
అక్షరం బెఱుగక యాకారపుష్టిచే
            వర్ణసంకరులు విద్వాంసులైరి
బాజారిఱంకుకైఁ బంచాయతీ చెప్పు
            పాతలంజెలు వీరమాతలైరి
అహహ! కలియుగధర్మ మేమనఁగ వచ్చు
నన్నిటికి నోర్చి యూరక యుండదగునే
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

35


సీ.

చదువుచుండెడివేళ సభలోనఁ గూర్చుండి
            దున్నపోతుల కొడుకెన్నుఁ దప్పు
విద్యాధికుల కిచ్చువేళడ్డుపడి మాల
            ధగిడీల కొడుకు వద్దనుచుఁ జెప్పు
ధనమెక్కుడుగఁ గూర్చి తినలేక యేడ్చెడి
            పెనులుబ్ధుఁ డర్థుల గనిన ఱొప్పు
బిరుదుగల్గిన యింటఁ బెరిగినఁ గొణతంబు
            విప్పినంతనె కుక్క వెదకుఁ జెప్పు
రాజసభలందుఁ బండితరత్నములకుఁ
బనులు చెఱచును నొక్కొక్క ప్రల్లదుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

36


సీ.

జన్నిరోగికి బఱ్ఱెజున్ను వేసినయట్లు
            పిల్లినెత్తిన వెన్నఁ బెట్టినట్లు
కుక్కపోతుకు నెయ్యికూడు వేసినయట్లు
            చెడ్డజాతికి విద్య చెప్పినట్లు

సాతాని నొసట విభూది రాసినయట్లు
            గూబదృష్టికి దివ్వె గూడినట్లు
ధనపిశాచికి సుదర్శనము గన్పడినట్లు
            చలిచీమలకు మ్రుగ్గు చల్లినట్లు
సురభిబదనిక పాముకుఁ జూపినట్లు
దుష్టునకు నీతి వెగటుగాఁ దోఁచునయ్య
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

37


సీ.

తండ్రి మధ్వాచారి తనయు డారాధ్యుండు
            తల్లి రామాన్జ మతస్థురాలు
తనది కూచిమతంబు తమ్ముఁడు బౌద్ధుండు
            సర్వేశ్వరమతంబు సడ్డకునిది
ఆలు కోమటిజాతి దక్క జంగమురాలు
            బావగారిది లింగబలిజకులము
ఆఁడుబిడ్డ సుకారి యల్లుఁడు పింజారి
            మఱదలు కోడలు మారువాడి
గలియుగమ్మున వర్ణసంకరము ప్రబలి
యుత్తమకులంబు లొకమూల నొత్తిగిల్లె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

38


సీ.

తల్లి ఱంకునఁ దండ్రి ధనము పోయినయట్లు
            మూలనిక్షేపంబు మునిఁగినట్లు
కూఁతురి ముడుపెల్లఁ గొల్లవోయినయట్లు
            కాణాచివల్లెలు కాలినట్లు
తన యాలి గడనెల్ల దండుగ కైనట్లు
            దండ్రి తద్దినమేమొ తప్పినట్లు
చెల్లెపైఁ బడి దొంగ చెఱచిపోయినయట్లు
            కొడుకు నప్పుడు తలగొట్టినట్లు

దిగులుపడి చూచి మూర్ఛిల్లి తెప్పరిల్లి
కవుల కియ్యంగవద్దని కన్ను మీటు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

39


సీ.

దూదేకుల హుస్సేను దొమ్మరి గోపాలు
            పట్ర మంగఁడు గాండ్ల బాలిగాడు
బయశేని నాగఁడు పటసాలె నారాయఁ
            డగముడి లచ్చిగాఁ డా ముకుందు
చాకలి మల్లఁడు సాతాని తిరుమల
            గొల్ల కాటడు బెస్త గుర్విగాడు
కోమటి శంభుడు కుమ్మరి చెంగడు
            మంగ లెల్లడు బోయ సింగడొకడు
కన్నవారెల్లఁ బండితుల్ కవులుఁ గాగ
వేదశాస్త్రంబు లేడను విప్రులేడ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

40


సీ.

దొరవద్ద నెంత చౌదరియైన దన మనవి
            తాఁ జెప్పఁ గార్యసాధకము లేదు
రంభైన తన కుచకుంభముల్ దన చేత
            దా బిగించిన సుఖతరము లేదు
తగవులో నా పురందరుఁడైనఁ దన ప్రజ్ఞ
            తాఁ జెప్పుకొనినఁ బెత్తనము లేదు
తనుఁ జేయు పుణ్య మింతని యొరులతోఁ జెప్ప
            బ్రహ్మదేవునికైన ఫలము లేదు
గనుక నివియెల్ల నొరులచేఁ గాని భువిని
తమదు శక్తికి మంత్రతంత్రములు లేవు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

41

సీ.

దొర సొమ్ము దిని కార్యసరణి వచ్చినవేళఁ
            బాఱిపోఁ జూచిన బంటువాని
నగ్నిసాక్షిగను బెండ్లాడిన తన యింతి
            నేలక పరకాంత నెనయువానిఁ
గబ్బము ల్సేయు సత్కవిజనాళికిఁ గల్గి
            నంతలో నేమియ్యనట్టివాని
యిచ్చిన దీవెన లియ్యక యత్యాశ
            తో బోవు యాచకుండైనవాని
గట్టిముచ్చెలతోఁ బడగొట్టి విఱుగ
గట్టి పంపించవలయునుఁ గాలుపురికి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

42


సీ.

