ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60


నీరుపెట్టకయే, క్షణకాలం గట్టిగానవ్వి, క్షణం ఎందుకో భయపడి క్షణం కోపించి, క్షణం ఏదో అలసటను ప్రదర్శించి, అనేక భావాల సాంకర్యానికి లోనైతే ఆ చేష్ట "కిలికించితం" అనబడుతుంది.

"భర్త చిరకాలానికి యింటికివచ్చాడు. భార్య అతనినిచూచి కొంత ఆనందాన్ని వ్యక్తపరచి ఇంటిపనులన్నీ తొందరగా ముగించి, ఏకాంతంగా వున్న పడకటింటింకి, భర్త సన్నిధికి చేరుకొన్నది. అప్పుడు భర్త ఆమెను పొదవుకొన్నాడు. ఆస్థితియందామె కొంతసేపునవ్వి, "ఇంత కాలంగా నన్ను విడచి ఉండగలిగేరు, నేనేమైపోయానో అన్న చింతకూడ మీకులేదు" అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించి, మీ వియోగంలో నేనెంతగా బాధపడ్డానని"పలుకుతూ ఏడ్పుకాని ఏడ్పును ప్రదర్శించి, తిరుగ నన్ను విడచి వెళ్ళవద్దంటూ భయాన్ని సూచించి అలసటతో అతని గుండెమీద ఒరిగిపోతే- ఆ చేష్ట కిలికించితం అనబడుతుంది.

4 విభ్రమము : పతి వస్తున్నాడని తెలిసినంతనే కలిగిన ఆనందంలో తొందరకలదై భార్య తన అలంకారలను తారుమారుగా ధరించడం జరిగితే ఆచేష్ట 'విభ్రమము' అనబడుతుంది.

"ఏమే! రవిక తిరుగవేసి తొడుక్కొన్నావు. బొట్టు పెట్టుకోలేదా? అదేమిటి ముఖాన నల్లగా ఉన్నది! కాటుక పెట్టుకొన్నావా కంటికి పెట్టుకోవలసిన కాటుక ముఖానికి పెట్టుకొన్నావేమిటే! ఇదంతా బావవచ్చేడన్న ఆనందమేనా!'-ఇత్యాదిగా నవయువతుల విభ్రమచేష్టను జూచి ఆనందంతో వృద్ధులు పలుకుతూ ఉంటారు.

5 లీల : తాను మిక్కిలిగా ప్రేమిస్తూఉన్న తన భర్తతోడి పొందు తనకు ఎంతకాలానికి లభించకపోతే, నిరంతరం భర్తనే ధ్యానిస్తూ అతని చరిత్రనే చెప్పుకొంటూ, మనో వినాదినికై చెలుల యెదుట- నా పతి యిలాఉంటాడని, ఇలా మాటాడుతాడని, ఇలానడుస్తాడని, ఆయన వేషం ఇలావుంటుందని, ఆయన ఇలానవ్వుతాడని, ఇలాకొంటె చూపులు చూస్తాడని అనుకరిస్తూ అభినయించడం 'లీల' అనబడుతుంది