ఈ పుట ఆమోదించబడ్డది

325. శరీరములో జీవాత్మకు కాపలాగ తోడుగ ఉన్న ఆత్మ బలము కంటే మాయబలము (గుణములు) 108 రెట్లు ఎక్కువ కావున జీవాత్మను తమవైపు లాగుకొను పందెములో శరీరములోని ఆత్మకంటే మాయయే ముందంజలో కలదు.

326. ఒక్కింత బలమున్న ఆత్మ, నూట ఎనిమిదింతలు బలముగల గుణముల ముందర ఓడిపోక తప్పదు.

327. ఆత్మ మార్గమును దైవమార్గమని, గుణమార్గమును మాయమార్గమని చెప్పిన వారు, దైవమార్గము ఇరుకైనదని, మాయమార్గము విశాలమైనదని చెప్పారు.

328. దైవమార్గము నీ సైజంతే కలదు. అందువలన ఇరుకైనది. మాయమార్గము (సాతాన్‌ మార్గము) నీ సైజుకంటే 108 రెట్లు ఎక్కువ కలదు. అందువలన విశాలమైనది.

329. మనిషిలో గుణములున్నవని అందరికి తెలుసును. కాని ఏ గుణము ఎప్పుడు ఎట్లు పని చేయుచున్నదో ఎవరికి తెలియదు. అందువలన కామమునకు మోహమునకు వ్యత్యాసము తెలియక రెండిటిని ఒకే విధముగ పోల్చుకొనుచున్నారు.

330. మనిషికి వయస్సు పెరుగుచు ముసలివాడగు కొలది శరీరబలము తగ్గిపోవుచుండును. కాని గుణముల బలము ఎక్కువగుచునే ఉండును. అందువలన వృద్ధులకు గుణముల ప్రభావమెక్కువ.

331. వృద్ధులు యువకులవలె శరీర శ్రమ (పని) చేయలేకున్నను యువకులకంటే ఎక్కువ ఆలోచించుచుందురు.