నంబి కవిత్వంబు తంబళ జోస్యంబు
            వలనొప్ప కోమటి వైష్ణవంబు
వరుసనె యుప్పరివాని సన్యాసంబు
            తరువాత శూద్ర సంతర్పణంబు
రజకుని గానంబు రండా ప్రభుత్వంబు
            వెలయఁగా వెలమల వితరణంబు
సాని పండితశాస్త్రవాదము వేశ్య
            తనయుఁ డబ్బకుఁ బెట్టు తద్దినంబు
నుభయభ్రష్టత్వములు గాన నుర్విలోన
రాజసభలందు నెన్నగా రాదు గదర
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

43


సీ.

నత్తు లేకుండిన ముత్తైదు ముక్కందు
            మూలలందును ఋతుస్త్రీలయందు
మధ్యపక్వస్థలమందుఁ గిన్నెరమీటు
            నతనిచేఁ గుమ్మరి యావమందుఁ

కాటుకపొగయందుఁ గాళ్ళచప్పుడు లందు
            దొమ్మరి వాయించు డోలునందు
దీపము లేనట్టి దివ్వెకంబమునందు
            మార్జాలముఖమందు మాంసమందు
ముదముతో సంతతము నీదు వదినెగారు
విడిది చేసియు వీరిని విడువకుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

44


సీ.

పంచాంగములు మోసి బడవాతనముఁ జేసి
            పల్లెకూటము చెప్పి పసులఁ గాచి
హీనవృత్తిని బిచ్చమెత్తి గోడలు దాఁటి
            ముష్టికూళ్ళకుఁ బోయి మొత్తెలఁ బడి
విస్తళ్ళు గుట్టి కోవెలనంబి వాకిటఁ
            గసవూడ్చి లంజెల కాళ్ళు పిసికి
కన్నతొత్తులఁ దమ్మ కళ్ళెత్తి గతి చెడి
            యాలుబిడ్డలఁ బరు లంటఁజేయు
నట్టి దేబెకు సిరి గల్గెనేని వాఁడు
కవివరుల దూఱు బంధువర్గముల గేరు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

45


సీ.

పతికి మోహములేని సతి జవ్వనంబేల
            పరిమళింపని సుమప్రచయమేల
పండితకవివర్యులుండని సభ యేల
            శశి లేని నక్షత్రసమితి యేల
పుత్రసంపద లేని పురుషుని కలిమేల
            కలహంసములు లేని కొలనదేల
శుకపికరవ మొకించుక లేని వనమేల
            రాజు పాలింపని రాజ్యమేల

రవివికాసంబు లేనట్టి దివసమేల
ధైర్యమొదవని వస్తాదుతనమదేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

46


సీ.

పరకాంతపయి నాసపడెడి మానవులకు
            నగుబాటు మనమున తగని దిగులు
నగుడు విరుద్ధంబు నాచారహీనత
            చేసొమ్ముపోవుట సిగ్గుచెడుట
యపకీర్తి బంధుజనాళి దూషించుట
            నీతియుఁ దొలగుట నిద్రచెడుట
పరలోకహాని లంపటనొంది మూల్గుట
            పరువుదప్పుట దేహబలము చెడుట
తన యాలి చేతిపోటునఁ గృశించుట దాని
            పరుడు గన్గొనిన జీవంబు విడుట
ముజ్జగము లేలు నా విరాణ్మూర్తికయినఁ
గాని దుర్వృత్తి దగదెంతవానికైన
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

47


సీ.

పరదళంబులఁ గాంచి భయముచే నురికిన
            రాజుగాఁడతడు గోరాజు గాని
ధర్మంబులకు విఘాతముసేయ మంత్రిశే
            ఖరుఁడు గాఁడతఁడు సంకరుఁడు గాని
విద్యాప్రసంగము ల్విన రసజ్ఞత లేని
            ప్రాజ్ఞుల సభగాదు రచ్చ గాని
పతితోడ కలహించి పడుకొని యేడ్చెడి
            దాలుగా దది యెఱ్ఱతేలు గాని
శాస్త్రముల మించినట్టి యాచారమైన
నిష్ఠగాదతనికి పెనుచేష్టగాని
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

48

సీ.

పానంబు జూదంబు పరసతిపై బాళి
            ధనకాంక్ష మోహంబు తగని యాశ
యనుదినంబును వేఁట యధికనిద్దుర గొంట
            పేదఱికంబును బిఱికితనము
నతిలోభమును మందగతి హెచ్చుకోపము
            నమితవాచాలత యనృతములును
ఖండితంబాడుట గర్వంబు సంధ్యల
            వేళలఁ బయనంబు విప్రనింద
యాప్తజనముల దూఱుట నసురుతిండి
మానవేంద్రుల పదవికి హానులివియ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

49


సీ.

పాలనలేని భూపతియైన నతని ద
            గ్గెరనుండు మంత్రి ధగ్డీయునైన
చెవిటి రాయసమైన సేవకుఁడయినను
            వారసుగాఁడు దివాను నయిన
వరుస బక్షీ చిత్తవైకల్యుండయినను
            గడుదీర నత్తి వకాలతైన
కోశపాలకునకు గుందేటి తెవులైన
            నుగ్రాణగాని కత్యుగ్రమైన
దాతలకు మోస మచటి విద్వాంసులకును
బ్రాణసంకట మా భూమిఁ బ్రజకుఁ గీడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

50


సీ.

పీనుగందపుమోము పిల్లిమీసంబులు
            కట్టెశరీరంబు కాకినలుపు
ఆర్చుకన్నులు వెన్నునంటిన యుదరంబు
            నురుగుకారుచు నుండు నోరుకంపు

చెయిచెయ్యి దిగరాచి చెక్కిళ్ళు రుద్దుట
            దవడలు సొట్టపాదములు మిట్ట
ఒకరిని జూచి మేలోర్చక యేడ్చుట
            దౌర్భాగ్యగుణములు తగని యాశ
యిట్టి యవలక్షణపు మంత్రి నేర్పరింప
దొరకు నపకీర్తి దెచ్చు నా దుర్జనుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

51


సీ.

