పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద వివాహము.

55

క్రమంబునఁ దరళమై రాగలుబ్ధమై మోహాంబునిధిలోమునుఁగఁ జొచ్చినది. ఆమెను సంతతముదాపునఁ గూర్చుండఁ బెట్టుకొని పాడుచుండును.

దమయంతియు భోజన భాజనాదిక్రియలఁ బర్వతు నుపేక్షగాఁ జూచుచు నారదున కెక్కుడుగా బరిచర్య సేయుచుండెను. ఆవిపరీతము గ్రహించి పర్వతుం డొకనాఁడు నారదునితో నేకాంతముగా నిట్లనియె. మామా! ఈ రాజపుత్రికచేష్టలు మొదటనున్నట్లు లేవేమి? మన యిరువురకుఁ జేయు పరిచర్యలోఁ జాల వ్యత్యాసము గనంబడుచున్నది. నీకు భోజనము పెట్టి దావునఁ గూర్చుండి రుచు లడుగుచు దాళవృంతమున వీచుచుఁ గొసరి కొసరి వడ్డించుచున్నది. నాకట్లు కాక విస్తరిలో నున్నదియు లేనిదియుఁ జూడక విసరి పారవేయును. నీకు భర్తవలే నుపచారములు చేయుచున్నది. నాకు దాసునకు వలెఁ జేయుచున్నది. నేత్ర వక్త్ర వికారాదులు పరీక్షించితిని. నిన్ను భర్తగాఁ బడయఁగోరి నట్లున్నది. నీవు గూడఁ దత్తదను గుణక్రియల జరుపుచుంటివి. నిజము చెప్పుమని యడిగిన నారదుం డిట్లనియె.

పర్వతా! నీవనిననట్లీచిన్నది నన్ను భర్తగా గోరినట్లున్నదిదాని చర్యలంబరీక్షించిన నాహృదయము గూడఁ దరళమగుచున్నది. సిగ్గుచే నీకుఁ జెప్పితినికాను. ఇందులకుఁ గోపింపకుమని పలికిన విని పర్వతుఁడు,

క. పటు కోపస్ఫురితా ధర
    నిటలుండై నిప్పులురుల నేత్రములంద
    క్కట ఎట్టిపనినొనర్చితి
    విటుఁడవగుచుఁ దలఁపనిది వివేకమె మామా.

ఉ. ఇద్దఱిలోన భేదము వహింపఁగఁ గూడదు లోన నెప్పుడే
     బుద్ధిజనించునోయపుడెపో యెఱిఁగిఁ పదగుం బరస్పరం
     బెద్దియు గోప్యముంచఁదగ దేకడనంచు వచించుకోమె యా
     సుద్దులు మూలఁద్రోసి యిటుశోభనమున్ భజియింతెనారదా?