పూపొదలో దాఁగి పులి యున్నరీతిని
            మొగిలిరేకున ముండ్లు మొలచినట్లు
నందనవనములో నాగుఁబామున్నట్లు
            చందురునకు నల్పు చెందినట్లు
సొగసైన లేమకు సెగరోగమున్నట్లు
            మృగనాభిలోఁ బిప్పి తగిలినట్లు
జలధిలోన విషంబు సంభవంబైనట్లు
            కమలాప్తునకు శని గలిగినట్లు
పద్మరాగమునకుఁ బటలమేర్పడినట్లు
            బుగ్గవాకిటి చుట్టు పుట్టినట్లు
ధర్మవిధులైన రాజసంస్థానములను
జేరు నొక్కొక్క చీవాట్లమారిశుంఠ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

52


సీ.

పయిమాట లొకలక్ష పలికిననే సరా య
            హంకారవర్తన నడఁపవలయు
నడఁపజాలక కానలందుఁబోయిన సరా
            యెఱుక దెల్పెడి మూర్తి దొరకవలయు
దొరికినాఁడని వేడ్క నరసిననే సరా
            గురుపదంబుల భక్తి కుదురవలయు

కుదిరెనంచని యూరకుండిననే సరా
            పాయ కాత్మను బాటి సేయవలయు
చేసినను కాదు పాచిని ద్రోసి శుద్ధ
గంగ యెత్తినయటు ముక్తి గాంచవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

53


సీ.

భట్టరాచార్యుల బట్టలు కాగానె
            మడి గట్టుకొను పట్టుమడతలౌనె
అల రాచకూతురు నధరంబు కాగానె
            తేనెఁ జిల్కునె యనుపానమునకు
అల్ల యేలేశ్వరోపాధ్యాయు బుఱ్ఱయు
            రాచూరి పెద్దఫిరంగియౌనె
అల తాళ్ళపాక చిన్నన్న రోమములైన
            దంబుఱ దండెకు దంతులౌనె
హుంకరించిన నెటువంటి మంకునైనఁ
దిట్టవలయును గవులకు దిట్టమదియె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

54


సీ.

బడవాకుఁ బ్రతి యెన్న బహుమతు లేనూరు
            దళవాయి కొక్క యూర ధర్మచేట
పడుపుతొత్తుకు మేలుపౌజు కమ్మలు
            తాటాకు దుద్దులు తల్లిచెవుల
దండెదాసర్లకుఁ దాజీతవాజము
            కవివరులకుఁ గన్నగాని మన్ను
బైనీని సుద్దికి బారిశాలువజోడు
            విద్వాంసులకు బేడ వెలితిగుడ్డ
ఘనము నీచం బెఱుంగక కలియుగమున
నవని నడుతురు మూఢులైనట్టి దొరలు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

55

సీ.

మంగలకత్తిపై నంగవేసిన యట్లు
            క్రోడెత్రాచును ముద్దులాడినట్లు
కొఱవితో నడినెత్తి గోఁకినట్లీనిన
            పులితోడ సాముకుఁ బూనినట్లు
పెదసింగమును ఱాల నదలించికొనినట్లు
            మినుకువజ్రపురవ మ్రింగినట్లు
కొర్తిమీదను గొంతు కూర్చుండుకొనినట్లు
            నూతిపైఁ బసిబిడ్డ నునిచినట్లు
క్ష్మాతలేంద్రుని సేవ కష్టంబు వార
లిచ్చిరని గర్వమున నిక్కి మెచ్చరాదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

56


సీ.

మకరందపానంబు మధుకరాళికిఁ గాక
            జోఱీగఁ చవిగని జుఱ్ఱగలదె
హరిపదాబ్జధ్యాన మమనస్కులకుఁ గాక
            చెనఁటి సద్భక్తితోఁ జేయగలడె
కవితారసజ్ఞత సువివేకులకుఁ గాక
            యవివేకి చెవియొగ్గి యాఁనగలడె
పద్మినీరతి వేడ్క పాంచాలునకుఁ గాక
            దేబైన షండుఁడు తెలియఁగలఁడె
రాజసభలఁ బరోపకారములు తెలుప
శ్రేష్ఠులే కాక దుష్టులు చెప్పఁగలరె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

57


సీ.

మద్యపాయీలతో మచ్చిక కారాదు
            బడవాల గొప్పగాఁ బట్టరాదు
శాత్రవునింట భోజనము చేయఁగరాదు
            సన్యాసులను గేలి సలుపరాదు

దేవభూసురవృత్తి తెరువు పోవఁగరాదు
            పరునాలిపై నాస పడగఁరాదు
కంకోష్ఠునకు నధికార మియ్యగరాదు
            చెలగి లోభినిఁ జేర బిలువరాదు
లంచగాండ్లను దగవుల నుంచరాదు
మాతృపితరుల యెడ భక్తి మఱువరాదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

58


సీ.

మన్ననలేని భూమండలేంద్రుని కొల్వు
            లాలింపనేరని లంజ పొందు
వచ్చిపోవనియట్టివాని చుట్టఱికంబు
            బుద్ధితక్కువవాని యొద్ద ఋణము
సరిగానివానితో సరసోక్తులాడుట
            బలవంతు నింటను బడుచుఁ గొనుట
సామాన్యజాతితో జగడంబు పూనుట
            మూర్ఖుని మైత్రికి మోహపడుట
అధమమిది భువి నరులకు నజునకైన
మఱచి యప్పని చేసిన మానహాని
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

59


సీ.

మన్నించు నరపతి మమత తప్పిన వెన్క
            నుత్తముం డాభూమి నుండరాదు
పైవిటుం డొక్కఁ డేర్పడినట్టి వేశ్యపై
            నెంతవాఁడైన నాసింపరాదు
అన్నదమ్ములతో గొట్లాడి మానసము ని
            ర్జింపక తా తామసింపరాదు
పగతుఁడు నెనరుగా భాషించెనని వాని
            నెయ్యంబుగనక చన్వియ్యరాదు

చెలులతో రాజకార్యముల్ చెప్పరాదు
పలువ మంత్రైన దొరలకుఁ బరువులేదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

60


సీ.

రణభేరి తగవైన రాజు శ్వేతచ్ఛత్ర
            మేనుఁగు నివి నాలు గేకరాశి
మారుండు కీరంబు మందసమీరుండు
            రాకాసుధాకరుం డేకరాశి
వేదము ల్గోవులు విప్రోత్తములు దర్భ
            లేర్పరింపఁగ నాలు గేకరాశి
మూఢాత్ముఁ డత్యంతమూర్ఖుఁడు గాడిద
            కాకి వీరలు నాలు గేకరాశి
ద్విపదకావ్యంబు ముదికాంత దిడ్డిగంత
యియ్యనేరని రండ నాల్గేక రాశి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

61


సీ.

రతికి దార్కొని సిగ్గు రణమున భీతి భో
            జనకాలమందున సంశయంబు
యిచ్చెడిదేఁ జింత నిచ్చినయెడ లేమి
            వచ్చినవానిపై హుంకరింపు
తగవున మొగమోటదాన మిచ్చకులకుఁ
            దపమొనర్చెడివేళఁ దామసంబు
గూర్మి చేసినచోటఁ గూహకం బద్భుత
            ద్రోహవర్తనులపై యీహదృష్టి
అవని సత్కీర్తికోసమై యాశనొందు
రాజవరులకు నివియఁ గారాని పనులు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

62

సీ.

రాజులమంచు బొజ్జలు పెంచగా రాదు
            అని మొనలో నఱుకాడవలయు
మంత్రులమని బొంకుమాటలాడిన గాదు
            యిప్పింప నేర్చి తామియ్యవలయు
కవులమంచని వింతగా నల్లినను గాదు
            చిత్రప్రబంధముల్ సేయవలయు
తపసులమని నిక్కి తలలు పెంచినఁ గాదు
            నిర్వికల్పసమాధి నెఱుగవలయు
యిచ్చినను నేమి వినయోక్తు లెఱుఁగవలయు
గడుసుకూఁతల సత్కీర్తి కలుగబోదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

63


సీ.

రామాండకథలెల్ల మేమెఱుంగనియవె
            కాటమరాజుకుఁ గర్ణుడోడె
భోగతకథలంత పోల నెఱుంగమే
            వేయి గణేశుఁ డర్జుని నిరఁగబొడిచె
భారతకథలలో బాలరాజొక్కఁడు
            కుంభకర్ణుని బట్టి కూలదన్నె
కందపురాణాలకథ పిల్లకాటేరి
            వీరభద్రుని నలయించి చంపె
ననుచు మూర్ఖులు పలుకుదు రవనియందుఁ
గవివరులు బోయిన కానికాలమందు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

64


సీ.

లత్తుకరంగు చల్లడము మిటారంపు
            చౌకట్లు తగటుఁ మిర్జాకుళాయి
మగవాల పంచిక మొగమందు జవ్వాది
            తిలకము జాతికెంపుల బులాకి

పులిగోరు తాళి పచ్చలబాజుబందు ని
            ద్దా మేల్కడాని జల్తారుపాగ
కుడిపదంబున కుజాగుల్కి ఘంటలు ఘల్ల
            ని మ్రోయుచుండు మానికపుటందె
నీటుగాఁ బిన్నవై పల్లెకూటమునకు
నరుగుచున్నట్లె ధేనుకాసురుని బట్టి
కొట్టి ధరఁ గూలద్రోయవా గుండెలవియ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

65


సీ.

వంకరపాగాలు వంపుముచ్చెల జోళ్ళు
            చెవిసందుకలములు చేరుమాళ్ళు
మీఁగాళ్ళపైఁ బింజె బాగైన దోవతుల్
            జిగితరంబైన పార్శీమొహర్లు
చేఁపలవలె బుస్తిమీసముల్ కంఠదా
            వలములు కడుపెద్ద వస్త్రములును
సొగసుగా దొరయొద్దఁ దగినట్లు కూర్చుండి
            రచ్చగాండ్లకు శిఫారసులు చేసి
కవిభటుల కార్యములకు విఘ్నములు చేయు
రాయసాల్ పిండములు తిను వాయసాలు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

66


సీ.

వలపు రూపెఱుగదు వసుధ మర్త్యులకు సూ
            కరమైన మనిసిగాఁ గానుపించు
నాకలిలో నాల్క యరుచి యెఱుంగదు
            యంబలైనను సుధయనుచుఁ గ్రోలు
గోపం బెదుటి గొప్పకొద్ది యెఱుంగదు
            ప్రాణబంధువునైనఁ బగతుఁ జేయు
నిదుర సుఖంబెఱుంగదు వచ్చినప్పుడు
            కసవైన విరిశయ్యగా గనపడు

గామంబు నిర్ణయకాలం బెఱుంగదు
            హెచ్చు చెందినవేళ నెనయగోఁరు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులగు మానవులనంగ నెంతవారు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

67


సీ.

వసుధాధిపతికి విశ్వాసగుణంబు జా
            రునకు సత్యంబు చోరునకు భయము
లంజెకు మోమోట పంజకు ధైర్య మెం
            గిలి కెగ్గు మద్యపాయులకు సిగ్గు
ద్రవ్యాధికులకును దానధర్మములపై
            దృష్టియు జారిణిస్త్రీకి వావి
పలుగాకులకు మేలు పందగొడ్డుకుఁ బాలు
            మానికిఁ గఱవు కోమటికి బరువు
మేకమెడచన్నులకుఁ బాలు మేడి పూలు
లేవు త్రిభువనములను గాలించి చూడ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

68


సీ.

వాగ్భూషణంబు నీ వర్ణన సేయుట
            కర్ణభూషణము నీ కథలు వినుట
హస్తభూషణము నీ కర్చన సేయుట
            నేత్రభూషణము నీ నీటు గనుట
హృదయభూషణము నిన్మదిఁ బాయకుండుట
            మూర్ధభూషణము నిన్ మ్రొక్కుటరయ
అంఘ్రిభూషణము నీ యానందనిలయప్ర
            దక్షిణం బేగుట ధర్మచరిత!
సతముగల భూషణము లెన్నిజన్మములకు
యెట్టివైనను వీని కెచ్చేమిగలదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

69

సీ.

వార్ధక్యమున చిన్నవయసు పెండ్లామైన
            దారిద్ర్యమునఁ బెక్కుతనయులైన
ఆత్రుఁడౌ భూపతి కతిభాషి మంత్రైనఁ
            బొరుగున నత్తిల్లు పొసగుటైన
సంగీతపరునకు జడదారి తోడైన
            నెనుముతో నట్టేట యీదటైన
బెను వానకాలమందున పైనమైనను
            జలికాలమున దీక్ష సలుపుటైన
మరణమిక వేరు లేదు భూమండలమున
లెక్క సేయంగనగునె యీ దుఃఖమహిమ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

70


సీ.

వితరణశౌర్యప్రతిష్ఠునకే కాక
            మీసము పిసినారికోసకేల
సిరిగల ఘనసువాసిని కొప్పునకుఁ గాక
            బొండుమల్లెలు బోడిముండకేల
ప్రజ సుఖింపగజేయు పంటచెర్వుకు గాక
            గండిగుంటకు ఱాతికట్ట యేల
జాతైన బారాహజారితేజికిఁ గాక
            కఱకుల కళ్ళెంబు గాడ్దెకేల
నతులితంబైన యల పతివ్రతకుఁ గాక
శుద్ధవేశ్యకు మంగళసూత్రమేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

71


సీ.

విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా
            యిందఱేమిటికంచుఁ గుందుచుండు
మోయీను కుగ్రాణమును జెప్ప వడ్లగిం
            జలకు బరాతముల్ సరవి వ్రాయు

తిండికిఁ జేటుగాఁ బండితులేల తె
            ప్పున సెలవిమ్మని పోరుచుండు
బారిశాల్వలు దెచ్చి బహుమతినిమ్మన్నఁ
            తలపక సీమవస్త్రముల నిచ్చు
నిట్టి యపకీర్తి మంత్రిని బెట్టఁదగదు
మంచిమాటల జరగఁ బోయించవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

72


సీ.

హేమాచలము శృంగమెక్కి ఱెక్కార్చుచుఁ
            గాకి యుండిననే పికంబు గాదు
గంగాది నదులలోఁ గలయ ముంచంగనే
            చీపురుపుల్లలు వేప గాదు
తెగఁ దిని తలపిక్క లెగసి బలసిన గాని
            దున్నపో తేనుగుగున్న గాదు
పొదుగు లావై యెంత పొడుగుగాఁ బెరిగినఁ
            గుక్కపో తెన్నఁడు గోవు గాదు
ఉన్నతస్థానమందు గూర్చుండగానె
భ్రష్టు భ్రష్టగు గాక శిష్టుండు గాడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

73


సీ.

అప్రయోజకునకు నారభటము గొప్ప
            యారిపొయ్యెడి దివ్వె కధికదీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
            బ్రతుకనేరని బిడ్డ బారెడుండు
వృద్ధినొందని చెట్టు వెఱ్ఱితీగిడు జాడ్య
            మెచ్చు ముందటికన్న నిచ్చు తళుకు
మన్నించుటకు దొరల్ గని చనవిచ్చుట
            పొయిసాలకే పాలు పొంగుటెల్ల

బెరుగుటయు విరుగుటకని నెఱుగలేక
యదరిపడుచుండు నొక్కొక్క యల్పజనుడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

74


సీ.

పాలన లేని భూపతిని గొల్చుట రోత
            యౌదార్యహీనుని నడుగ రోత
కులహీనజనులతోఁ గలహింపగను రోత
            గుణహీనజనులతో గూడ రోత
పాషండజనులపై భ్రాంతినొందుట రోత
            మధ్యపాయీలతో మైత్రి రోత
తుచ్ఛపు జనులకు నిచ్చనొందుట రోత
            చెలఁగి సద్గురు నిందసేయ రోత
వేదబాహ్యుల విద్యలు వినగ రోత
క్రూరుఁడైయున్న హరిభక్తుఁ గూడ రోత
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

75


సీ.

పసచెడి యత్తింటఁ బడి యుండుటది రోత
            పరువు దప్పినయెడ బ్రతుకు రోత
ఋణపడి సౌఖ్యంబు లనుభవించుట రోత
            పరుల కల్మికి దుఃఖపడుట రోత
తన కులాచారంబుఁ దప్పి నడచుట రోత
            ధరణీశునకు పిర్కితనము రోత
పిలువని పెత్తనంబులకుఁ బోవుట రోత
            యల్పుతో సరసంబులాడ రోత
ఒకరియాలిని గని వగనొంద రోత
సతికి జారపురుషుని బ్రతుకు రోత
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

76

సీ.

వ్యాసాదులగు మౌనివర్యులు తపసెల్లఁ
            బోగొట్టుకొనుట సంభోగమునకె
జలజాతభవ శివాదులు గూడఁ భ్రమగొని
            మురియుట యీ పాడు భోగమునకె
నేర్తుమంచని నెఱ్ఱనీల్గుచు విద్యలు
            కోటి నేర్చుట పొట్టకూటి కొరకె
ఏకచక్రమ్ముగ నేలిన రాజైన
            గడ కేడుజేనల కాటి కొరకె
కీర్తి యపకీర్తి దక్కఁ దక్కినవి నిల్వఁ
బోవు శాశ్వతమౌనట్లు పుడమిమీద
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

77


సీ.

సుంకరులకు వర్ణసంకరులకుఁ దన
            పొత్తొసంగెడి తొత్తుముండలకును
సారాయినీళ్ళకు జాతరగాండ్లకు
            బంగుభాయీలకు బందెనకును
బడవాలకును లేని భడవాలకును ఱంకు
            రాట్నాలకును శుంఠరండలకును
కలిమిదండుగులకు గారడీవిద్యకుఁ
            దోడఁబోతుల కాటదొమ్మరులకు
లోభితనమున నేడ్చె నిద్రాభవాని
గడన వీండ్లకె కాక సత్కవులకౌనె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

78


సీ.

వెల్లుల్లి వనములో వెలయంగ జోఱీఁగ
            పికము పాడూరను బెస్త రాజు
సాలె జేండ్రులలోన సాతాని పండితుం
            డంధులలోన నేకాక్షి శ్రేష్ఠుఁ

డతిలోభి రాజన కర్థంబు నడుగని
            వాఁడె పో పండితవర్యుఁ డరయఁ
గాఁపు మంత్రులలోనఁ గాటేరి దైవంబు
            కొక్కెరాయలలోనఁ గొంగ ఘనము
గుడిసెవేటుల నిల్లాలు గుత్తులంజె
గనుక నీ రీతిఁ బెక్కులు గలవు తలప
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

79


సీ.

నందిగణం బెక్కి నడువీథినే వచ్చు
            దైవమో గంగ మోదమ్ము రాజో
ఇసకాప్పసీనఁడో యీరుఁడో యీసుఁడో
            యీసుడైతే యెనకఁ దోఁకలేదె
ఆళ్ళరో గణపతో అమ్మ చీతమ్మరో
            చీతామ్మరైయుంటె సింగమేది
మంచిది చూతాము మారమ్మ కాబోలు
            మారెమ్మయైతేను మాలయేది
ప్రాకృతజనంబు లీరీతిఁ బలుకుచుంద్రు
తెలివి యించుక లేకను దెలిసికొనక
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

80


సీ.

పొరుగూరి కేగినఁ బోవునే దుర్దశ
            గాదె పెండిలి సన్నికల్లు దాఁచ
డొంకల డాఁగ బిడుగుపాటు దప్పునె
            కాలడ్డ నిలుచునే గాంగఝురము
కుమతిచేఁ జెడునె యెక్కుడు మంత్రి యత్నంబు
            లింకిపోవునె యనావృష్టి జలధి
ధవుడు పిన్నైన వైధవ్యంబు దప్పునే
            మనదె దీర్ఘాయువు మందు లేక

యర్కుఁ డుదయింపఁ జెడునె గుహాతిమిరము
తాళ మెత్తుకపోవ మందసములోని
విత్త మలవడకుండునే వెచ్చమునకు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

81


సీ.

ఆరగించంగ యోగ్యముగాక యుండునే
            పైతోలు బిరుసైన బనసఫలము
మాధుర్య మెడలునే మామిడిపండుకుఁ
            దొడిమపట్టున జీడి తొరలియున్న
గేదంగి నెఱిమౌళిఁ గీలింపకుందురే
            యగ్రభాగమున ముళ్ళలమికొన్న
నఖిలాంగసీమ యొయ్యారంబు గల్గిన
            యతివకు వాల్‍కన్నులైననేమి
గుణము బహుళంబు దోషంబు గొంచమైనఁ
గొదవఁ జెందక యుండు నెక్కుడు గుణంబు
తాఱుమాఱైన నిదియె పద్ధతి తలంప
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

82


సీ.

గోవధ గావించి గోరోజనమ్ము రో
            గార్తుల కొసఁగఁ బుణ్యాత్ముఁడగునె
ఫలశాఖిఁ బడ మొత్తి ఫలము లేఱించి భూ
            సురుల కర్పించిన సుకృతియగునె
నిండుతటాకంబు ఖండించి చేఁపల
            మత్స్యభుక్కులఁ దన్ప మాన్యుడగునె
గుడి కొట్టి యిటికలు గూరిచి తులసితి
            న్నెలు రచించిన ధర్మనిరతుఁడగునె
ప్రబలపాతకపూర్ణుఁ డల్పంపు సుకృత
మునను శుద్ధుండు గాకుండుననుట నిక్క
మాడు గాకేమి యిచ్చకం బనృతవాది
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

83

సీ.

మందుమాకిడి గండమాల మాన్పఁగలేఁడు
            చక్కఁజేయగలండె నక్కనోరు
వ్రేలివంకర మీఁద వీద నొత్తఁగలేఁడు
            కుదురుసేయగలండె గూనివీఁపు
త్రోయఁజాలఁడు కుక్కతోక వంకరైన
            నేటివంకలు దీర్ప నెట్టులోపు
తనవారి యొచ్చెంబు తాను దీర్పఁగఁజాలఁ
            డొరుల యొచ్చెము దీర్ప నోపునెట్లు
దైవకృతమైన వంకర దలఁగద్రోయ
వశము గాకుండు గద యెంతవానికైన
బొరలు దాని నెఱుంగడు బుద్ధి జడుఁడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

84


సీ.

ఋణశేషమున్నను రిపుశేషమున్నను
            వహ్నిశేషంబున్న వచ్చుఁ గీడు
భుక్తి వధూజనరక్తి నిద్రాసక్తి
            యగ్గలంబైనఁ గీ డావహిల్లు
గుత్సితాత్మునితోడఁ గోవధజనముతో
            గొండికవానితో గోష్ఠి తగదు
అర్భక పశు మందిరాంగరక్షల యందు
            నేమఱుపాటొంద నెగ్గుఁ జెందు
నిట్టి నయమార్గ మెఱుఁగక యిచ్చవచ్చి
నట్లు చరియించువారికి హాని వచ్చు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

85


సీ.

పెట్టి పోసిననాఁడె చుట్టాల రాకడ
            కలిమివేళనె వారకాంత వలపు
సేవ చేసిననాఁడె క్షితినాథు మన్నన
            వయసు గల్గిననాఁడె వనిత రక్తి

విభవంబు గలనాఁడె వెనువెంట దిరుగుట
            పని యున్ననాఁడె మావారలనుట
పోడిమి గలనాడె పొరుగింటి పోరచి
            మగుడింపఁగలనాఁడె తగవు సూటి
యాత్మశక్తి తొలగిన యవసరమునఁ
దనకు నెవ్వరు గానిది తథ్యమరయ
బలిమిచే నవయవములు పనికిరావు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

86


సీ.

చేరువ పగయును దూరపు మైత్రియు
            గావించెనేనియుఁ గార్యహాని
స్వనృపుతో వైర మన్యనృపాలమైత్రి
            యొనరించెనేనిఁ గీడొదవకున్నె
త్యాగంబునకు నాత్మభోగంబునకు గాని
            విత్తార్జనంబుఁ గావింపనేల
బాసకు లోనైనఁ బ్రతిబాషలాడినఁ
            బొలఁతితో భాషింపఁ బోవఁదగదు
యిట్టి నయమార్గ మెఱుగక యిచ్చ వచ్చి
నట్లు చరియించువారికి హాని జెందు
నాడికలు గల్గు నిది నిక్క మరసిచూడ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

87


సీ.

సూర్యుఁడు దశశతాంశువులఁ బో దఱిమినఁ
            గలుగవే గుహల చీకటులుఁ డాగ
ఝుంఝూనిలము దాడి సలుప దీపమునకుఁ
            గలుగదే వసియింపఁ గలశమొకటి
వని సాళువంబు గువ్వను బాఱఁ దఱిమినఁ
            దరుకోటరము లేదె దానిఁ బ్రోవ
గరుడుండు వెనుదాక గాకోదరము డాఁగ
            గలుగదే వాల్మీకబిల మొకండు

బలము గలవాడు దుర్బలు బాఱఁ దఱుమ
దైవమొక ప్రాపు గల్పింపఁ దలఁపకున్నె
పొరలునే ప్రొద్దహంకారమున నరుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

88


సీ.

మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి
            గదిసివేయుట లోభకారణంబు
దర్శనంబియ్యమి తప్పుసైపకయున్కి
            పెడమోముపెట్టుట ప్రియములేమి
గర్వంబు దెల్పుట కార్యాంతరాసక్తి
            సమయంబుగాదంట జరుపునేర్పు
నరయుదమన్న రంధ్రాన్వేషణాసక్తి
            యతివినయంబు ధౌర్త్యంబు తెరువు
లిట్టి ప్రభు దుర్ణయపుఁ జేష్ట లెఱుగలేక
వెంబడించెడివాడెపో వెఱ్ఱివాడు
వాని కొడబడఁ డింగితజ్ఞానశాలి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

89


సీ.

తన తల్లి చోటనే తప్ప నటించిన
            దురితాత్మునకుఁ గురుద్రోహమెంత
కొంకింతయును లేక గురున కెగ్గొనరించు
            కఠినాత్మునకుఁ గృతఘ్నత్వమెంత
కృతమెఱుంగని మహాకిల్బిషాయత్తచి
            త్తునకు మిత్రద్రోహ మనఁగనెంత
పరమమిత్రుల బాధపఱుచు దుర్ణయునకుఁ
            బ్రజలనందఱ గష్టపఱచుటెంత
యనుచుఁ దనదు చరిత్రంబు లవనిజనులు
నిందసేయంగ బ్రతుకు దుర్నీతిపరుని
వైభవంబౌర యని మెచ్చువాఁడెవండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

90

సీ.

అచ్చినవాని యిల్లాలిఁ గట్టఁగ జూచు
            దానియ్యవలసిన దండ మిడును
నలుసైనవాని యిల్లాక్రమింపఁగ జూచు
            దనకుఁ గీడయినఁ బాదములు పట్టు
నణువుగాఁ జూచుఁ గొండంతైనఁ దన తప్పు
            గోరంత యొరు తప్పు కొండసేయు
బంధులకిడరంచుఁ బరుల దూషించును
            దన యిల్లు చొచ్చినఁ దడకవెట్టు
దుర్ణయుల దుర్గుణంబులు ద్రోయరాదు
దానికి ఫలంబు యమసన్నిధానమునను
దేటపడు గాక యొరులకు దెలుప వశమె
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

91


సీ.

కందిరీగల పట్టు కడఁగి రేపఁగవచ్చు
            మానిపింపఁగరాదు దాని పోటు
చెట్లలో బెబ్బులిఁ జెనకి రావచ్చును
            దప్పించుకొనరాదు దాని కాటు
పఱచునశ్వము తోఁకబట్టి యీడ్వఁగవచ్చు
            దప్పించుకోరాదు దాని తన్ను
కాఁకచే బొరుగిల్లు గాల్చిరావచ్చును
            దన యిల్లు కాపాడఁ దరము గాదు
దుర్ణయులు మీదెఱుంగల దుండగమున
గార్యతతులెల్లఁ జేసి తత్కార్యఫలము
లనుభవింపుదు రాయాయి యవసరముల
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

92


సీ.

కన్నంబు ద్రవ్వి తస్కరు డింటివానికి
            వాడలేదని ముంత వైచి చనునె
తెరవాటుకాడు చింతించునే కట్టిన
            బట్ట నూడ్చిన మానభంగమనుచు

వలబడ్డ మెకము చూల్ వహియించెనంచును
            విడువంగఁ జూచునే వేఁటకాఁడు
జారుండు పరకాంత శయ్యపై దారిచి
            వావి గాదని పల్కి వదలి చనునె
యాత్మజను గుత్తరూకల కమ్మునాతఁ
డాదరమొసంగఁ జూచునె యల్లునకును
నెఱుగరింతియె గాక పరేంగితంబు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

93


సీ.

గోముఖవ్యాఘ్రంబు కూరలో నిడు నాభి
            కప్పకూఁతలు గూయు కాలభుజగ
మెరచిలోపల గాల మేటిలోపలి యూబి
            పైఁ బూరి గ్రమ్మిన పాడునుయ్యి
పైఁబండ్లుగలిగి లోపల బుచ్చు తరుశాఖ
            గొంగళిమూల దా గొలువురాయి
చొర నేమరించి ముంచుకొను ప్రవాహంబు
            కునుకువట్టినఁ జుట్టుకొను దావాగ్ని
దుర్జనుఁడు వాని నమ్మిన దొడరకున్నె
హాని యెంతటివానికినైన గాని
తలదడవి బాసజేసిన తగదు నమ్మ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

94


సీ.

శక్తి చాలనివాఁడు సాధుత్వము వహించు
            విత్తహీనుఁడు ధర్మవృత్తిఁ దలచు
వ్యాధిపీడితుఁడు దైవతభక్తి దొరలాడు
            ముండ పాతివ్రత్యమునకు జొచ్చు
నాపద ప్రాప్తింప నన్యార్తికి గృశించు
            భారంబు పైఁబడ బరువెఱుంగు
రమణి లేకున్న విరక్తి మంచిదియనుఁ
            బనిపోవ మౌనివర్తనము దాల్చు

నీ యభావవిరక్తుల కేమి ఫలము
తినక చవిచూడకయె లోఁతు తెలియబడునె
యెంతవానికినైన మహీస్థలమున
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

95


సీ.

తన తల్లి శిశువుల తల ద్రుంచివైచినఁ
            జెడుముండ యనుచు వచింపరాదె
తన తండ్రి యొరుల విత్త మపహరించిన
            నన్యాయవర్తనుం డనఁగరాదె
తన దేశికుఁడు పరదారసంగ మొనర్పఁ
            బాపకర్ముండని పలుకరాదె
తన రాజు ప్రజలపట్ల నదప జూచినఁ
            గ్రూరాత్ముఁడనుచు వాక్రువ్వరాదె
యిట్టి పలుకులు తప్పుగా నెన్నునట్టి
కుటిలచిత్తుల గర్వంబు కొంచెపఱుప
మీకు గాకన్యులకు శక్యమే తలంప
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

96


సీ.

ఆశకు ముదిమియు నర్థికి సౌఖ్యంబు
            ధనపరాయణునకు ధర్మచింత
కఠినమానసునకుఁ గరుణాపరత్వము
            వెఱ్ఱిమానిసికి వివేకగరిమ
యల్పవిదునకు నహంకారదూరత
            జారకామినికి లజ్జాభరంబు
బహుజనద్వేషికిఁ బరమాయురభివృద్ధి
            గ్రామపాచకునకుఁ గౌరవంబు
తామసగుణాఢ్యునకు సత్త్వగుణయుక్తి
పాపభీరుత సంతానబాహ్యునకును
గలదనెడు వార్త గలదె లోకములయందు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

97

సీ.

అర్థాతురునకు గృత్యాకృత్యములు లేవు
            కవిజనంబుల కెఱుంగనివి లేవు
కుక్షింభరుఁడు కాని కూటికి రోయఁడు
            కామాతురుం డర్థకాంక్ష వీడఁడు
వెలిచవుల్గొను కాంత వెఱవదు నిందకు
            నీతకు మిక్కిలిలోతు లేదు
పాపశీలికి దయాపరత యెందును లేదు
            వెఱ్ఱివానికి సాధువృత్తి లేదు
మద్యపానుల కనరాని మాటలేదు
గ్రామ్యునకు గల్గదెందు నాగరికముద్ర
తప్పెఱుంగక పోవఁ డుత్తమకులజుఁడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

98


సీ.

ఎరువు నిత్యంబౌనె యిల్లౌనె పందిలి
            యిల నెండమావులు జలములౌనె
వరవు డిల్లాలౌనె పాపు బంటౌనె
            గులటతనూజుండు గొమరుఁడౌనె
మెఱపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
            స్వాంగవాద్యంబులు తూర్యంబులౌనె
కంతి తలగడౌనె కల యథార్థంబౌనె
            పెనుదిబ్బ ముక్కాలిపీఁటయౌనె
గాని వస్తువుఁ బెట్టుకోఁ గాంక్షచేత
బెనఁగుమాత్రంబె కాని లభింపదేమి
దాని కొడఁబడఁ డింగితజ్ఞానశాలి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

99


సీ.

వేదశాస్త్రములు విన సొంపు లేదాయె
            సంగీతవిద్య బల్ చౌకనాయె
కవితారసజ్ఞత కలలోను లేదాయె
            బారమార్థికబుద్ధి భస్మమాయె

భూసురులకును దుర్బుద్ధులు మెండాయె
            నల్పులవైభవ మధికమాయె
వర్ణాశ్రమాచారవర్ణన లేదాయె
            హీనకులంబులు హెచ్చులాయె
అవనిపై నింక నాఁడు పుట్టువు ప్రశస్త
మందు లంజగఁ బుట్టిన నధికఫలము
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

100